పరీక్షలదేముంది పరమేశా!
అయితే పాసు,లేదా ఫెయిల్
జీవితమే నిజమైన
ప్రహేళిక కాదా?
అపార్థాలు,అపనిందలు
వేటాడిన క్షణాలు,
అవమానాలు,అనుమానాలు
కలబడిన తరుణాలు,
అపజయాలు,అపనమ్మకాలు
చుట్టుముట్టిన సమయాలు,
ఒంటరితనం,పరాయితనం
దడిగట్టిన వేళలు,
దురదృష్టం,కష్టం
వేటాడిన సన్నివేశాలు,
అభద్రత,అశాంతి
ముసిరిన దశలు,
కర్మ,కాలం
ఒక్కటైన రోజులు,
ద్వేషం,శాపం
సంధి చేసుకున్న మలుపులు,
నిరాశ,నిరీక్షణ
సహజీవనం సాగించిన సందర్భాలు,
స్వామీ! నీవు చూపిన కరుణ
రేపటికి దారి చూపింది.
నిన్నటికి తెర దించి,
నేడుకు నడక నేర్పింది.
ప్రతి ఉదయం పరిమళమే
మోసుకు వస్తుందని ఆశను
రేపింది.
అహర్నిశమూ ఆనందమే
హృదయవికాసమను అర్థాన్నే
వివరించింది.
అంతా తుడిచివేస్తేనే
యోగమై ఉండగలదని
చేతిలో చేయి వేసి తెలిపింది.
జ్ఞానం గమ్యాన్ని చూపిస్తుందని,
అనుభవం అనంతమైన ఆర్తిని
ఉపశమింపజేస్తుందని,
సత్యం శాంతిని కల్గిస్తుందని,
పరిణతి పాత్రతనిస్తుందని
ఋజువు చేసింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి