తిరువప్పుడైయారు ఆలయం: - - యామిజాల జగదీశ్
 సంపదలిచ్చే కుబేర ఆలయం గురించే ఈరోజు ముచ్చట.
సంపదకు అధిపతి కుబేరుడు. ఆ స్థానాన్ని పొందడానికి కారణమైన తిరువప్పుడైయారు (Thiruvappudaiyar) దేవాలయం తమిళనాడులోని మధురైలోని చెల్లూరులో ఉంది.
బ్రహ్మ వంశం నుండి వచ్చిన 'పుణ్య సేనన్' అనే బ్రహ్మ భక్తుడు, అగస్త్య మహర్షి సలహా మేరకు ఈ ఆలయంలో కఠోర తపస్సు చేసాడు. ఎప్పటికీ ఏ మాత్రం తరిగిపోని సంపదను పొందాలని కోరుకున్నాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు, అతనికి 'కుబేరన్' హోదాతోపాటు అళగపురి నగరాన్ని ప్రసాదించాడు.
దానితో పాటు, ఈ ఆలయ ప్రభువు కుబేరుడికి ప్రపంచంలోని మొత్తం సంపదను నిర్వహించే అదనపు బాధ్యతను కూడా ఇచ్చాడు పరమేశ్వరుడు.
ఇంతకూ ఇక్కడెందుకు పూజించాలి?
ఆర్థిక అడ్డంకులను తొలగించి వ్యాపారంలో లాభం పొందడానికి శుక్రవారాల్లో ఇక్కడ శివుడిని పూజించడం ప్రత్యేకత.
ఇక్కడ నెయ్యి దీపం వెలిగిస్తే 1000 గోవులను దానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని ఆస్తికుల నమ్మకం.
పేదరికం తొలగి సుఖసంతోషాలతో జీవించాలనుకునే వారు పూజించ దగిన పవిత్ర క్షేత్రం ఇది.
మధురైలోని పంచభూత దేవాలయాలలో ఇది జల దేవాలయంగా చరిత్ర పుటలకెక్కింది. కనుక జీవితంలో ఒకసారైనా ఈ ఆలయాన్ని సందర్శించి 'అప్పుడైయార్'ని పూజించి కుబేర సంపదను పొందవచ్చు.

కామెంట్‌లు