సుప్రభాత కవిత : - బృంద
అవని కౌగిలి వీడలేని 
అగరు పొగల మంచు కోస్తూ
భువిని చేరే దారి వెదికే
కనక కాంతుల మయూఖాలు

జారుతున్న మంచు బిందువులు 
అక్షతలై తల మీద కురిపిస్తూ
అంతులేని వరాలు గుమ్మరిస్తూ
ప్రకృతిని దీవిస్తూ పొంగే పౌష్యమి

మంచు దుప్పటి తొలగించి 
మగత నిద్దుర వదిలేసి 
కమ్ముకున్న పొగమంచును
కళ్ళప్పగించి చూస్తున్న పుడమి

సూదిగుచ్చే సూర్య రశ్మికై 
చేతులు కట్టుకుని  నిలిచి
చలి తట్టుకుని వేచి
చూపు పరచి చూస్తున్న ధరణి

తెలిమంచు మేలిముసుగును 
మెల్లమెల్లగా తొలగిస్తూ 
కనులెత్తి  చూసి కనకాభిషేకాలు 
చేయాలని చూసే తుహిన గిరులు

చేయితిరిగిన చిత్రకారుడు
చేత బట్టిన చక్కని కుంచె 
చిత్రించిన రమ్య వర్ణ మిళితమైన
చిత్తరువై తోచు స్వర్ణ సంధ్యకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు