ప్రపంచ మహాసభల వేదికపై తిరుమలరావుకు సన్మానం

 పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మరో అరుదైన గౌరవాన్ని పొంచారు. మాస్ట్రో డా.గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో గుంటూరులో నిర్వహించిన ప్రపంచ తెలుగు కవుల మహాసభలలో భాగంగా శ్రీ జాషువా కరుణశ్రీ కవిసమ్మేళన వేదికపై  తిరుమలరావు స్వీయ గీతాన్ని ఆలపించి అందరి అభినందనలు పొందారు. అనంతరం శాలువా మెడల్ ప్రశంసాపత్రంలతో సమన్వయకర్తలు కొల్లి రమావతి, మల్లెతీగ కలిమిశ్రీ, ఎస్.ఎన్.ఎస్.కొల్లూరు, కొత్తగూడెం రాజేష్, భీమవరం శైలజా సునంద్, శ్రీసుధ కొలచిన, పురం సుధాంశ్ తదితర ప్రముఖులు ఘనంగా సన్మానించారు. 
72సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాల్లో తిరుమలరావు ఆహ్వానం అందుకొని, రెండో రోజు కార్యక్రమంలో పాల్గొని సన్మానం పొందారు. తెలుగు భాషా సంస్కృతి, పరిరక్షణ, అభివృద్ధి మరియు విశ్వవ్యాప్తి లక్ష్యంగా నిర్వహించిన ఈ ప్రపంచ తెలుగు మహా సభల్లో తెలుగు సంఘాల ముఖ్య సమన్వయకర్త కొల్లి రమావతి, ఈ మహాసభల ముఖ్య సమన్వయకర్త పెన్మత్స రామచంద్రరావుల సమన్వయంతో జరిగిన కవిసమ్మేళనంలో గగనమంత అనుభూతి గజల్స్ స్వర గీతి అనే గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ ప్రముఖ సామాజికవేత్త, కళాకారులు, దర్శకులైన రౌతు వాసుదేవరావు స్వరకల్పన వహించగా గజల్స్ కళ గురించి తన రచనను గీతంగా వినిపించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షలమంది తెలుగు భాషాభిమానులు సాహిత్య సాంస్కృతిక ప్రముఖులు హాజరౌతున్న ఈ కవుల మహాసభలకు తనకు ఆహ్వానం రావడం, కవి సమ్మేళనంలో సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. గుంటూరు సాయి బొమ్మిడాల నగర్, ఏటుకూరు హైవే ప్రాంగణం, స్పిరిచువల్ సిటీ సెంటర్ లో నందమూరి తారక రామారావు వేదికపై, మరో ఐదు వేదికలపై ఈ సంబరాలు నిర్వహించుచున్నారని తిరుమలరావు తెలిపారు. తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు జాతి ఘన కీర్తిని ప్రపంచానికి చాటే వేడుక ఈ మహాసభలని ఆయన అన్నారు. ఆంధ్రమేవజయతే అనే నినాదంతో నభూతో నభవిష్యతి అనిపించేలా కుంభమేళాను తలపించేలా అతిరథ మహారథుల సమక్షాన ఈ మహాసభలు జరుగుతున్నాయని తిరుమలరావు ఆనందం వ్యక్తం చేసారు. తెలుగు జాతిని విశ్వానికి చాటిచెప్పిన నందమూరి తారకరామారావు వేదిక కార్యక్రమ ఆవశ్యకతను చాటే ప్రధానవేదిక కాగా, హస్తకళలనాణెముల తాళపత్రాల శిల్పారామాల ఆర్ట్ మ్యూజియంలను ప్రదర్శించే చెరుకూరి రామోజీరావు వేదిక, వెయ్యి మంది కవులతో కవి సమ్మేళనంగా శ్రీ జాషువా కరుణశ్రీ వేదిక, పద్యం గద్యం అవధానాలు నిర్వహించేలా శ్రీనాథ మహాకవి వేదిక, పాడరా తెలుగు పాట అనే సందేశంతో ఘంటసాల వెంకటేశ్వరరావు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వేదిక, మఠాధిపతులు, అఘోరాలు, పీఠాధిపతులతో శ్రీనివాస కల్యాణం వంటి అంశాలతో పాటు చాగంటి కోటేశ్వరరావు గరికపాటి నరసింహారావు వంటి వారి ప్రవచనాలతో ఆద్యాత్మిక శోభను సంతరించుకునేలా మరికొన్ని కార్యక్రమాలు ఆంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించారని తిరుమలరావు తెలిపారు. అమ్మ నాకు ఆస్తి ఏమి ఇచ్చింది అనేది కాదు, అమ్మ నాకు భాష ఇచ్చిందని మనమంతా సగర్వంగా చాటి చెప్పేలా ఈ సభలు నిలుస్తాయని అన్నారు. భాషే మోసుకెళ్తాను కాటి దాకా అంటూ దృడమైన భావన ప్రతి తెలుగువారిలో ఉండాలనేది ఈ మహాసభల ప్రధాన భూమిక అని కుదమ తిరుమలరావు అన్నారు. అమరావతి రాజధాని పరీవాహక ప్రాంతమంతా ప్రతినోటా తెలుగు మాట హోరెత్తించునని ఆయన అన్నారు. మూడొందలకూ పైబడి తెలుగు ప్రముఖుల చిత్ర పటాలతో వారి జీవితచరిత్రలను తెలిపే ప్రదర్శన ఈ మహాసభల ప్రత్యేకతని కూడా ఆయన అన్నారు. రసరాజు రచన గజల్ శ్రీనివాస్ గానామృతంతో అన్ని దేవాలయాల గురించి వివరిస్తూ క్షేత్ర దర్శిని, తెలుగు తోరణం వంటి గొప్ప కార్యక్రమాలు ఈ మహాసభలలో చోటుచేసుకున్నాయని తిరుమలరావు అన్నారు. మూడు రోజుల పాటు మూడు పూటలా మధ్యాహ్న భోజనం, అల్పాహారాలతో ఆతిథ్యం ఇచ్చుచుండగా ఆ భోజన స్టాల్ లకు కూడా డొక్కా సీతమ్మ, పింగళి వెంకయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి పేర్లు పెట్టీ తెలుగు మహనీయులను స్మరిస్తూ ఈ సభల నిర్వహణ జరిగిందని ఆయన అన్నారు. అంతే కాకుండా మహనీయుల కుటుంబ సభ్యులకు మహా పూర్ణ కుంభ పురస్కారాలను  అందజేయడంతో పాటు, అందరి ప్రతిభకూ పట్టం కట్టారని తిరుమలరావు తెలిపారు. 1994 ప్రపంచ తెలుగు మహాసభలు మద్రాస్ లో నిర్వహించినపుడు కళ్ళు అనే కవిత ద్వారా పురస్కారం పొందిన తిరుమలరావు, తన రచనలతో సహస్ర కవిమిత్ర, తెలుగు తేజం, తెలుగు దీప్తి, గిడుగు రామమూర్తి పంతులు పురస్కారం, కాళోజీ నారాయణరావు, ఆంధ్ర సాహిత్య రత్న పురస్కారం వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 
కవితల, కథల, సప్తపదుల, అష్టాక్షరీ, సుభాషితాల, వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో పలు సార్లు విజేతగా నిలిచారు. ఇటీవల సాహితీ విలువలతో కూడిన తపస్వి మనోహరం సంకలనానికి ముఖచిత్రంపై తిరుమలరావును నిలిపి గొప్ప విశిష్టతతో కూడిన గౌరవాన్ని పొందారు.  ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన హమ్ ఫర్ నేచర్ పాటల పోటీలో స్వీయ గీతాన్ని ఆలపించి విజేతగా నిలిచిన తిరుమలరావు, నేడు ప్రపంచ స్థాయి వేదికపై సన్మానం పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు