సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -118: -అర్థాంగి అలుక - బోనులో ఎలుక
*****
ఏందిరా శిన్నోడా?  గట్లున్నవ్?  రాజ్జేలు పోగొట్టుకున్న రాజొతికె అగుపిత్తున్నవ్?
యాళ్ళ పొద్గాల తిండి తింటల్లేవా ఏంది? తడిశిన కోడి లెక్క ముడ్సుక పోయినవ్?"
అవ్వా! అస్సలే పెళ్ళాం బాదల ఉన్న. గిట్ల రాజ్జేలు పోగొడ్కున్ననీ, తడ్సిన కోడి లెక్కని బనాయించకవ్వా!"
 "గంత గనం మీ నడ్మల ఏం రసరసైందిరా మన్వడా! ఏమన్న పట్టుశీర కావాలందా?  మెడల ఆరాన్ని కొనమందా?"
 
ఓ అవ్వా! నువ్వేమన్న పోతులూరి బెమ్మంగారివానె. కాలగ్యానం శెప్పినట్టు పొల్లు బోకుండ శెప్పినవ్! ఇంట్లె ఆరం దినాలుగా గిదే రసరస. పోన్లే గదే సద్దుకుంటదన్కుంటే గియ్యాల వొంట గింట ఏం జెయ్యకుండా మూడంకేసి పండుకుంది. పోరగాండ్లు ఆకలికి అల్లాడుతుంటే  మీ నాయిన్ని అడుగు పోండ్రని నా తానకి పంపింది.
 'దినాం అజ్జేస్తే పీకల్దాక మెక్కుడే గని గవన్ని నాకేం జెయ్యొత్తది. 'ఇడ్డీలు వొడలే" అన్కుంట ఊళ్లె దిరిగే చెన్నమ్మని పిలిచి కడ్పు నిండ తినబెట్టిన.కడ్పు సల్లబడ్డంక గని పొల్లగాండ్ల గోల తగ్గింది."
 మరి నువ్వు సుత దినక బోయినవా మన్వడా?"
గది సుత దింట్లేదవ్వా! అదో మెట్టు దిగితే నేనో పది మెట్లు దిగుత? ఏం శెయ్యాల్నో తెల్వడం లేదవ్వా?  గిదిని ఇశారించి నువ్వేదన్న సలా ఇత్తవని గిట్లబడి వొచ్చిన!"
గింత శిక్కుల్ల బడ్డవేంది మన్వడా? అర్తాంగి అలుకతో బోన్ల ఎల్కొతికె అల్లల్లాడుతున్నవు.తప్పిదారి కుషాలుగున్నప్పుడు ఏదన్న మాటిచ్చినవా ఏంది? గది గింత మొండిపట్టు పొల్లగాదు నాకు దెల్సి."
 "అవునవ్వా మనది, కౌలు దీస్కుని శేత్తున్నది మంచిగ పండి నాల్గు పైసలు లాబమొత్తె పాతది శెడగొట్టి కొత్త నాంతాడు శేయిత్తనని జెప్పిన."
 "అసలే ఆడోల్లకి బంగారమంటె ఎక్కల్లేని ఆపాచ్చన.గిట్ల చేయిత్తనని మాట దప్పితే ఎట్ల మన్వడా! గది మూడంకె గాదు ముప్పై యారు అంకేశినా తప్పే లేదు పో!"
ఓష్నీ యవ్వా! నాకేమన్న ఉపాయం జెప్పి గీ కట్టపు బోన్లనించి బయటికి తీత్తవన్కుంటే ..బయటికొచ్చే తితినే లేకుండ శేత్తున్నవవ్వా!"
"గా బంగారం రోజు రోజుకీ  పాపం లెక్క ఎట్ల పెర్గుతుందో సూత్తనే ఉన్నగదనే! నువ్వు సుత దాన్నే ఎన్కేసుకొత్తున్నవ్!"
మాటంటే మాటనేరా మన్వడా! నగల దుకణానికి గొంటవో దాన్ని. గా రేటులు జూసి గదే ఎనక్కి తగ్గుద్ది. నా మాట ఎంత సుబూదో తెలుత్తది గద "
బలే ఐడా ఇచ్చినవ్ అవ్వా! పొద్దూకొచ్చి యిష్యం జెప్త ఆక్కుండ ఉర్కుల పోటీకి ఉర్కినట్టెల్తున్న మన్వడి వొంక నవ్వుకుంట జూసిందవ్వ.
పొద్దుగూకి పెళ్ళాన్ని ఎంట బెట్టుకొచ్చిన మన్వడ్ని, మన్వరాల్ని జూసి ఏం గొనుక్కొచ్చు కున్నరని అడ్గితే... అవ్వా పిసరు బంగారం గొనేట్టుందా? నా నాంతాడు సుత శెడగొట్టొద్దని సప్పుడుజేక వొచ్చినం."
గద్దెల్వదా మన్వరాలా? మొత్తానికి నువ్వల్గి మన్వడ్ని బోన్ల ఎల్కని జేసినవ్ అంటుంటే..."
"అవ్వా !అవ్వా!  బావ బోన్ల ఎల్కొతికె గందుల పడ్తడేమో సూద్దామా!" అంటున్న బుడ్డోడి మాటల్కి అందరు ఒక్క తీర్గ నవ్వబట్టిండ్రు."
గదండీ సంగతి." అర్థాంగి అలుక - బోనులో ఎలుక" అంటే గిదే మరి.

కామెంట్‌లు