కర్పగ వినాయకస్వామి: - - యామిజాల జగదీశ్
 ప్రపంచంలోనే మొట్టమొదటి వినాయకుడి ఆలయం... పిళ్ళైయార్‌పట్టి!! 
తమిళనాడులోని శివగంగను 
కళాత్మకతకు పెట్టింది పేరు. ఈ పరిధిలోనిదే పిళ్ళైయార్‌పట్టి. ఇక్కడి పవిత్రమైన కర్పగ వినాయకుడి ఆలయం గురించి ఓ రెండు మాటలు...
చరిత్రకారుల ప్రకారం, ఇక్కడ ఉన్న గణేశ విగ్రహం ప్రపంచంలోనే మలచబడిన మొట్టమొదటి వినాయక విగ్రహం. తమిళంలో వినాయకుడిని పిళ్ళైయార్ అంటారు. దాదాపు 1600 - 2500 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం మహేంద్ర పల్లవ శకానికి ముందు పాండ్యులు ఏర్పాటు చేసిన ఆలయమిది.
సాధారణంగా, గణేశుడికి నాలుగు చేతులు ఉంటాయి. కానీ ఇక్కడ, ప్రధాన దేవత రెండు చేతులతో 'యోగ స్థితిలో, కుడి చేతిలో లింగం పట్టుకుని దర్శనమిస్తాడు. ఇటువంటి రూపం మరెక్కడా చూడలేం. కనుక దీనిని అరుదైన రూపంగా భావిస్తారు!
ఇక్కడి వినాయకుడు 'ఉత్తర' దిశలో, అంటే సంపదలకు అధిపతి అయిన కుబేరుడి దిశలో ఉండటం వల్ల, ఈ స్వామివారిని పూజించే వారికి సంపదలు కలుగుతాయని ఆస్తికుల నమ్మిక.
ప్రతి వినాయక చతుర్థినాడు, ఈ ఆలయంలో పూజా సమయంలో, దాదాపు 80 కిలోల బియ్యప్పిండి, 40 కిలోల


బెల్లం, 50 కొబ్బరికాయలతో చేసిన కుడుముని స్వామివారికి
నైవేద్యంగా పెడతారు. 
సంవత్సరానికి ఒకసారి మాత్రమే, వినాయక చతుర్థి ఉత్సవాలలో భాగంగా 9వ రోజున, 80 కిలోల గంధంతో స్వామివారిని అలంకరిస్తారు. ఈ దర్శనం శుభప్రదమని భక్తుల విశ్వాసం.
అవివాహితులు పెళ్ళి కావడం కోసం ఇక్కడి కాత్యాయిని అమ్మవారిని ప్రత్యేకించి ఆరాధిస్తారు.
విద్యలో రాణించడానికి పిల్లలతో  వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
ఆధ్యాత్మికత, చరిత్ర కలగలిసిన ఈ అద్భుతమైన ఆలయాన్ని ఒక్కసారైనా సందర్శించి 'కర్పగ వినాయక స్వామి'ని దర్శించి తరిద్దాం!
కామెంట్‌లు