సంపూర్ణ మహాభారతము సరళ వ్యావహారిక భాషలో...!

 వన పర్వము చతుర్థాశ్వాసము- 111వ రోజు
ఇంద్రద్యుమ్నుడు
ధర్మరాజు మార్కండేయునితో అయ్యా " అయ్యా! మీరు చిరంజీవులు కదా మీ కంటే వయసులో పెద్ద వారున్నారా? " అని అడిగాడు. మార్కండేయుడు " ధర్మజా! పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండే వాడు. అతను చేసిన పుణ్యం కారణంగా చాలా కాలం స్వర్గ సుఖాలు అనుభవించాడు. పుణ్యం క్షీణించడం వలన అతనిని తిరిగి భూలోకానికి వెళ్ళమన్నారు. అతడు నా దగ్గరకు వచ్చి " మహర్షీ నేనెవరో మీకు తెలుసా? " అని అడిగాడు .అందుకు నేను " అయ్యా! మీరెవరో నాకు తెలియదు. హిమాలయాలలో నాకన్నా వయసులో పెద్ద వాడు ఉన్నాడు. అతని పేరు ప్రవార కర్ణుడు అనే గుడ్లగూబ. దానిని అడుగుము " అని చెప్పాను. ఇంద్రద్యుమ్నుడు నన్ను కూడా తనతో రమ్మన్నాడు. నేనే వృద్ధాప్యంతో రాలేనని చెప్పాను. అతను గుర్రం రూపం ధరించి నన్ను తీసుకు వెళ్ళాడు. ఆ గుడ్లగూబను కృడా నన్ను ప్రశ్నించినట్లే ప్రశ్నించాడు. ఆ గుడ్లగూబ కూడా " అయ్యా! నేను నిన్ను ఎరుగను కానీ ఇంద్రద్యుమ్నం అనే కొలనులో నాడీజంఘుడు అనే కొంగ ఉంది. దానికి తెలిసి ఉంటుంది అన్నది. ఇంద్రద్యుమ్నుడు నన్ను గుడ్ల గూబను తీసుకుని నాడీ జంఘుడిని వద్దకు తీసుకు వెళ్ళి నన్ను అడిగినట్లే అడిగాడు. అందుకు నాడీ జంఘుడు " అయ్యా ! నేను కూడా ఎరుగను నా కంటే పెద్ద వాడైన అకూపారుడు అనే తాబేలుకు తెలిసి ఉండచ్చు. దానిని అడగచ్చు " అన్నది. ఇంద్రద్యుమ్నుడు నన్ను, గుడ్లగూబను, కొంగను, తాబేలు వద్దకు వచ్చాడు. తాబేలును కూడా నన్ను అడిగినట్లే అడిగాడు. ఆ తాబేలు " అయ్యా! నేను ఎరుగక పోవడం ఏమిటి. ఆయన మహాత్ముడు గుణవంతుడు ఆయన నన్ను ఎన్నో ఆపదల నుండి కాపాడాడు. ఆయన ఎన్నో యజ్ఞాలు చేసాడు బ్రాహ్మణులకు ఆవులను దానాలు చేసాడు. ఆ యన దానాలు చేసిన ఆవుల గిట్టల రాపిడితోనే ఈ మడుగు ఏర్పడింది " అని చెప్పింది. తాబేలు చెప్పిన మాటలకు దేవతలు స్వర్గం నుండి విమానం తీసుకు వచ్చి " అయ్యా! మీరు పుణ్యాత్ములు మీకు శాశత స్వర్గలోక ప్రాప్తి లభించింది " అని చెప్పారు. ఇంద్రద్యుమ్నుడు " అయ్యా నా మాట ప్రకారం వీరంతా నా వెంట వచ్చారు వీరిని వారి వారి స్వస్థలాలలో వదిలి వస్తాను " అని చెప్పి అందరిని వారి వారి స్థలాలలో దింపి వచ్చి స్వర్గానికి వెళ్ళాడు.
దుంధుమారుడు
ధర్మరాజు మార్కండేయినితో " మహర్షీ! మీ కన్నా వయసులో పెద్దల గురించి చెప్పారు అలాగే ఇక్ష్వాకు వబ్శంలో జన్మించిన కువలయాశ్వునికి ఆ పేరెలా వచ్చిందో వివరించండి " అని అడిగాడు. అందుకు మార్కండేయుడు " ఉదంకుడనే మహర్షి విష్ణువుని గురించి తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి " ఏమి కావాలో కోరుకో" అని అడిగాడు . ఉదంకుడు " దేవా! నీవు ప్రత్యక్షం కావడం కంటే వేరే వరం ఎందుకు. సదా నా మనస్సు నీపై లగ్నం అయ్యేలా వరమిస్తే అదే చాలు. అన్నాడు. విష్ణువు " ఉదంకా ! నీకు జ్ఞానం సిద్దిస్తుంది అలాగే నీ వలన ఒక మహత్కార్యం సిద్దిస్తుంది. లోకకంటకుడైన దుంధుడు అనే రాక్షస సంహారానికి నీవు సహకరిస్తావు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన కువలయాశ్వునికి నా చేత ప్రసాదించబడిన యోగబలానికి నీ ప్రయత్నం తోడైతేనే సంహరింపబడగలడు. నీవు అతనిని సమాయత్తం చేసి ఈ కార్యం నెరవేర్చి లోకాలకు మేలు కలిగించు " అని చెప్పి మాయమయ్యాడు. ఉదంకుడు తన తపస్సు కొనసాగించాడు. ధర్మజా ! కువలయాశ్వుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడు. ఇక్ష్వాకు కుమారుడు అనసేనుడు. అతడి కుమారుడు పృధుడు. అతడి కుమారుడు విషగ్వుడు. అతడి కుమారుడు ఆర్దుడు. అతడి కుమారుడు యవనాశ్వుడు. అతడి కుమారుడు శ్రావస్తుడు. అతడి కుమారుడు బృహదశ్వుడు. బృహదశ్వుని కుమారుడూ కువలయాశ్వుడు. కువలయాశ్వునికి ఇరవై ఒక్క వేల కుమారులు ఉన్నారు అందరూ మహా బలవంతులు విలు విద్యలో ఆరితేరిన వారు. బృహదశ్వుడు కువలయాశ్వునికి రాజ్యం ఇచ్చి తపోవనాలకు వెళ్ళాలని అనుకున్నాడు.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు