శ్రీ సువర్ణధారా స్తోత్రము: - - యామిజాల జగదీశ్


 శ్రీ ఆదిశంకరాచార్యుల వారి కృతులలో “కనకధారా స్తవము” ఒకటి. సంపదల దేవత శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతించే అత్యంత ప్రాచుర్యం పొందిన సంస్కృత స్తోత్రం “కనకధారా స్తవము”. “బంగారు వర్షం“ కురిపించిన పురాణ కథతో ముడిపడిన స్తోత్రం. దీనిని నిత్యం పఠించడం వల్ల ధన, ధాన్య, సకల సంపదలు కలుగుతాయని విశ్వాసం. ఒకసారి ఆదిశంకరాచార్యులవారు భిక్షాటన చేస్తూ ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లారు. ఆ బ్రాహ్మణుడి భార్య, తనకున్న కొద్దిపాటి బియ్యంతోనే శంకరుడికి ఆహారం సమర్పించాలనుకుంది. ఆమెకు శంకరుడిని చూసి జాలి కలిగి, తన పేదరికానికి బాధపడి, తన భర్తను నిందించింది. శంకరాచార్యులు ఆమె నిస్సహాయతను చూసి, ఆమె భక్తిని మెచ్చి, శ్రీ మహాలక్ష్మీ దేవిని ప్రార్థిస్తూ ఈ స్తోత్రాన్ని రచించారు. ఆ స్తోత్రం పఠించిన వెంటనే, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంటిపై బంగారు నాణేలు (కనకధారలు) కురిశాయని, అందుకే దీనికి "కనకధారా స్తవం" అని పేరు వచ్చిందనేది  కథనం. అటువంటి స్తోత్రాన్ని "శ్రీ సువర్ణధారా స్తోత్రము" శీర్షికతో తెంపల్లె ఆంజనేయులు శర్మగారు ఆంధ్రీకరించారు. చక్కటి పదజాలంతో సాగిన శర్మగారి సువర్ణధారా స్తోత్రంలో ఉదాహరణకు ఒకటి రెండు పద్యాలు...
 
వందనము పద్మసన్నిభ వదన! నీకు
వందనమ్మగుఁ గలశాబ్ది నందనకును
ఇందు పీయూష సోదరీ! వందనమ్ము
వందనము విష్ణు వల్లభా! అందుకొనవె (పేజీ 19, 13వ పద్యం)
పద్మ సింహాసనా! నీకు వందనమ్ము
భూ వలయ నాయికా! నీకు మ్రొక్కులిడుదు
ప్రణతు లమరాది నద్దయా పరకు నీకు
శార్ఙి కళ్యాణి! మా నమస్తతులు గొనవె (పేజీ 19, పద్యం 14)
వందన మగు భృగుపుత్రికి
వందనము మురాసురారి వక్షస్థితకున్
వందనము కమల నిలయకు
వందనమగుఁ గమలనాభ వల్లభ కెపుడున్ (పేజీ 19, పద్యం 15)
అధిక పాఠ పద్యములు సహా మొత్తం 26 పద్యాలు అందించిన శర్మగారు శ్రీ రుధిరోద్గారి నామ సంవత్సరం కార్తీక బహుళ పాడ్యమి రోజున (24.11.1923 శనివారం) తూర్పుగోదావరి జిల్లా (నేడు కోనసీమ జిల్లా) రాజోలు తాలూకా మానేపల్లి గ్రామంలో తెంపల్లె సుబ్బలక్ష్మి, గోపాలమూర్తి దంపతుల మూడవ కుమారుడిగా ఆంజనేయులు జన్మించారు. ఆయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం నిడదవోలు సమీపంలోని కానూరులో సాగింది. హైస్కూల్ చదువు పూర్తికాకుండానే గోదావరి నదీతీర పట్టణం కొవ్వూరులోని ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో 22 ఏట 1945 మార్చిలో భాషాప్రవీణ అయిదేళ్ల కోర్సు ద్వితీయ శ్రేణిలో పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు. సంస్కృతంలో డిస్టింక్షన్ సాధించారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఎయిడెడ్ పాఠశాల, నర్సాపురంలో మిషన్ హైస్కూల్ ఎయిడెడ్ పాఠశాల, యలమంచిలిలో ప్రభుత్వ స్థానిక సంస్థల పాలనలో భాగమైన జిల్లా బోర్డు హైస్కూలు,  ఆకివీడు, దెందులూరు, మళ్లీ యలమంచిలి, ఎండగండి, పెద్ద అమిరం, కాకరపర్రు, నిడదవోలు, వీరవాసరం, దూబచర్ల, తణుకు, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం వగైరా ప్రాంతాల్లో పని చేశారు. కొయ్యలగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1979లో 55వ
ఏట పదవీ విరమణ చేశారు. అనంతరం అత్తవారి ఊరు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు (ప్రస్తుతం కాకినాడ జిల్లా)లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. సువర్ణధారా స్తోత్రానికి ముందూ తర్వాత కూడా ఆయన ఎన్నో రచించారు. పద్యానువాదాలు చేశారు. వాటిని భద్రపరుచుకోవడంగానీ, ప్రచురించే ప్రయత్నంగానీ చేయలేదు. ఎంఏ తెలుగు విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేవారు. అయినా ఏనాడూ వారి నుంచి ఏమీ ఆశించలేదు. ఎవరైనా ఇస్తానంటే సున్నితంగా తిరస్కరించేవారు. ఒత్తిడి చేస్తే ట్యూషన్ చెప్పడం ఆపేస్తానని హెచ్చరించే వారు. ఉద్యోగ సమయంలో జీతం, అనంతరకాలంలో పెన్షన్ మినహా ఇతరత్రా ఏ రాబడినీ అంగీకరించలేదు. ఆలయాల్లో పురాణ ప్రవచనం చెప్పిన సందర్భాల్లోనూ అదే వైఖరి. తనకై తాను విధించుకున్న నియమాలను ఏనాడూ అతిక్రమించలేదు. ఉద్యోగపర్వంలో న్యాయబద్ధంగా తనకు రావలసిన పదోన్నతులకు ఆటంకం కల్పిస్తే జడ్పీ చైర్మన్ అయినా, జడ్పీ సెక్రటరీ అయినా ఎదిరించడానికి వెనుకాడని ఆయన 1997 ఫిబ్రవరి 11న ప్రత్తిపాడులోని స్వగృహంలో కన్నుమూశారు. ఇక ఆయన సతీమణి సుబ్బలక్ష్మి భావనామ సంవత్సరం (25.8.1934, శనివారం) ప్రత్తిపాడులో జన్మించారు. తరచుగా బదిలీలయ్యే నాన్నగారికి చేదోడువాదోడుగా ఉంటూ కష్టాలను ఇష్టాలుగా మార్చుకుని అమ్మ ఇంటిని చక్కదిద్దేది, సమృద్ధిగా పాడిపంటలుండే ఇంట పుట్టినా వివాహానంతరం అంతంతమాత్రం సౌకర్యాలున్న ఊళ్లల్లో ఎనిమిదిమంది పిల్లలతో (పెద్ద కుమార్తె శారద 23 ఏళ్ల ప్రాయంలో మరణించారు. ఇక కుమారుడు, ప్రముఖ పాత్రికేయుడు టి.కె. లక్ష్మణరావు గారు 2025 డిసెంబరు 30వ తేదీనాడు తుదిశ్వాస విడిచారు.) కుటుంబాన్ని ఈదుకురావడం అంటే మాటలు కాదు. 'అనాయాసేన మరణం... వినా దైన్యేన జీవితం' అన్నట్లే 86 సంవత్సరాల వయసులో తన పనులు తాను చేసుకుంటూ చివరి రోజుల్లో దీనస్థితినిగానీ, చివర్లో మరణవేదనగానీ అనుభవించకుండా 6.6.2021నాడు ఇద్దరు. కుమారులు పక్కన ఉండగా నిద్దట్లోనే కన్నుమూశారు.
శర్మగారి “సువర్ణధారా స్తోత్రం” మొదటిసారి 1975లో ముద్రితమైంది. తిరిగీ 47 ఏళ్ల తర్వాత తమ తల్లిగారి సంవత్సరీకాల సందర్భంగా 2022లో రెండోసారి ప్రచురించారు.  
పద్యాన్ని శ్రావ్యంగా వినిపించి పదచ్ఛేదంతో ప్రతిపదార్థాన్ని వివరించి తాత్పర్యాన్ని శక్తిమంతంగా అందించి తెలుగుభాషపై మక్కువ రగిలించి పాఠాలపై పఠానానురక్తి కలిగించి విలువలకు గౌరవం పెంచి హితవచనాలకు మాధుర్యాన్ని రంగరించి సందర్భోచితంగా హాస్య, వ్యంగ్యోక్తుల్ని జోడించి తరగతి గదుల్ని రసమయం చేస్తూ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన తమ తండ్రిగారు తమకు వెలలేని నిధి అని, ఈ జన్మకు తమ పెన్నిధి అని కుమారులు, కుమార్తెలు నమస్కరించారు.


కామెంట్‌లు