సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -124*అన్నప్రాశనము నాడే  ఆవకాయ పెట్టినట్టు
**
"అవ్వా! గా  సంటోన్ని సూత్తుంటే పాపం అనిపిత్తున్నది.గాడు లబ్బలబ్బ మొత్తుకున్నా యినకుండా గొర్ర గొర్ర గొడ్డుని గుంజక పోయినట్టు  గుంజక బొయ్యి గాడ్ని బలంతాన గా బల్లె తోలిండ్రు.గుమ్మడి పండోలె ఉన్నోడు గాలిదీసిన బుగ్గ లెక్క అయ్యిండిప్పుడు. గాన్ని సూత్తుంటే అమ్మ నాయినకు ఏం అర్తం కాట్లేదవ్వా. 
పైంగ  మనమేం జెప్పబోయినా కంపలబడ్డ కుక్కల్లెక్క కయ్యికయ్యిమని మనమీద్కే మర్లబడుతుండ్రు.
 "అయ్యో! ఎవరు శెల్లె గా బుడ్డోడు? నాకు తెల్వకనే పాయె?" 
 గదే అవ్వా! గా మొగిలక్క మన్వడు. మొన్న ఐతారం పాలల్ల తోడైడానికి సల్ల సుక్క కోసం గాల్లింటికి ఎల్లిన.గాడి ముందల గంపెడు వొయ్యిలేసి ఉన్నయి. గంత శిన్నోడు వొయ్యిలతో ఎంత ముద్దుగా ఆడుకుంటుండు.గవ్వే ఆట వొత్తువులుగా ముందలేసిండ్రా ఏంది? ఇచ్చింత్రంగ అన్పిచ్చి గాని దగ్గర్కి ఎల్లి సూద్దును గద .గప్పుడే వాళ్ళమ్మ కొట్టిందేమో ఎక్కిళ్ళు బెట్టుకుంట వొల్లె వొయ్యి బెట్కొని ఎటెటో సూత్తుండు.ఎప్పుడూ నన్ను సూడంగనే నవ్వుకుంట దెగ్గర్కి వొచ్చేటోడు. ఈ త్యేప గాన్ని సూత్తుంటే కండ్లల్ల గిర్రున నీళ్లు తిర్గినయవ్వా! గంత శిన్నోడికి గవేం కట్టాలురా  దేవుడా! అన్కున్న.
అవునా శెల్లె! గా మాల్తి కొడుకేనా? గాడికింక మూడో ఏడు పడనే లేదు కదా! గప్పుడే బల్లెకు బోవుడేంది శెల్లె! గట్లెట్ల బంపుతున్నరు? మొన్న మొన్నటి దన్క అమ్మ నాయిన సంకనే దిగనోడు. గా వొయ్యిల నెట్ల సద్వుతడు శెల్లె? గాన్కి గా మూన్నెళ్ళ మున్పు బాసర్ల సరసతమ్మ తల్లికాడ అచ్చరాలు దిద్దిచ్చాలె. ఎళ్తమనుకుంటున్నమని జెప్పిండ్రు.
 "అవ్వా! గాడి సురుకుతనం,తెల్వే గాడికి శాపమైంది.గాడికి జల్ది మాటలొచ్చినయని గానితో ఏవేవో శిల్క పల్కులు పల్కిచ్చుడు మొదలు వెట్టిండ్రు. గదేదో పేద్ద బడంట.మూన్నాల్గేండ్ల  పొల్లగాండ్ల సద్వులకే ఏడాదికి లచ్చలు లచ్చలు పీజులు కట్టాలంట. గందుల అమ్మ నాయినను సుత పశ్నలడ్గి గవి సరిగ జెప్తెనే గా శిన్న పోరల్ని శెరీక జేస్కుంటరంట.గందుల వాడికి సీటొచ్చిందని ఆడకట్టంత అరిసెలు లడ్డూలు పంచిబెట్టిండ్రు. 'గాడెంత గాని వొయసెంత'గప్పుడే బల్లెకు పంపుడేందని మన్సు ఉండబట్టక అడ్గిన అవ్వా! నన్నో ఎడ్డెమొగం దాన్లెక్క జూసి, మీకు తెల్వదు గీ సద్వుల సంగతి.ఐనా ఎన్కటోళ్ళకి ఏం తెలుత్తదని ?ఎద్దేవా జేసిండ్రు.అయినా "యతార్త వాది లోక విరోది" లే అవ్వా!గందుకే నోర్మూసుకున్న. గాయింట్ల మొగిలక్కది ఏం సాగదు. గాని వొయసోడే మా మన్వడు జూడ్రాదు .గిప్పుడు గిప్పుడే అంగన్ బడికి ఎళ్తుండు. గాడు అక్కడ ఆడుకున్న ముచ్చెట్లు శెబుతుంటే మస్తు మంచిగనిపిత్తది.
 "ఏమో శెల్లె! ఎవలకేం శెప్పెటట్టు లేదు.  అన్నోళ్ళు కంటు."అన్న పాశన నాడే ఆవకాయ బెట్టినట్టుగా" ఉంది గీళ్ళ యవ్వారం.శిన్న పోరల శిన్నతనాన్ని గద్దలొతికే తన్కపోయి గా బల్లెల్ల ఏత్తున్నరు. గా బుడ్డ బుడ్డ పోరలకు భూతద్దాల కండ్ల జోళ్ళు వొత్తున్నయి.నడుములు వొంగిపోతున్నయ్. గా బలవంతమైన సద్వుతో శిన్నగున్నప్పటి నుంచే షుగర్ బీమారీ,బీపీ బీమారి వొత్తున్నాయంట. మొగ్గలు ఆటంతట అవే ఇచ్చుకోవాలె గని గట్ల బలంతాన యిప్పితే గయ్యి సరిగ్గ యిచ్చుకుంటయా? సద్వులకి బెట్టే లచ్చలు రేపు రేపు  కోట్లు బెట్టినా పొల్లగాండ్లు మన శేతికి రాని జబ్బులొత్తున్నయంట. గది తెల్సుకోవాలె.అమ్రెకా అంత దేశంలనే ఆరేండ్లు నిండినంకనే బల్లెకు పంపాల్నట.గిక్కడ సుత సర్కారు ఐదేండ్లు నిండాలని శెప్తే యినకుండ గా పైవేటు బల్లల్ల ఏత్తుండిరి. 
ఏమో శెల్లె! గా బుడ్డోడు కండ్లల్ల మెదిలి నాకు సుత దుఃఖమొత్తుంది. నేను సుత ఎల్లి శెబ్తా! "గాని శిన్నతనాన్ని గానికి యియ్యండి"."అన్న పాశన నాడే ఆవకాయ బెట్టినట్టు శేయకండని" నేను  శెబ్త శెల్లె.
సరే అవ్వా! వొత్తా మరి! అన్కుంట ఎల్తున్న బార్తమ్మొంక అట్లనే సూస్కుంట ఇశారం శెయ్యసాగింది అవ్వ.
గదండీ సంగతి! "అన్నప్రాశన నాడే ఆవకాయ బెడ్తే తట్టుకుంటడా".గంత శిన్న వొయసులో గాళ్ళని సద్వుల పేర్తో బలవంతంగా రుద్దితే మంచిగుంటడా? గది గిప్పటి  సందే అమ్మ నాయిన ఆలోచించాలె మరి.

కామెంట్‌లు