' ఒడిశా గాంధీ " గోపబంధు దాస్: - - యామిజాల జగదీశ్


 గోపబంధు దాసుని ఒరిస్సా ప్రజలు "ఉత్కల్మణి" గా, " ఒడిశా గాంధీ" గా అభివర్ణిస్తారు. 


సాంఘిక సంస్కరణలు, జర్నలిజం, సాహిత్య రంగంలో గోపబంధు దాసు ఒడిశాకు చేసిన అపారమైన కృషి మాటల్లో చెప్పలేనిది. సనాతన సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, సామాజిక ఉద్యమాలను వేగవంతం చేయడంలో ఆయన పాత్ర, నిస్వార్థ సేవ, విద్యా సంస్కరణలు దాసుకి 'ఉత్కల్మణి' (ఒడిశా రత్నం అని అర్థం) అనే బిరుదును సంపాదించి పెట్టాయి  గతంలో "ఒడిశా" ను "ఉత్కల్" అని పిలిచేవారు.



కలరా బాధితులను ఆదుకునేందుకు ఈయన పూరీ సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. అనంతరం కలరా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటుకు ఉద్యమించారు.


1877 అక్టోబరు 9వ తేదీన పూరీకి సమీపంలోని సువాండో గ్రామంలో స్వర్ణమయీ దేవి, దైతరీ దాస్ దంపతులకు జన్మించిన ఈయన, 1936లో ఒడిశాను భారతదేశంలో మొదటి అధికారిక భాషాప్రయుక్త రాష్ట్రంగా మార్చడంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రత్యేక ప్రావిన్స్ ను రూపొందించడంలో ఒడిశాకు ఈయన చేసిన కృషి తరతరాలకు గుర్తుండిపోతుం దనడం అతిశయోక్తి కాదు.


గోపబంధు విద్య వల్ల సమాజంలో మార్పు వస్తుందని నమ్మారు. 1893లో పూరి జిల్లా పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే ఉపాధ్యాయుడు ముఖ్తియార్ రామచంద్ర దాసు ఈయనను ప్రభావితం చేసారు.


1909లో సాక్షి గోపాల్ వద్ద సత్యబడి బనా బిద్యాలయ పేరుతో పాఠశాలను స్థాపించారు. ఒడిశాలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా సమాజాన్ని సంస్కరిస్తానని ప్రతిజ్ఞ చేశారు. 
విద్య ద్వారా యువతలో దేశభక్తిని పెంపొందించి, మానవ జీవిత విలువల గురించి చాటిచెప్పారు.


గోపబంధు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆయన 12 సంవత్సరాల వయస్సులో ఆప్తిని వివాహం చేసుకున్నారు. 28వ ఏట ఆమె కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. భార్య, ముగ్గురు కుమారులు మరణించిన తరువాత, తన కుమార్తెలను తన అన్నయ్య వద్ద విడిచిపెట్టి, వారసత్వపు వాటాను ఇచ్చేసారు. అనంతరం ఆయన తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు.



గోపబంధు కటక్‌లోని రావెన్‌షా కళాశాలలో చదివారు. ఈయన విద్యార్థి దశలోనే ప్రజలకు సేవ చేయడానికి, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి తన స్నేహితులను చైతన్యపరిచి ప్రోత్సహించారు. సామాజిక సేవ పట్ల అభిరుచితో బిఏలో మొదటి సారి ఫెయిలయ్యారు. రెండవ ప్రయత్నంలో ప్యాసయ్యారు. 


తరువాత, ఆయన కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఎల్.ఎల్.బి. ప్యాసయ్యారు. అనంతరం, ఆయన కటక్‌లోని హైకోర్టుకు వెళ్లే ముందు పూరీలో ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత మయూర్‌భంజ్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. అయితే న్యాయవాదిగా తన వృత్తిని కొనసాగించడం ఇష్టం లేక దానిని విడిచిపెట్టి, సామాజిక సేవపై దృష్టి మళ్ళించారు.



గోపబంధు పేదలకు, అందులోనూ నిరుపేదలకు సేవ చేయడానికి కట్టుబడిన ఆయన  అనారోగ్యంతో ఉన్న తన కొడుకును పట్టించుకోకుండా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి తన వంతు సేవ చేశారు.


“నా కొడుకును చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. అయితే వరదల కారణంగా ప్రజలు నష్టపోతున్నారు. వారిని ఆదుకోవడం కోసమే నా ప్రథమ కర్తవ్యంగా బావించాను. నా కొడుకును పూరీ జగన్నాథుడే చూసుకుంటాడు” అని చెప్పారు.


ఆయన కోల్‌కతాలో ఉన్న సమయంలో, తనలో స్వదేశీ స్ఫూర్తిని నింపిన వందేమాతరం బృందంతో పరిచయం ఏర్పడింది. ఆయన ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ మొదటి అధ్యక్షుడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడానికి ప్రజలను ప్రేరేపించడానికిగాను 1921లో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని ఒడిశాకు రప్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో అనేకసార్లు జైలుకెళ్లారు. 


ఇక్కడో విషయం చెప్పుకోవాలి. గాంధీజీ తన జీవితకాలంలో 1921 - 1946 సంవత్సరాల మధ్య మొత్తం ఎనిమిదిసార్లు ఒడిశాను సందర్శించారు. మొదటిసారి ఆయన 1921 మార్చి 23న ఒడిశాలో పర్యటించారు. ఆరోజు డోలా పూర్ణిమ. మార్చి 29వ తేదీ వరకు ఆయన ఒడిశాలో ఉండి వివిధ కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్ర్యోద్యమ ప్రాధాన్యం గురించి ప్రజలను చైతన్యవంతం చేశారు. మార్చి 29న బర్హంపూర్ సందర్శించి అక్కడి స్టేడియంలో పండిట్ గోపబంధుతో కలిసి ప్రసంగించారు. 


తర్వాతి కాలంలో 1925,  1927, 1928, 1934 (రెండు విడతలు), 1938, 1946లలో గాంధీజీ ఒడిశాలో పర్యటించారు. 1946లో ఆయన చెన్నై వెళ్తూ బలేశ్వర్, భద్రక్, కటక్, బర్హంపూర్ రైల్వేస్టేషన్.లలో తమ మద్దతుదారులను కలిసారు. భారీ సంఖ్యలో జనం ఆయా స్టేషన్లకు తరలివచ్చి గాంధీజీని చూశారు.


ప్రముఖ నాయకుడు సుభాష్ చంద్రబోస్ ఆయనను ఒడిశాలో జాతీయ ఉద్యమ పితామహుడిగా పిలిచారు.


ఆయన ఓమారు స్కూల్స్ ఇన్ స్పెక్టరును ఉద్దేశించి రాసిన ఓ కవిత ఆయనకు శిక్ష పడేలా చేసింది. క్షమాపణలు చెప్పమని అడిగితే చెప్పేది లేదని గట్టిగా చెప్పారు. దాంతో ఆయనను దండించారు. 


ఆయన ప్రముఖ రచయిత. కవి. కర కబిత, చిలిక, ధర్మపథ, బండిర ఆత్మ కథలతో సహా మరిన్ని రచనలు చేశారు. ఇంద్రధను, బిజులి పత్రికలకు ఆయన క్రమం తప్పక వ్యాసాలు రాస్తూ వచ్చారు.  గోపబంధు ఒడిశాలో పత్రికా స్వేచ్ఛకు మార్గదర్శకులుగా నిలిచారు. ఆయన లోక్ సేవక్ మండల్ జాతీయ ఉపాధ్యక్షుడు. ఒడియా జర్నలిజంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1914లో 'సత్యబడి' అనే మాసపత్రికను ప్రచురించారు. తరువాత, 1919లో 'ది సమాజ్' అనే వారపత్రికను నడిపారు. ఇది ఒకప్పుడు ఒడిషాలో ప్రముఖ పత్రిక. చివరి శ్వాస వరకు ఆయన 'సమాజ్' సంపాదకుడిగా వ్యవహ రించారు.


ఈయన లోక్ సేవక్ మండల్ కు ఉపాధ్యక్షుడిగా 1928 ఏప్రిల్ లో ఎంపికయ్యారు. అనారోగ్యంతోనే లాహోరులో జరిగివ సొసైటీ మీటింగుకి హాజరైవ ఆయన 1928 జూన్ పదిహేడున తన యాభయ్యో ఏట తుదిశ్వాస విడిచారు.


కామెంట్‌లు