వన పర్వము పంచమాశ్వాసము
* 128వ రోజు*
ఘోషయాత్ర
కర్ణుడు, శకుని, సోదరులు, బంధువులను తీసుకుని పరివారంతో వాహనము ఎక్కి ద్వైతవనానికి దుర్యోధనుడు బయలుదేరాడు. ఒక చోట శిబిరాలను ఏర్పరచుకుని గొల్ల వారిని అడిగి గోవుల మంచిచెడులు విచారించి వాటన్నిటి మీద ముద్రను, సంఖ్యను వేయించాడు. అడవికి వెళ్ళి వేటాడాడు. ఎన్నో మృగాలను చంపాడు. ద్వైతవన సరస్సుకు చేరాడు. ఆ సమయంలో ధర్మరాజు సద్యస్కందం అనే యాగాన్ని అక్కడి మునుల సాయంతో చేస్తున్నాడు. సుయోధనుడు తన వైభానికి తగినట్లు క్రీడా గృహములు నిర్మించమని చెప్పాడు. అక్కడ కాపలా ఉన్న గంధర్వులు వారిని అడ్డగించారు. వారు " ఇది చిత్రసేనుడనే గంధర్వరాజుకు చెందిన కొలను. ఇక్కడకు మీరు రాకూడదు. వెనక్కు వెళ్ళండి " అన్నారు. భటులు " ఇక్కడకు సుయోధన సార్వభౌములు వచ్చారు. అందు వలన మీరే ఇక్కడ ఉండక వెళ్ళండి " అని బదులిచ్చారు. గంధర్వులు ఆగ్రహించి " మీ రాజుకు తన బలం ఎదిరి బలం అసలు తెలియదు. గంధర్వరాజు దగ్గర ఇలాంటి దుశ్చర్యలు చెల్లవని చెప్పండి " అని హేళనగా పలికారు. భటుల ద్వారా విషయం తెలుసుకున్న దుర్యోధనుడు భటులతో " మీరు తక్షణం వెళ్ళి ఆ గంధర్వుల గర్వం అణచండి. దేవతలు దేవేంద్రునితో సాయం వచ్చినా వారిని కూడా జయించండి " అని ఆజ్ఞాపించాడు. కౌరవులు తమబలాలతో గంధర్వుల మీదకు దండయాత్రకు వెళ్ళారు. గంధర్వులు వారితో " మీకు మాకు ద్వేషం ఏముంది? ఆగండి " అన్నా వారు లక్ష్యపెట్టక వారి పై ఆయుధాలు ప్రయోగించారు. గంధర్వులు చిత్రసేనునికి జరిగినది వివరించారు. చిత్రసేనుడు ఆగ్రహించి " కౌరవసేనలను చీల్చి చెండాడండి " అని ఆజ్ఞాపించాడు. గంధర్వసేనలు కౌరవసేనను చీల్చి చెండాడాయి. గంధర్వుల ధాటికి నిలువ లేక దుశ్శాసనుడు పారిపోగా కర్ణుడు మాత్రం ధైర్యంగా పోరాడుతుండగా దుర్యోధనాదులు ఇది తెలుసుకుని యుద్ధరంగానికి వచ్చారు. కౌరవులకు గంధర్వులకు మధ్య జరిగిన ఘోరమైన పోరులో గంధర్వులు ఓడి పోయారు. వారు చిత్రసేనునికి జరిగినది చెప్పారు.
సుయోధనుడు గంధర్వుల చేతిలో బంధీ అగుట
చిత్రసేనుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. చిత్రసేనుడు మాయాయుద్ధ నిపుణుడు. అతని మాయా యుద్ధానికి కౌరవ సేన తట్టుకొనలేక పారిపోయింది. కర్ణుడు మాత్రము వారితో తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు. దుర్యోధనుడు కర్ణునికి సాయంగా ఉన్నాడు. శకుని దుర్యోధనుని సోదరులు దుర్యోధనునికి సాయంగా నిలిచారు. గంధర్వులు గుమిగూడి ఎలాగైనా కర్ణుడిని చంపాలని నిశ్చయించుకొని కత్తులతో శూలాలతో గదలతో చుట్టుముట్టి కొందరు కర్ణుని రథం ను విరగకొట్టారు.కొందరు గుర్రాలను, కొందరు సారధిని పడగొట్టారు. కొందరు కవచమును చీల్చారు. అంత కర్ణుడు రధంనుండి దూకి వికర్ణుని రథం ఎక్కి యుద్ధం నుండి బయటకు వెళ్ళాడు. అప్పుడు చిత్రసేనుడు దుర్యోధనుని రథం విరిచి దుర్యోధనుని జుట్టు పట్టుకుని నేల మీద పడవేసి తన రథానికి కట్టి గట్టిగా సింహనాదం చేసాడు. అది చూసిన మిగిలిన గంధర్వులు మిగిలిన కౌరవులను, వారి భార్యలను దుర్యోధనుని భార్యను, కౌరవ రాకుమారులను మంత్రులను పట్టి బంధించి చిత్రసేనుని ముందు ఉంచారు. అది చూసి మిగిలిన వారు అక్కడే ఉన్న ధర్మరాజు వద్దకు వెళ్ళి రక్షించమని మొర పెట్టుకున్నారు. అది విన్న భీముడు " ఆహా మనం చేవదలచిన కార్యం గంధర్వులే చేసారు. ఏ విధమైన శ్రమ లేకుండా మనకు విజయం చేకూర్చి గంధర్వులు మనకు మహోపకారం చేసారు. పుట్టిన నాటి నుండి పాపాలు మాత్రమే చేయటానికి అలవాటు పడిన దుర్యోధనునికి ఈ నాటికి గర్వభంగం చేసిన బ్రహ్మ ఎంత నేర్పరో కదా. అడవులలో అష్టకష్టాలు పడుతున్న మనల్ని అవమానించటానికి వచ్చిన దుర్యోధనునికి తగిన పరాభవం జరిగింది. అందు వలన దుర్యోధనుని పై దయ చూపరాదు " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి