భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసిన యోధుల గురించి మనం నిత్యమూ ఎవరి ఒకరి నోటంట వింటూనే ఉంటాము. కానీ చాలా మంది యోధులు గుర్తింపే లేకుండా చరిత్ర పుటల్లో తెరమరుగైనవారెందరో ఉన్నారు, అటువంటి వారి గురించి చాలా మందికి తెలియదు. ఈ యోధుల గురించి మనకందుబాటులో ఉన్న పుస్తకాల్లో కూడా పెద్దగా ఉండదు. అలాంటి స్వాతంత్ర్య సమరయోధుల్లో కర్తార్ సింగ్ సరభా ఒకరు.
కర్తార్ సింగ్ కేవలం 19 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. భగత్ సింగ్ కర్తార్ సింగుని ఆదర్శంగా భావిస్తాడు. భగత్ సింగ్‌ను అరెస్టు చేసినప్పుడు, అతని వద్ద కర్తార్ సింగ్ సరభా ఫోటో దొరికిందని చెప్పుకుంటూ ఉంటారు.
కర్తార్ సింగ్ 1896 మే 24న పంజాబ్‌లోని లూథియానా జిల్లాలోని సరభా గ్రామంలో జాట్ సిక్కు కుటుంబంలో సాహిబ్ కౌర్, మంగళ్ సింగ్ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులకు ఇతను ఏకైక కుమారుడు. కర్తార్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. దాంతో అతను తాత వద్ద పెరిగాడు. అతని ప్రాథమిక విద్య లూథియానాలో సాగింది. అతను చదువులో తెలివైనవాడు. అతనిని కెమిస్ట్రీ చదివించడానికి బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి పంపాడు తాత.
1912లో అమెరికా వెళ్ళినప్పుడు అతని వయస్సు 15 సంవత్సరాలు. అక్కడ చదువుతున్న రోజుల్లో కర్తార్ తన గ్రామానికే చెందిన ఒక యువకుడితో నివసించాడు.
శాన్ ఫ్రాన్సిస్కో చేరుకోగానే ఇమ్మిగ్రేషన్స్‌లో జరిగిన ఒక సంఘటన అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. భారతీయులు అవమానకరమైన ప్రశ్నలకు లోనవుతున్నారని, ఇతర ప్రాంతాలు, దేశాల నుండి వలస వచ్చినవారిని కనీస లాంఛనాల తర్వాత అనుమతించడం గమనించాడు. భారతీయులను బానిసలుగా చిత్రీకరిస్తూ రెండవ శ్రేణి పౌరులుగా పేర్కొనడం అతనిని నొప్పించింది.
అతను భారతదేశంలో బ్రిటిష్ పాలన ఉనికిని ప్రశ్నించడం ప్రారంభించాడు. బర్కిలీలోని నలందా క్లబ్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్‌తో ఉన్న అనుబంధం అతనిలో దేశభక్తి భావాలను రేకెత్తించింది. అమెరికాలో భారతీయ వలసదారులకు, ముఖ్యంగా కార్మికుల పట్ల వ్యవహరించే తీరు గురించి అతను తరచుగా ఆందోళన చెందాడు.
కర్తార్ సింగ్ తన విద్యకు అవసరమైన డబ్బులకోసం పండ్ల పెంపకందారునిగా పని చేశాడు. భారతీయ వ్యవసాయ కూలీలు తరచుగా వేతనాల పరంగా వివక్షకు గురవుతున్న విషయం అతనిని కలవరపరిచింది.
దీంతో తాను ఏదో ఒకటి చేయాలన్న కారణంగా 1913లో గదర్ ఉద్యమం పుట్టినప్పుడు, కర్తార్ సింగ్ కీలక సభ్యుడు అయ్యాడు. బ్రిటీష్ వారిని భారతదేశం నుండి తరిమికొట్టాలనే లక్ష్యంతో ఒరెగాన్‌లో ఏప్రిల్ 21, 1913న భారతీయులు గదర్ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ పంజాబీ భాషలో ఓ సంచికను తీసుకురావడానికి కర్తార్ సింగ్ బాధ్యత వహించారు. పంజాబీతోపాటు హిందీ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతీ తదితర భాషలలో వెలువడిన ఈ పత్రికతో గదర్ పార్టీ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు తెలియవచ్చింది.
ఈ వార్తాపత్రిక బ్రిటిష్ వారి దురాగతాలను ఎత్తిచూపింది. విదేశీ భారతీయులలో విప్లవాత్మక ఆలోచనలకు ఆజ్యం పోసింది. ఇంతలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఈ పార్టీ తన స్థావరాన్ని స్వదేశానికి మార్చడానికి, దేశ ప్రజలను సమీకరించడానికి ఇదే తగిన సమయమని నిర్ణయించుకుంది.
ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు తమను తాము రక్షించుకోవడంలో నిమగ్నమైనందున, 1914 ఆగస్ట్ 5న గదర్ సంచికలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరో యుద్ధ ప్రకటన జారీ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయు లలో, ముఖ్యంగా బ్రిటిష్ కంటోన్మెంట్లలోని భారతీయ సైనికులకు ఈ పొర్టీ పత్రికను పంపిణీ చేశారు. సెప్టెంబర్ 15న, కర్తార్ సింగ్, సత్యేన్ సేన్, విష్ణు గణేష్ పింగ్లేతో కలిసి భారతదేశానికి బయలుదేరాడు. కోల్‌కతాలో యుగాంతర్‌కు చెందిన జతిన్ ముఖర్జీని కలిశాడు. ముఖర్జీ అతన్ని రాష్ బిహారీ బోస్ ని పరిచయం చేశాడు. కర్తార్ సింగ్ బెనారస్‌లో బోస్‌ను కలిశాడు. దాదాపు 20,000 మంది రాకను, వారి విప్లవ ప్రణాళికలను అతనికి తెలియజేశాడు. ఈ విషయం తెలియడంతోనే బ్రిటీష్ వారు తిరుగుబాటుదారులను పట్టుకోవడానికి "భారీ ఆపరేషన్" ప్రారంభించారు. అనేక మంది నౌకాశ్రయాలలోనే అరెస్టు చేశారు. అయినప్పటికీ కర్తార్ సింగ్ ముందస్తు ప్రణాళికను ఆపలేకపోయింది. అతను పంజాబ్‌లో విప్లవానికి పునాదిని సిద్ధం చేశాడు.
బ్రిటీష్ సైన్యంలోని భారతీయ సైనికులను ఉద్యమంలో చేర్పించేందుకు ప్రణాళికలు రూపొందించాడు. ముఖ్యంగా మీరట్, ఆగ్రా, బెనారస్, అలహాబాద్, అంబాలా, లాహోర్, రావల్పిండి కంటోన్మెంట్‌లలో చేర్పించేందుకు కర్తార్ దృష్టి సారించాడు. లూథియానాలో చిన్న తరహా ఆయుధాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు.
తిరుగుబాటు తేదీని 1915 ఫిబ్రవరి 21గా బోస్‌తో సహా సీనియర్ నాయకులు నిర్ణయించారు. అంబాలా తిరుగుబాటుకు సిద్ధమైన సమయంలో మియాన్ మీర్, ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్‌లపై దాడి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇక్కడ కూడా, తిరుగుబాటుకు ఒక రోజు ముందు ఒక దేశద్రోహివల్ల అనేక మంది విప్లవకారులు అరెస్టయ్యారు.
అయితే కర్తార్ సింగ్ బ్రిటిష్ వారి నుండి తప్పించుకోగలిగాడు.
1915 మార్చి 2న అతను సర్గోధాలోని చాక్ నంబర్ 5 వద్ద 22 అశ్వికదళానికి చెందిన భారతీయ సైనికులను రెచ్చగొట్టి సైనికులను తిరుగుబాటుకు ప్రేరేపించడానికి చివరి ప్రయత్నం చేశాడు. ఈసారి, 22 అశ్వికదళానికి చెందిన రిసల్దార్ గండా సింగ్ అతన్ని అరెస్టు చేశారు. వీరిలో ఇరవై ఏడు మందిని విప్లవకారులుగా ముద్రవేసి లాహోర్ జైలులో బంధించారు. వారిలో ఒకడు కర్తార్ సింగ్. అప్పుడతనిని కలవడానికి అతని తాత వెళ్తాడు.
తాత "మీ మరణంతో దేశం ప్రయోజనం పొందుతుందని మాకు నమ్మకం లేదు. కనుక మీరు మీ జీవితాలను ఎందుకు వృధా చేసుకుంటారు?" అని బాధపడతాడు.
అయితే కర్తార్ సింగ్ కలరా, ప్లేగు లేదా ఇతర వ్యాధులతో మరణించిన కొంతమంది బంధువుల గురించి తన తాతకు గుర్తు చేశాడు. మీ మనవడు కూడా ఏదో ఒక అనారోగ్యంతో చనిపోవాలను కుంటున్నారా? ఆ అనారోగ్య మరణం కంటే ఈ మరణం వెయ్యి రెట్లు గొప్పది కాదా?" అని అంటాడు.
కర్తార్ సింగ్ మాటలతో అతని తాత మౌనంగా ఉండిపోతాడు.
భగత్ సింగ్‌తో సహా అనేకమంది విప్లవకారులు, ఇతర స్వాతంత్య్ర సమరయోధులకు కర్తార్ సింగ్ తన ధైర్యసాహసాలతో స్ఫూర్తినిచ్చాడు. ఆయనను తన "గురువు"గా పేర్కొన్నాడు భగత్ సింగ్!
కర్తార్ సింగ్ కేసు విచారణ సమయంలో తనకు ఎలాంటి న్యాయవాది సహాయమూ అక్కర్లేదని అంటాడు. తాను చెప్పాలనుకున్నది నిర్భయంగా చెప్పాడు.
అతని మాటలన్నీ విన్న న్యాయమూర్తి " తిరుగుబాటుదారులలో అత్యంత ప్రమాదకరమైనవాడు కర్తార్ సింగ్" అని ప్రకటించాడు. అతను చేసిన నేరాల గురించి చాలా గర్వపడుతున్నాడు కాబట్టి, అతను ఎటువంటి దయకు అర్హుడు కాడు. అతనికి మరణశిక్ష విధించాల్సిందే" అని తీర్పు ఇచ్చాడు న్యాయమూర్తి.
1915 నవంబర్ 16న, కర్తార్ సింగ్ తన పెదవులపై చిరునవ్వుతో, కళ్లలో మెరుపుతో తానే స్వరపరిచిన దేశభక్తి గీతాలను ఆలపిస్తూ ఉరికంభమెక్కాడు. కేవలం 19 సంవత్సరాల వయస్సులో కర్తార్ సింగుని ఉరితీశారు. మాతృభూమిపట్ల అతనికున్న ప్రేమ అనంతం. మాటలకతీతం.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి