సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -106: ఆయుష్యం గల రోగి హస్తవాసి గల వైద్యుని వద్దకే పోతాడు
*****
"అవ్వా! గా కరుణమ్మత్త గట్టి పిండమే. భూమ్మీద ఇంకా నూకలున్నయి. లేకుంటేనా...గద్దల్సుకుంటుంటే  కడ్పుల బయం అన్పిత్తది.అత్త బతికి బట్ట కట్టినందుకు సంబురంగ అన్పిస్తది."
గింతకీ కరుణమ్మత్తకి ఏమైంది శెల్లే?
అయ్యో! అవ్వా!గీ యిషయం దెల్వదా?  నీ దనుక రాలేదా?కరుణమ్మత్తకి టక్కరైంది. సచ్చేదే బతికింది గాదు.
మొన్న పొద్ధంత సుట్టు పక్కలున్నోళ్ళు పండక్కి అరిశెలు జేసుకుంటున్నం పాకం బట్టి పెట్టమంటే అరిశెల పాకం బట్టి వొచ్చిందంట.పొద్దూకి  ఇంగ ఉన్నది ఇంట్లె ఉండకుండ ఆవు పెండ కోసరం రోడ్డెక్కిందంట.అసలే శీతాకాలం పొద్దు. మస్క చీకటి .రోడు మీద సూత్తుందో లేదో ఒకేపు టుక్ టుక్ మోటర్లు ఒత్తుంటే తప్పుకో బోయిందట గని మరో ఏపు కారొచ్చేది సూల్లేదట.
అయ్యో! అత్తకి ఏం గాలేదు గద."
"ఏం గాలేదంటవేందవ్వా! గా కారొచ్చి అవ్వని గుద్దితే అవ్వ ఎగిరి కారుమీద పడ్డదంట.గట్ల పడ్డ అవ్వని బిరేకులు పడక కారు ఓ గంత దూరం తీస్క బోయిందట.ఆటెన్క  కారాగే తల్కి కారు మీంచి కింద పడిందంట.గక్కడే ఉన్న కరెంటు తంబం గన్క తాకితే తల్కాయ పలిగేది. రోడ్ కి కిందికి జారిపోకపోతే గా కారు టైర్ల కింద పడేందంట. గా అత్త పడే పడుడికి కారు అద్దం సుత పలిగిందట."
 'గట్ల అత్తకి కారు టక్కరయ్యింది సుట్టు పక్కలున్నోళ్ళు సూశి ఉర్రికొచ్చి గబ్బగబ్బ లేపిండ్రంట.గా కారాయన గడగడ వణుక్కుంట ఆళ్ళు జెప్పినట్టు ఇంటనని ఒప్పుకుండంట.
గాయన కార్లనే పేటల పెద్ద దవాఖానాకి తోల్కబోయిండ్రంట. అయితే గక్కడ డాటర్ జెప్తే అత్త గంత బాదల సుత ఆయనొద్దని మూలుక్కుంటనే ఏరే డాటర్ తానకి తోల్కపొమ్మని పేరు శెప్పిందంట.
 మడిషినేమో కదలిచ్చేటట్టు లేదు.ఒంట్లె ఎక్కడెక్కడ దెబ్బలు తాకినయో తెల్వదు.ఎట్ల ఎట్లా అన్కొని అత్త జెప్పిన దవాఖానాకి తోల్కబోయి సూబెట్టిండ్రంట. గా డాటరు సూశి ఎడమ శెయ్యి గూడల ఇరిగిందని కట్టు ఏసిండ్రు.లేశినేల మంచిది గంత పెద్ద టక్కరై బతికింది అన్నడంట.గాయన అన్ని పరీచ్చలు జేయించిండంట.గియ్యాల  పొయ్యి సూసొచ్చినవ్వా !అద్దాల గదిల బెట్టిండ్రు. రొండు రోజులైనంక గదిలకి తీసుకొత్తరంట.
అవునా శెల్లె! అయ్యో !గింత పెద్ద టక్కరి జరిగింది లే. ఏదేమైనా శెల్లె!ఆయుషున్న  రోగి అత్తవాసి గల డాటర్ వొద్దకి పోతది " అంటే గిదే మరి.రేపే ఎల్లి సూశొత్త.
గదండీ సంగతి! ఆయుష్యం గల రోగి హస్తవాసి గల వైద్యుని వద్దకే పోతడు" అంటే గిదే మరి.ఇంకోలింకోలి కాడికి పోతే.సరైన సైమానికి వైద్గం అందక పొయ్యేది.
 


కామెంట్‌లు