మానవజాతిలో ఒక మణిదీపం:- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్, హైదరాబాద్
రాని ఆపదలకే...
రూపం కట్టి వణికేవాడు
బతికుండగానే
మరణాన్ని మోసుకెళ్తాడు…

రాని భయాలకే...
రెక్కలు కట్టించి
ఎవరూ తరుమకుండానే
పరుగులు పెట్టేవాడు ప్రతిక్షణం
తన్నుతానే చంపుకుంటాడు…కాని...

వంద... 
అవమానాల
నిందల నిప్పురవ్వలు
దేహాన్ని తాకినా
ఆత్మస్థైర్యం సడలని వాడు... 

వెయ్యి... 
సమస్యలు సర్పాలై 
బుసలు కొడుతున్నా
చాటు మాటుగా
కాటేయబోతున్నా తన
అంతఃశక్తినే నమ్మేవాడు…

కోటి... 
పిడుగులు తలపై 
పడబోతున్నాయన్నా
చింతలేక చిరునవ్వుతో
స్థితప్రజ్ఞతతో ధ్యానదీక్షలో
మౌనముద్రలో మునిగేవాడు …

చింతల్ని జయించి
చేతనను మేల్కొల్పి
మౌనంలో మహాశక్తిని
ప్రవర్తనలో మహాసత్యాన్ని
ప్రపంచానికి చూపినవాడు…

ఆత్మవిశ్వాసమే తనకు 
ఆయుధమని చాటేవాడు...
మేరు పర్వతమై 
నిటారుగా నిలిచేవాడు...

గాంధీజీ ప్రబోధించిన 
అహింసాత్మక నిశ్శబ్ద బలం
వివేకానందుడందించిన 
అగ్నిలాంటి ఆత్మవిశ్వాసం
ఏకమై ఒక లోకమైనవాడే... 

రేపు కాలానికి మార్గదర్శి,
ఈ మానవజాతికి
ఒక సజీవ మణిదీపం…



కామెంట్‌లు