మాధవరాయపురంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

 కొండగూడెం పంచాయతీ, మాధవరాయపురం గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ గ్రామ పౌరులు, యువకులు పెద్ద ఎత్తున నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. 
సంక్రాంతి అంశంపై వ్యాసరచన, ఉక్తలేఖనం పోటీలను ప్రాథమిక పాఠశాల పిల్లలకు, తెలుగు రాష్ట్రాల పండగల గురించి వక్తృత్వ, పఠన పోటీలను ఉన్నత పాఠశాల పిల్లలకు, పల్లెలందు ఆచారాల గూర్చి కవితలను, చిత్రలేఖనం పోటీలను కళాశాల పిల్లలకు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. గృహిణులకు ముగ్గుల పోటీలను, మ్యూజికల్ చైర్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేసారు. అలాగే సాంప్రదాయక వేషధారణ ప్రదర్శన, స్లో సైకిల్ రన్నింగ్, బకెట్ లో బాల్, స్పూన్ లెమన్, లాంగ్ జంప్, క్రికెట్, చెస్, క్యారమ్స్, టగ్గాఫ్ వార్ పోటీలు నిర్వహించి,  విజేతలకు బహుమతులను అందజేసారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు మాట్లాడుతూ సంక్రాంతితో పాటు అన్ని సాంప్రదాయాలనూ ఈ గ్రామస్థులు పట్టం కట్టేలా శ్రమిస్తారని అన్నారు. గ్రామంలో పుట్టి, ఎక్కడెక్కడో స్థిరపడిన వారు పుట్టిన గడ్డను మరువకుండా  వారంరోజుల ముందుగానే వచ్చి సంక్రాంతి వేడుకల నిర్వహణలో కీలక పాత్ర పోషించుట ఎంతో అభినందనీయమని అన్నారు.  గౌరవ అతిథి, ఉపాధ్యాయులు నక్క ఈశ్వర్ లాల్ మాట్లాడుతూ దుర్వ్యసనాలకై సమయాన్ని సొమ్మునీ ఆరోగ్యాలనూ బలి తీసుకోకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో మెలుగుతూ ఈ ఊరి విద్యార్థులు ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తున్నారని అన్నారు. గ్రామ యువకులంతా వివిధ రకాల పోటీల నిర్వహణకై చిత్తశుద్ధితో సేవలందించుట మిక్కిలి ప్రశంసనీయమని ఆయన అన్నారు. విశిష్ట అతిథి, ఉపాధ్యాయులు వావిలపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రతిభాపాటవాలను పెంపొందించేలా, తరతరాల ఆచారాలను పరిరక్షించేలా ఇలాంటి సంబరాలు దోహదపడుతాయని అన్నారు. విద్యా విలువలను పెంపొందించేలా రైతులు, మహిళలు తల్లిదండ్రులంతా ఆదర్శవంతమైన బాటలో పయనించుట కడు ముదావహం అని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం కుదమ తిరుమలరావు, నక్క ఈశ్వర్ లాల్, వావిలపల్లి అప్పలనాయుడుల చేతుల మీదుగా విజేతలంతా బహుమతులను స్వీకరించారు. కార్యక్రమంలో కుదమ తిరుమలరావు ఆలపించిన సంక్రాంతి గీతాలు అందరినీ రంజింపజేసాయి. అనంతరం జరిగిన నృత్య రూపకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కామెంట్‌లు