భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ప్రసిద్ధి చెందింది. ఇది కేవలం ఒక చట్టాల పుస్తకం మాత్రమే కాదు, ఒక దేశం యొక్క ఆశయాలు, ఆకాంక్షలు మరియు విలువలకు ప్రతిరూపం. భారత రాజ్యాంగ రూపకల్పన వెనుక అపారమైన మేధోమథనం మరియు చారిత్రక నేపథ్యం ఉంది. 1946లో ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ ద్వారా ఈ బృహత్తర కార్యం ప్రారంభమైంది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ అహర్నిశలు శ్రమించి దీనిని రూపొందించారు. సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు జరిగిన చర్చల ఫలితంగా 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. చివరకు 1950 జనవరి 26 నుండి ఇది అమలులోకి వచ్చింది.
భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకతలను గమనిస్తే ముందుగా చెప్పుకోవాల్సింది దీని పరిమాణం. ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలలోని మంచి అంశాలను సేకరించి భారతీయ పరిస్థితులకు అనుగుణంగా దీనిని మలిచారు. అందుకే దీనిని అతుకుల బొంత అని విమర్శించినప్పటికీ ఇది అన్ని వర్గాల వారికి రక్షణ కల్పించే అద్భుతమైన దస్తావేజుగా నిలిచింది. రాజ్యాంగ ప్రవేశిక దీనికి ఆత్మ వంటిది. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఇది ప్రకటించింది. పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యం.
మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు పౌరుల స్వేచ్ఛకు పునాదులు. సమానత్వపు హక్కు, స్వేచ్ఛా హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు వంటివి పౌరులు గౌరవప్రదంగా జీవించడానికి దోహదపడతాయి. అదేవిధంగా ఆదేశిక సూత్రాలు ప్రభుత్వం అనుసరించాల్సిన మార్గదర్శకాలను సూచిస్తాయి. ఇవి సంక్షేమ రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషిస్తాయి. భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థను అనుసరించినప్పటికీ అవసరమైనప్పుడు ఏకకేంద్ర లక్షణాలను ప్రదర్శిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన స్పష్టంగా పేర్కొనబడింది. స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ రక్షణకు కట్టుబడి ఉంటుంది.
పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మరొక ముఖ్య లక్షణం. దేశాధినేత నామమాత్రపు అధికారిగా ఉండగా ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి వాస్తవ అధికారాలను చలాయిస్తుంది. అలాగే భారత రాజ్యాంగం కఠినత్వం మరియు సరళత్వాల కలయిక. కాలక్రమేణా మారుతున్న అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉండటం వల్ల ఇది ఇప్పటికీ సజీవంగా ఉంది. సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి కుల, మత, లింగ వివక్ష లేకుండా ఓటు వేసే అధికారాన్ని కల్పించడం భారత ప్రజాస్వామ్యానికే గర్వకారణం. ఏక పౌరసత్వం దేశ సమగ్రతను మరియు ఐక్యతను పటిష్టం చేస్తుంది.
భారత రాజ్యాంగం కుల వివక్షను రూపుమాపడానికి అస్పృశ్యత నివారణ వంటి చట్టాలను రాజ్యాంగబద్ధం చేసింది. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఇంతటి వైవిధ్యం ఉన్న దేశాన్ని ఒకే తాటిపై నడిపిస్తున్న ఘనత మన రాజ్యాంగ రూపకర్తలకే దక్కుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాల మీద నిర్మితమైన ఈ రాజ్యాంగం నేటికీ భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెడుతోంది. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూనే అందులో పేర్కొన్న ప్రాథమిక విధులను పాటించడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి