మానవజాతికి మార్గదర్శకుడు…!: - కవిరత్న |సాహిత్య ధీర |సహస్ర కవి భూషణ్ |పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ – హైదరాబాద్
నిన్ను బలహీనపరచేది
నిన్నటి నీ అనుభవం కాదు
దాన్ని గుణపాఠంగా
మలచుకోలేని  నీ నిర్లక్ష్యమే
రేపటి అపజయానికి అద్దం…

తీపి జ్ఞాపకం ప్రేరణైతే...
చేదు జ్ఞాపకం హెచ్చరిక...
కాలం ఇచ్చిన రెండు వరాలే
అవి నిన్నటి నీ గురువులు…

నిన్న నీవు కన్న కమ్మని కలలే
నేటి నీ సత్కర్మలై,
రేపటి నీ అఖండ
విజయానికి సోపానాలౌతాయి…

కలలు కంటె సరిపోదు
నుదుట స్వేదబిందువులు
ముత్యాల్లా చిందితేనే
రేపు వాటికి జీవం వస్తుంది…

భయం భూతమై నిలిచిన చోట
అనుమానం పిడుగవుతుంది
బద్ధకాన్ని ఒడిసిపట్టిన వేళ
విజయం బలౌతుంది…

ధైర్యం...
సాహసం...గొడుగులైనప్పుడు
ఆత్మవిశ్వాసమే నీకు దారి దీపం...
చీకటి దారుల్లో సైతం
అది నీకు గమ్యాన్ని చూపుతుంది…

ఎర్రని ఎండల్లో సొమ్మసిల్లినవారే
గొడుగు విలువ తెలుసుకుంటారు...
ఉక్కు సంకల్పంతో ఉద్యమించినవారే
ఉన్నత శిఖరాలను చేరుకుంటారు…

ఈరోజు పోరాడిన వీరుడే...
ధైర్యంగా నిలిచిన ధీరుడే...
మానవీయ విలువలు గలవాడే...
సాహసమే ఊపిరిగా సాగేవాడే...
రేపు మానవజాతికి మార్గదర్శకుడు…



కామెంట్‌లు