గాంధీజీ ---నెహ్రూజీ--నేతాజీ: - చౌధరి రాధాకృష్ణ, గాంధేయవాది


 గాంధీజీ పిలుపు... భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో దేశప్రజలందరికీ శిరోధార్యం. అహింస, సత్యాగ్రహం, త్యాగం వంటి ఆయుధాలతో భారతమాత దాస్య శృంఖాలనుండి విముక్తి చేసిన గాంధీజీ, సాయుధ పోరాటంతోనే స్వాతంత్ర్య సిద్ధిస్తుందని విశ్వసించిన నేతాజీ... సైద్ధాంతికంగా వీరు భిన్న ధృవాలుగా గోచరిస్తున్నా... గాంధీజీ నాయకత్వం, ఆయన వ్యక్తిత్వాన్ని నేతాజీ కూడా అభిమానించడం విశేషం.
సహాయనిరాకరణ ఉద్యమ కాలంలో కాంగ్రెసు పార్టీలో చురుకైన పాత్ర పోషించిన నేతాజీని కోల్ కతా వెళ్లి చిత్తరంజన్ దాస్ ను సహకరించమని గాంధీజీ ఆదేశించగా ఆయన దానిని ఆచరించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన నేతాజీ సైద్ధాంతికంగా గాంధీజీతో విభేదించి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించి స్వాతంత్ర్య పోరాటానికి సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. విశేషం ఏమిటంటే తన ఇండియన్ నేషనల్ ఆర్మీ విభాగాలకు (బ్రిగేడ్ లు) మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్, మహిళా సైన్య విభాగానికి రాణీ లక్ష్మీబాయి బాయ్ పేర్లు పెట్టి, తమది సైద్ధాంతిక విభేదమే కానీ, వ్యక్తిగతం కాదని నేతాజీ చెప్పినట్లయింది.
   సుభాష్ చంద్రబోస్ అజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వం సింగపూర్ లో నెలకొల్పి, అండమాన్ నికోబార్ దీవులు ఆక్రమించి జెండానెగురవేశారు. ఈ రెండు ప్రదేశాలలో కూడా భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన చరఖాతో కూడిన మూడు రంగుల జెండానే ఎగురవేసి మెజారిటీ భారతీయుల భావాలను గౌరవించారు.
నేతాజీ అనుచరులకు స్వాతంత్ర్య భారతావనిలో సముచిత స్థానం కల్పించి జవహర్ లాల్ నెహ్రూ గౌరవించారు. ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిగేడ్ కెప్టెన్ లక్ష్మీ సెహగల్ కు పద్మవిభూషణ్, జి ఎస్ థిల్లార్ కు పద్మభూషణ్, షాన్మజ్ ఖాన్ కు రైల్వే సహాయమంత్రి, మోహనసింగ్ కు రాజ్యసభ సభ్యత్వాలను ఇచ్చారు.ఈ రకంగా గాంధీజీ, జవహర్ లాల్ నెహ్రూ, నేతాజీ పరస్పర గౌరవం చాటుకున్నారు.
======================================================
చౌధరి రాధాకృష్ణ, గాంధేయవాది,
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం.
కామెంట్‌లు