భారత మాత ఆలయం ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం క్యాంపస్‌లో ఉంది. ఈ ఆలయంలో సాంప్రదాయ దేవతల విగ్రహాలకు బదులుగా పాలరాతితో చెక్కిన అఖండ భారత దేశ భారీ చిత్రం ఉంది. ఈ దేవాలయాన్ని భారత మాతకు అంకితం చేసారు. వాస్తవానికి ప్రపంచంలోనే ఈ రకమైన ఆలయం మొట్టమొదట్లో ఇది మాత్రమే ఉండేది.
అయితే అనంతరం ఇటువంటి ఇంకొన్ని ఆలయాలు వెలిసాయి.
పరోపకారి, స్వాతంత్ర్య సమరయోధుడు శివ ప్రసాద్ గుప్తా భారత మాతా మందిర్‌ను రూపొందించారు. ఈ ఆలయం నిర్మాణం 1936లో పూర్తయింది. ఆలయం ఎత్తు 83.67 మీటర్లు (275 అడుగులు).
ఈ ఆలయాన్ని 1936లో మహాత్మా గాంధీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గాంధీజీ మాట్లాడుతూ, "ఈ ఆలయంలో దేవుళ్ళు, దేవతల విగ్రహాలు లేవు. ఇక్కడ పాలరాతిపై భారతదేశం మ్యాప్ మాత్రమే ఉంది. ఈ ఆలయం ప్రపంచవ్యాప్త రూపాన్ని తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను. హరిజనులతో పాటు అన్ని మతాలు, అన్ని కులాలు, విశ్వాసాల కోసం ఇది ఒక గొప్ప వేదిక. ఇది ఈ దేశంలో మతపరమైన ఐక్యత, శాంతి, ప్రేమ భావాలకు దోహదం చేస్తుంది" అని చెప్పారు.
జాతీయ హిందీ కవి మైథిలీ శరణ్ గుప్త్ ప్రారంభోత్సవం కోసం ఓ పద్యం రాసారు.
ప్రారంభోత్సవంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, వల్లభాయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ భారత మాతా మందిరాన్ని రాతితో నిర్మించారు. ఇక్కడ అఖండ భారత్ కు ప్రతీకగా పాలరాతితో నిర్మించిన భారత మాత విగ్రహాన్ని దర్శించవచ్చు. ఇక్కడి మ్యాపులో పర్వతాలు, మైదానాలు, మహాసముద్రాలను ముచ్చటగా చిత్రించారు.
వారణాశి జంక్షన్ రైల్వే స్టేషన్ కి దక్షిణాన కిలోన్నర మీటర్ దూరంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి
ఉత్తరాన ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ జ్యోతిలింగ ఆలయానికి సమీపంలోనే భారత మాత ఆలయం ఉంది.
జాతీయ వ్యక్తిత్వం ఒక మాతృ దేవత. భారత మాత సాధారణంగా ఎరుపు లేదా కుంకుమపువ్వు చీరను ధరించి జాతీయ జెండాను పట్టుకున్నట్లుగా చిత్రీకరించారు.
"భారత మాత" అనే పదం ఆధునిక సాహిత్యంలో 19వ శతాబ్దపు చివరి బెంగాల్ నాటిది. బెంగాలీ నవల ఆనందమఠ్ (1882) ద్వారా ఈ మాట బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో ఆమెను హిందూ దేవతలైన దుర్గ, కాళి నుండి విడదీయరాని రూపంలో చిత్రీకరించారు. 1905లో బెంగాల్ ప్రావిన్స్ వివాదాస్పద విభజన తర్వాత సర్ సురేంద్రనాథ్ బెనర్జీ నిర్వహించిన బ్రిటిష్ నిర్మిత వస్తువుల బహిష్కరణ సమయంలో భారత మాతను ప్రధానంగా పేర్కొన్నారు.
అనేక నిరసన సమావేశాలలో, భారత మాతను 'వందేమాతరం' అనే నినాదంతో ఘోషించేవారు.
1904లో అబనీంద్రనాథ్ ఠాగూర్ భారత మాతను నాలుగు చేతుల దేవతగా చిత్రించారు. ఈ పెయింటింగ్ కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ మ్యూజియంలో చూడవచ్చును.
1909లో తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి పత్రిక "విజయ" ముఖచిత్రంపై భారత మాతను ముద్రించారు. వందేమాతరం " నినాదానికి ప్రతీకగా దీనిని ప్రచురించారు.
ఆ తర్వాతి దశాబ్దాలలో, భారతదేశం అంతటా ప్రముఖ కళారూపంగా కనిపించింది. అనేక పత్రికలు, పోస్టర్లు, క్యాలెండర్లలో, భారత జాతీయవాదానికి ప్రతీకగా మారింది.
వారణాసిలోని భారత మాత ఆలయానికి వచ్చేవారిలో ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు కావటం విశేషం.
ఇక హరిద్వార్‌లోని గంగానది ఒడ్డున స్వామి సత్యమిత్రానంద భారత మాత ఆలయాన్ని స్థాపించారు. ఇది 8 అంతస్తులు గల ఆలయం. 180 అడుగుల పొడవు ఉంటుంది. దీనిని 1983లో ఇందిరా గాంధీ ప్రారంభించారు.
ఆలయ స్థాపకులు స్వామి సత్యమిత్రానంద గిరి 1932 సెప్టెంబర్ 19న ఆగ్రాలో జన్మించారు. చిన్నతనం నుండి స్వామీజీకి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉండేది. దాని కారణంగా ఆయన చాలా చిన్న వయస్సులోనే తన ప్రాపంచిక జీవితాన్ని విడిచిపెట్టారు. ఆయన అసలు పేరు అంబికా ప్రసాద్ పాండే. స్వామి సత్యమిత్రానంద గిరి తండ్రి పేరు శివశంకర్ పాండే. ఆచార్య మహామండలేశ్వర్ స్వామి అవధేశానంద ఈయన గురువు.
స్వామి సత్యమిత్రానంద ఏప్రిల్ 29, 1960న కేవలం 26 ఏళ్ల వయసులో భాన్‌పురా పీఠానికి శంకరాచార్యగా నియమితులయ్యారు. 1969 సంవత్సరంలో శంకరాచార్య పదవి నుంచి తప్పుకున్నారు. ఈయన 1983లో హరిద్వార్‌లో భారత మాతా ఆలయాన్ని స్థాపించారు. ఈయన తన జీవితకాలంలో 65 దేశాలను సందర్శించారు. మరణించే నాటికి ఆయన వయస్సు 87 సంవత్సరాలు.
హరిద్వార్‌లోని భారత్ మాతా మందిర్ ట్రస్ట్‌కు చెందిన రాఘవ్ కుటీర్‌లో ఆయన సమాధి ఉంది. 2015 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈయనను పద్మభూషణ్ అవార్డుతో సమ్మానించింది.
అలాగే కోల్‌కతా విమానాశ్రయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో జెస్సోర్ రోడ్‌లోని మైఖేల్ నగర్‌లో
భారత మాత "జగత్తరిణి దుర్గ " ఆలయం ఉంది. దీనిని అక్టోబర్ 19, 2015న (ఆ సంవత్సరం దుర్గాపూజ మహాషష్టి రోజు)న ప్రారంభించారు. నాటి పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేశరీ నాథ్ త్రిపాఠి దీనిని ప్రారంభించారు. " వందేమాతరం " 140వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్పిరిచ్యువల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ "జాతీయ శక్తిపీఠ్"ను ఏర్పాటు చేసింది.
జూలై 2019లో, నాటి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ , మహాభారత కాలం నాటి జ్యోతిసర్ తీర్థం దగ్గర 5 ఎకరాల భూమిని "భారత్ మాతా ట్రస్ట్ " కి భారత మాత ఆలయ నిర్మాణానికి మంజూరు చేశారు.






addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి