అయ్యో…అయ్యో...
ఓ ధనవంతులారా…
ఓ దాతలారా…
ఓ దానకర్ణులారా...
కోట్లకు పడగలెత్తిన
ఓ కోటీశ్వరులారా...
ఎక్కడున్నారు…?
మీరెక్కడున్నారు…?
మీ గుండెల్నిపిండేసే
మీ కళ్లు రెండు చెమర్చే
ఈ దుఃఖభరిత దృశ్యాన్ని
ఒక్కసారైనా చూడరేమి…?
అదిగో అదిగో ఆ
బక్కచిక్కిన రైతన్నకు
ఒంటిమీద బట్టల్లేవు…
పెట్టుకున్న చిన్న గోచీకి
కట్టుకున్న కర్రనే
కాలుగా మార్చుకుని…
ఎర్రటి ఎండకు ఎండుతూ…
ఆకలికి అలమటిస్తూ…
రక్తాన్నే స్వేదంగా చిందిస్తూ…
బీడుభూముల్లో దుక్కిదున్ని…
కొండంత ఆశతో పొలంలో
విత్తనాలు చల్లే దెవరికోసం…?
పచ్చని పంటలు పండించేదెవరికోసం..?
తన జానెడు పొట్టకోసమా…? కాదే…
వేలాదిమంది
కడుపుల్ని నింపేందుకే…
కోట్లాదిమంది
ఆకలి మంటలు ఆర్పేందుకే…
పచ్చని పంటలు పండించే ఆ రైతన్న
పిడికిలి బిగించి రంకెలు వెయ్యడమా..?
అట్టి త్యాగమూర్తి అట్టి నిస్వార్థజివి
గిట్టుబాటు ధరలకై పోరాడడమా…?
దళారీల మోసాలకు బలైపోవడమా..?
అన్నదాత ఆకలికి అలమటించడమా…?
అవమానాలతో ఆత్మ క్షోభతో
అప్పుల భారంతో ఆత్మహత్యలతో
అకాల మృత్యువును ఆహ్వానించడమా?
ఇదెంతటి ఘోరం…?
ఇదెంతటి అన్యాయం…?
ఓ ప్రభుత్వపాలకులారా…!
ఓ అధికారులారా..! ఓ అంధులారా...!
కర్రే కాలైన
ఈ అన్నదాతపై మీకు కనికరమేది…?
కళ్లున్నా కనలేని
ఓ సభ్యసమాజమా ఇకనైనా మేల్కో..!
ఒక కాలితో ఒక కర్రకాలుతో
విత్తనాలు ఆశతో చల్లుతున్న
ఆ అన్నదాతకు ఆ త్యాగమూర్తికి...
మీరిచ్చే కృత్రిమ కాలుకన్నా
మీరు చూపించే సానుభూతి కన్నా
మీరు పంచే ప్రేమతత్వం
మీరు అందించే మానవత్వమే మిన్న..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి