సామెత -111: అనుమానం ప్రాణ సంకటం
*****
"పాపం బిడ్డ మాత్తరం ఏం జేత్తది. ఒక్క దినంతో పొయ్యేది కాదాయె! దినాము రావణ కాట్టమొతికే రగుల్తుంటే గా మంట సల్లార్పే ఉపాయమన్న జేయాలె.లేదంటే గా మంటకి దూరంగనన్న బోవాలె. నేనైతే గా గదే జెప్పినవ్వా!'
"ఇంతకీ ఎవలి ముచ్చెటి శెల్లె? గంత పెద్ద కట్టమెవరికొచ్చింది? అస్లేమయింది?ఎందు కంత ఇదైతున్నవ్?"
" మా అన్న బిడ్డ ముచ్చటినే అవ్వా! ఈడూ జోడూ బాగున్నరు. ఇద్దరూ సర్కారు నౌకరోల్లు .పెండ్లయినంక శిలకా గోరింకల్లెక్క ఉంటరని అన్కున్నం. పెండ్లిల నవ్విన నవ్వే ఆకరు.నవ్వితే ఓర్సడంట.ఎందుకు నవ్వినవు అంటడట. గట్లని తనకేదో యాదికొచ్చి నవ్వినంటె...ఏమి యాది కొచ్చింది?గా ముచ్చటేందో శెప్పేదనుక పట్టుబడతడంట.అందుట్ల పొల్లగాండ్ల సంగతి వొచ్చిందంటె ఇంగ జూసుకో సవాలచ్చ అడిగి కండ్ల నీళ్ళు బెట్కొనే దాక ఆగడంట.
గదే కాదవ్వా!నౌకర్కి బొయి రాంగనే అక్కడి ముచ్చెట్లు అడుగుడు. అనుమాన పడుడు. డూటీ చేత్తున్న సైమంలో పదే పదే పోను జేసి యిసిగిచ్చుడు.
ఎంటనే తీయకపోతే గంత తీర్క లేదా ఏడున్నవు? అని గుచ్చి గుచ్చి అడ్గుతుంటే సుట్టూ ఉన్నోళ్ళు చెవులు రిక్కించి యినుడు,మీ ఆయ్నకి మీరంటే బలే ఇట్టమట్టుంది. గందుకే పోన్ల మీద పోన్లు జేత్తున్నట్టుంది'అంటున్నప్పుడల్లా గీ పొల్ల తల్కాయ నేల కేస్కునే పరిత్తితట.
గిట్ల పవుతూ మాటల్తో బాద పెట్టుడు.తన పర్వు,ఆమె పర్వు తీసుడుతో గా పొల్ల రజిత గడగడలాడుతున్నది.
అయ్యో గట్లనా శెల్లె? పాపం పొల్ల ఎంత నరకం అనుబగిత్తుందో?
"అవునవ్వా!గా మొగుడు పెండ్లాలను పిలిచి కూసబెట్టి అడ్గుదామంటే నా మీద ఏం జెప్పినవ్?నా పర్వు తీయాలని సూత్తున్నవ్! నేనెక్కడికి రాను ఏం జేస్కుంటవో జేస్కో పో" అంటడంట.
గిట్ల కన్నమ్మ కట్టాలు ,సీతమ్మ శెరలు బడుతున్నది.గివి తట్ట్కోలేక, ఇంట్లె అమ్మ నాయినతో శెప్పుకోలేక మా ఇంటికొచ్చింది బుడ్డ పిల్లల్ని నా శేతుల బెట్టి నీళ్లు తాగుతననీ అర్రలకి బొయ్యి నిద్ర మాత్రలు మింగ బోతుంటే అన్మానమొచ్చి సటుక్కున బొయ్యి గవ్వి గుంజుకొని పారబోసిన.
ఇంగ కూసబెట్టి గస్మంటి పన్లు ఇంగెప్పుడు శెయ్యనని ఒట్టేయించుకున్న గని నీ తానకి తోల్కొత్త అవ్వా! నువ్వే గా పొల్లని గాపాడాలె" అన్న శింగమ్మ మాటల్కి "
గిదే శెల్లె !"అనుమానం పాన సంకటం" అంటే. కొంతమంది మొగ మూరుకులకి ఏం బుడుతుందో ఏమో! గాళ్ళు సుకంగ ఉండరు.ఎదుటోల్లను సుకంగ ఉండనీయరు. మనిషి పానం బొయ్యే దాక తీసుకొత్తరు.
గిస్మంటోళ్ళ మాటల్కి,శేతల్కి బయపడ్తే గిట్లనే ఏడిపిత్తరు. గందుకే గాళ్ళ మొకం మీద శెప్పుతో కొట్టినట్టు ఏరుగ, దూరంగ ఉండాలె.ధైర్నంగ బతకాలె శెల్లె.
"గా పొల్లను నువ్వు తోలుకొచ్చుడెందుకు నేనే వత్త పా. దాని మొగుడు ఉంటే నాలుగు దులుపుతా! పా!" అన్కుంట శింగమ్మతో కల్సి గా రజిత ఇంటికెళ్ళింది.
గీళ్ళు బొయ్యి గట్ల కూసుండ్రో లేదో గా పొల్ల మొగుడు నౌకరీ నుంచి ఒచ్చిండు. గా పొల్లను ఏదో అనబోయి గీళ్ళని జూసి నస్గుతుంటే " గిదే మంచి సైమం ఏడిమీద ఉన్నప్పుడే సరి జేయొచ్చు అన్కుంట "గా పొల్ల మంచిది కాబట్టి బతికి పోతున్నవ్ లేకుంటే ఉజ్జోగం పొయ్యి జైలు ఊసలు లెక్కబెట్టాలె బిడ్డా! "మొగుడు పెళ్ళాం అంటే ఒకలి నడ్మ ఒకలికి నమ్మకం ఉండాలె గని అన్మానం కాదని" గట్టిగ మందలిచ్చి వొచ్చింది అవ్వ.
"గిదండీ సంగతి. "అనుమానం ప్రాణ సంకటం" అంటే గిదే మరి. గీ అన్మానంతో పానాలు పోగొట్టిన వాళ్ళు. పానాలు పోగొట్టుకున్న వాళ్ళు సుత ఉన్నరు. గిస్మంటియి తేల్సుకోవాలె గని దాసుకోకూదు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి