పేదపిల్లల విద్యకోసం అంకితమయ్యారు!: - - యామిజాల జగదీశ్
 74 సంవత్సరాల వయసులో, ఆయన తన జీవితాన్ని ముగించాడని అనుకున్నారు. పదవీ విరమణ, విశ్రాంతి, సుదీర్ఘ జీవితానికి ప్రశాంతమైన ముగింపే అనుకున్నారు. 
కానీ ఒక దృశ్యం ప్రతిదీ మార్చి వేసింది. ఆయన మరో 18 సంవత్సరాలు తాననుకున్న లక్ష్యసాధన కోసం శ్రమించారు. 
1987లో, ఉద్యోగం విరమణ తర్వాత స్వస్థలానికి చేరుకున్నారు బాయి ఫాంగ్లీ. తీరా చైనాలోని తన గ్రామంలో ఓ దృశ్యం ఆయనను కదిలించి వేసింది. అక్కడ పొలాలలో చెప్పులు లేకుండా చిన్న చిన్న పిల్లలు పని చేస్తుండటాన్ని చూశారు. ఆ పిల్లలు పంట పొలంలో పని చేయడానికి ముఖ్యకారణం పేదవారవటమే.‌ స్కూలుకి ఫీజులు కట్టలేని నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలే వాళ్ళు. లాభం లేదు, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం తాను ఏదో ఒకటి చేయాలనుకున్నారు. 
అనుకున్నదే తడవుగా ఎవరూ ఊహించనిది చేశారాయన. ఆయన పల్లెను విడిచిపెట్టి తిరిగీ నగరానికి వచ్చారు. 
రైల్వే స్టేషన్ దగ్గర ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. రిక్షా డ్రైవరుగా మారారు. చాలా మంది ప్రజలు నిశ్చలంగా కూర్చునే వయస్సులో, ఆయన సూర్యోదయం నుండి రాత్రి  వరకు టియాంజిన్ గుండా సైకిల్ తొక్కేవారు. చేతనైన దానితో ఆకలి తీర్చుకునేవారు. ప్రజలు పారవేసే దుస్తులను తీసుకుని ధరించేవారు. ఈ క్రమంలో కష్టజీవి గా తాను సంపాదించిన ప్రతి యువాన్ ను తాననుకున్న సదాశయానికి ఖర్చు చేశారు.‌ అదేంటంటే, 
పేద పిల్లలను పాఠశాలకు చేర్పించి చదివించడం.
దాదాపు 18 సంవత్సరాలపాటు, ఆయన రిక్షా తొక్కుతూ గడించిన డబ్బులను పిల్లలు చదువులకోసం వినియోగించారు. సెలవులు తీసుకునే వారు కాదు. నీకెందుకీ పని అని ఎవరైనా చెప్పినా పట్టించుకునే వారు కాదు. తాననుకున్న పని కొనసాగించారు. 
కాళ్ళు నొప్పెట్టినాసరే, చక్రాలు తిప్పడం మానలేదు. తన కారణంగా ఒక పేద పిల్లవాడు చదువు మానకూడదు అనే దృఢం సంకల్పంతో వారి వృద్ధికోసం ముందుకు సాగారు.  
 2001లో, దాదాపు 90 ఏళ్ల వయసులో, ఆయన శరీరం క్షీణించింది. ఆ ఏడాది ఆయన తన చివరి విరాళం ఇచ్చారు. మొత్తంమీద  350,000 యువాన్లతో 300 మందికి పైగా పిల్లలకు చదివించారు. ఆయన ఎప్పుడూ ప్రశంసలు ఆశించలేదు. ఎవరేమన్నా ఉబ్బి తబ్బిబ్బవ లేదు.  తాననుకున్న మంచి కార్యం కొనసాగించారు. తనకు చేతనైన రీతిలో ప్రతి పేద బిడ్డకూ ఫీజులు కట్టి చదివించారు. 
2005లో బాయి ఫాంగ్లీ మరణించినప్పుడు, ఆయన వద్ద ఏమీ లేదు. ఇల్లు లేదు. డబ్బు లేదు. వదిలి వెళ్ళడానికి ఆస్తులేమీ లేవు.
కానీ ఆయన హృదయాన్ని ఆకట్టకునే గొప్ప ఆశయసాధనను విజయవంతంగా నలుగురి ముందుంచారు. వందలాది విద్యావంతులైన జీవితాలు... ఒక వ్యక్తి త్యాగం తరాల భవిష్యత్తును మార్చగలదని రుజువు చేశారు బాయి ఫాంగ్లీ!!

కామెంట్‌లు