మర్యాద - ప్రేమ;- - యామిజాల జగదీశ్
 అన్నట్లు, మర్యాద, ప్రేమ 
మధ్య తేడా ఉందా అంటే ఉంది. ఇంతకూ ఆ తేడా ఏమిటి?
ఒక ముఖ్యమైన వ్యక్తి, ఒక మంత్రి లేదా గవర్నర్ వచ్చినప్పుడు, అందరూ ఆయనకు ఎలా నమస్కరిస్తారో ఎలా మర్యాద చూపుతారో ఎప్పుడైనా గమనించారా? ఈ చర్యను మీరు సహజంగా అందరూ ఆ వ్యక్తి పట్ల ప్రదర్శించిన గౌరవం అనుకుంటారు కదూ?
కానీ అలాంటి మర్యాదలో అబద్ధపు శాతమే ఎక్కువంటారు జిడ్డు కృష్ణమూర్తిగారు. ఎందుకంటే ఈ మర్యాద వెనుక భయం, దురాశ ఉంటాయి.
ఆ వ్యక్తి నుంచి ఏదైనా పొందాలను కుంటున్నారు, కాబట్టి ఆయన మెడలో ఒక పూల దండ వేస్తారు. అంతేతప్ప అది గౌరవం కాదు...మర్యాద కాదు. ఇది ఓ విధంగా మార్కెట్లో కొనడానికి అమ్మడానికి ఉపయోగించే కరెన్సీలాంటిదే.
కానీ ఓ సేవకుడు లేదా గ్రామస్థుడి పట్ల ఇలాంటి గౌరవం చూపించరు. కానీ మీరు ఏదైనా పొందాలనే ఆశతో ఓ వ్యక్తి పట్ల చూపించే గౌరవంలో నిజమైన గౌరవం ఉండటం అనేది ప్రశ్నార్థకమే.
అటువంటి గౌరవం నిజానికి భయమే. అది గౌరవం కాదు, అది అర్థరహితం.
కానీ మీ హృదయంలో నిజమైన ప్రేమంటూ ఉంటే,  గవర్నర్, గురువు, సేవకుడు, గ్రామస్థుడు ఇలా ఎవరిపట్లయినా చూపించే గౌరవంలో స్వార్థం ఉండదు. ఎవరైనా ఒక్కటే. అందులో నిజమైన ప్రేమ ఉంటుంది. అభిమానం ఉంటుంది. గౌరవం ఉంటుంది. వ్యవహారశైలి సున్నితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రేమ ప్రతిఫలంగా ఏమీ కోరదంటారు జిడ్డు కృష్ణమూర్తి.
ఆలోచించగా ఆయన చెప్పిన ఈ విషయం నిజమే అనిపిస్తుంది.
జిడ్డు కృష్ణమూర్తి 1895 మే 11న జన్మించారు. తత్వవేత్త. రచయిత, ఉపన్యాసకులు.
1922 నుంచి ఆయన జీవిత గమనాన్ని మార్చిన అనేక సంఘటనలున్నాయి. దివ్యజ్ఞాన సమాజం నుంచి ఇళ్లకు వచ్చిన ఆయన ఆ తర్వాత విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఆధ్యాత్మికం, సామాజిక విషయాల గురించి అనేక ప్రసంగాలు చేశారు. ప్రతి ఒక్కరు ప్రవక్త, మతం, తత్వాలు మొదలైన వాటిని దాటి ఆధ్యాత్మిక స్వేచ్ఛను కలిగి ఉండాలన్నది ఆయన అభిప్రాయం.
ఆయన 1986 ఫిబ్రవరి 17న కాలధర్మం చెందారు.

కామెంట్‌లు