సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -120: అయితంపూడి ఉద్యోగం అయితే గియితే ఆరావుల పాడి చేస్తే గీస్తే పాలు పెరుగు మా వాళ్ళకి పోస్తవా? మీ వాళ్ళకి పోస్తవా?

****
"బాగనే ఉంది సక్కదనం. ఎప్పుడు జూశినా శేతిల శెల్లు పోను బెట్కొని గందుల సైన్మా ఈరోల ముచ్చట్లు జూసుడు. ఈరో లెక్క పోజులు బెట్టుడు.గవి కూడు బెడ్తయా? గుడ్డలిత్తయా? అంటే నన్నో ఎడ్డిదాని లెక్క సూసుడు. అసలు ఎడ్డోడు ఆడా? నేనా? నువ్వే సెప్పవ్వా?"
 ఏంది శెల్లె? ఎడ్డిది ఎడ్డోడు అన్కుంట వొత్తున్నవ్. ఇంతకీ ఎవలా ఎడ్డిది ఎడ్డోడు? ఏమన్నవో నాకేం నెత్తికెక్కట్లే."
"ఎవల్నో అంటే ఎందుకు వడ్తరవ్వా? నన్నే మావోన్నే అన్కుంటున్న. మావోడే అవ్వా ఎట్ల బాగువడ్తడో తెల్వట్లే! సైన్మా ఈరోల లెక్క తనకీ మంచి దినాలొత్తయ్ అంటడు. శిన్న ఎంటీవోడు,పబాసు,అరుజునులంట గాళ్ళంత సైన్మాలో గిట్ల సూత్తె గట్ల పేద్ద డబ్బున్నోళ్ళు అయ్యిండ్రంట. గట్లనే నేను సుత.నువ్వు ఫికరు జెయ్యకు అంటడు.  అవునవ్వా! అన్న ఈరో లెక్క అయితడని  ఆనెంట తిరిగే  ఓ నలుగురు పోరగాండ్లు.
 "ఇంగ సర్లే శెల్లె! పోరడు గట్ల ఆగమయ్యేదనుక ఎందుకు జూశినవ్? గీ నడ్మల వొయసు పోరగాండ్లు సద్వు-సందె, పని పాట మర్శి గిట్లనే అవారా గాండ్ల లెక్కన తయారైండ్రు. కొత్త సైన్మా రాంగనే గా ఈరో పోటో కింద గీ పోరల  పొట్వాలు బెట్టుకొని పెద్ద పెద్ద పెక్సీలు ఏయించి బొడ్రాయి, నడూల్లె,నాల్గు రోడ్ల కాడ దిట్టి బొమ్మలు బెట్టినట్టు బెట్టుడు.ఇంట్లె అమ్మ నాయినలని అద్రిచ్చి,బెద్రిచ్చి పైసలు అడుక్కొనుడు. ఇట్టమైన ఈరో పోట్వాకి దండలు ఏసుడు.శివుడికి లెక్క పాలు బోసుడు. గిట్ల పైత్తం శానా ముదిరింది.ఎవ్వన్కి శెప్పెటట్టు లేదు శెల్లె!
 "అవునవ్వా! కూల్నాలికి పొయ్యి తెచ్చిన పైసలు పోపుల డబ్బల దాస్కున్నది సీమొతికె కనిపెట్టి తీస్కోని పోతుండు.ఇంగ లాబం లేదని గా పైసల్ని ఆని కంటబడకుండ ఎక్కడెక్కన్నో దాయలేక సత్తున్న. గాడేమో సత్త బత్కుతనని బయవెట్టి తీస్కబోతుండు. గీడికి గా ఈరోల పిచ్చి ఎట్ల దగ్గుద్దో, ఎప్పుడు సక్కంగైతడో  తెల్వట్లే అవ్వా! కండ్ల నీళ్ళు బెట్టుకున్న తుల్శమ్మని ఊకో బెడ్తూ...
" శెల్లె! రంది జేయకు! ఏడి గాన్ని పిలిపిచ్చు. నా మాటంటే గాడికి కూసింత గురి మరియాద ఉన్నయి గద. నా పయత్నం జేత్త"
 "అగ్గో అవ్వా! గాడు గాంగునేసుకుని ఇటే వొత్తున్నట్టుంది"
"ఒరే పోరడా! ఇట్రారా! అవ్వ పిలుత్తాంది. జెర గిట్లొచ్చి పోరా!"
తల్లి కేకల్కి"ఏందే నీయమ్మ గా ఒర్రుడు" అన్కుంట వొత్తుంటే తోటి పోరగాండ్లు నెమ్మదిగా జారుకోబోతున్నది అవ్వ జూసి...
 "ఒరేయ్! ఒరేయ్! మీ అన్న పొంటి మీరు సుత రాండ్రి. ఎల్లమే పంపిత్తగని.."
 గా మాటల్కి "సచ్చిందిరా గొర్రె" అని మన్సుల అన్కుంట పిల్లి కూనల్లెక్క తుల్శమ్మ కొడుకెన్క వొచ్చిండ్రు.
"గాళ్ళకి గప్పడే కొడుకు శేన్ల ఇర్సుకొచ్చిన మొక్క జొన్న కంకుల్ని కుంపట్లె కాల్శి తలో సగం ముక్క ఏడి ఏడిది ఇచ్చింది."
 గవి ఉఫ్ ఉఫ్ అని శేతుల్ల మార్సుకుంట కంకికి సాలుబెట్టి ఒక్కో యిత్తు నవుల్కుంట అవ్వ ఏం జెప్తదో అని సూత్తున్నరు.
 'గిదే సందని అవ్వ గీ సామెత ఇన్నారార " "అయితం పూడి ఉజ్జోగం అయితే గియితే,ఆరావుల పాడి చేత్తే గీత్తే గా పాలు పెరుగు మా వోళ్ళకి పోత్తవా? మీ వోళ్ళకి పోత్తవా? అని పెళ్ళాంతో అన్నడంట ఎన్కటికెవడో ... గట్లనే ఉంది మీ వర్స.మీ యవ్వారం"
గా పోరలకి గా సామెత అర్థం కాక "ఏందవ్వా! మాకేం సమజవ్వలే" అన్నరు.
 "గదా! శెప్త ఇనుండ్రి... మీ అస్మంటి వొయసు పోరడు గిట్లనే పైటి కలలు కన్కుంట ఆవారాగ తిర్గుతుండు.వాని అమ్మ నాయిన లగ్గం జేత్తె బాద్దెత తెల్సొత్తదని జేత్తరు. ఇంటోళ్ళ పోరు, పెళ్ళాం పోరు తట్కోలేక ఉజ్జోగానికి దరకాత్తు బెడ్తడు.
"ఇంగ గది వొచ్చినట్టే కలలు కన్కుంట గా ఉజ్జోగం వత్తే ఆరు ఆవులు కొంట. ఆటి పాడితో ఇంట్లె పాలు పెరుగు పుష్కలం.గనుక గా పాలు పెరుగు నీవోళ్ళకి బోత్తవా? మా వోళ్ళకి పోత్తవా? అని శెప్పమంటే... ఎవలికైన అమ్మ నాయిన మీద పావురము ఎక్కువుంటది గద. గా పొల్ల మా వోళ్ళకి పోత్త అందట.ఇంగేముంది. "హత్ నీయవ్వ! మావోళ్ళకి బొయ్యకుండ మీ వోళ్ళకి పోత్తావు? ఎంత దైర్నమే నీకు? అని కయ్యానికి దిగిండట. మరి గట్ల జెయ్యొచ్చా? మీరన్న శెప్పుండ్రి"
 తుల్శమ్మ కొడుకు, గానెంటొచ్చిన నల్గురు కిస్స కిస్స నవ్వుకుంట"అసలానికి ఉజ్జోగమే రాలేదు. ఆవుల్నే గొనలేదు. పైంగ బార్యతో పంచాతా? అని ఒక్క తీర్గ నవ్వబట్టిండ్రు."
"అమ్మయ్య!" మాగనె అర్తమైందిరా. మరి గట్లనే ఉంది మీ ఆల్కం సుత. గా సైన్మాల్ల ఈరోలకు వొచ్చిన్లెక్క ఏదో ఓ దినం ఉజ్జోగం వొత్తది అని పగటి కలలు కన్కుంట ఉన్నరు.గా ఈరోలు బయట బాగ కట్టపడి పైసలు సంపాదించుకొనే ఈ తాయిల ఉండ్రు. మరి మీరు అమ్మ నాయినకు బూవికి బరువు లెక్క బతుకుతుండ్రు.మీరేవన్న పుట్టల శెదలా శెప్పుండ్రి.ఉన్న తెల్విని గిట్ల ఆగం జేస్కోబాకుండ్రి" అన్న అవ్వ మాటలు బల్లె సార్లు శెంపమీద మీంచి కొట్టిచ్చినట్ఠయినది." పోరగాండ్లు ఒక్క సారె ఉల్కిపడ్డరు. ఆనెక్క ఇశారిచ్చుడు మొదలు వెట్ఠిండ్రు."
గట్ల గాళ్ళని జూసిన తర్వాత  అవ్వకు కాసింత, కూసింత సంబురం కల్గలే. గాళ్ళలో ఎట్లైన తేడా వొత్తది అన్కుంట , సల్ల గిల్లగొట్టి అందులో కల్యమాకు నలిపి, జీలకర్ర దంచిఏసి నపరో గిలాస ఇచ్చింది. "కడుపు సల్లబడ్డట్టె. మన్సు సల్లబర్సుకొని బాగ ఇశారించుకోండి" అన్న అవ్వ మాటల్కి బుద్ధిగ తల్కాయలు ఊపిండ్రు.
గదండీ సంగతి" అయితం పూడి ఉజ్జోగం అయితే గియితే ఆరావుల పాడి చేత్తే గీత్తే గా పాలు పెరుగు మా వోళ్ళకి పోత్తవా? మీ వోళ్ళకి పోత్తవా? "అంటే గిదే మరి.

కామెంట్‌లు