సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -103: అయ్యోరొచ్చే దాక అమాసాగుతదా?
*****
"ఆరందినాల ముందు మా తమ్ముని మర్దలు బిడ్డ లగ్గానికి పేటకు బొయ్యి నిన్ననే వొచ్చినవ్వా! గక్కడి ముచ్చెట్లు ఎప్పుడెప్పుడు చెప్పాల్నా అని లోపల్లోపల జింక తన్నుడు తంతున్నది."
"గింతకీ గక్కడ ఏమిచ్చింత్రం జర్గింది శెల్లే! గంత కుషాలుగున్నవ్?"
అసలే లగ్గాల సైమంగదవ్వా! పేటల, సుట్టుపక్కల ఊల్లల్ల పెండ్లి జేసే అయ్యోర్లకి మస్తు గిరాకీ పెర్గితే పెర్గింది. అసలే పెండ్లాయె. మల్ల మల్ల జేసేది గాదాయె.గందుకని గాలిచ్చి గాలిచ్చి ఓ అయ్యోర్ని దొరకబట్టిండ్రు. గాయన పేట పక్కనున్న ఓ ఊల్లె ఉంటడంట. గాయన కాల్లా ఏల్లా బడి పదో పర్కో ఎక్కువే ఇత్తం రమ్మని లగ్గం సైమం చెప్పిండ్రు.
గా అయ్యోరు పెండ్లి పిల్లని జేయడానికొచ్చేదానికి యీలు పడదు కరెస్టుగ లగ్గం సైమానికి అరగంట ముందొత్తనంటే గీళ్ళు"గాయనొచ్చుడే మా యెక్కువ. గదే పదేల్రా బాబూ! అన్కొని ముందుగనే ఓ ఐదేలు సుత చేతిల బెట్టిండ్రంట.
లగ్గం సైమమైతాంది. పిల్ల, పిలగాడు పందింట్ల గూసుండ్రు.ఇగ రాడు అగరాడు. పెండ్లోళ్ళు పెండ్లికొచ్చిన సుట్టపోళ్ళు, దోస్తులు,సుట్టుపక్కలోళ్ళు సూత్తా వుండ్రు. పోను జేత్తె మొదట్ల ఇగొత్తున్న,అగొత్తున్న,పలానా కాడున్న అన్నోడు,ఇంగ తర్వాత జేత్తె పోను మోగుడు బంద్.ఆటెంక సిచ్చాపు. లగ్గం సైమమైపోయి మూన్నాల్గు గంటలు దాటింది.
 గీ లోపట్ల భోజనాలకన్న బోదమని,తినేశివొచ్చిండ్రు. దూరబారమున్నోళ్ళు పెండ్లి పిల్ల,పెండ్లి పిలగాన్ని పక్క పక్క పీటల మీద కూసబెట్టి అచ్చింతలు జల్లి, తెచ్చిన కాన్కో, డబ్బుల కవర్నో శేతిల బెట్టి పోయిండ్రు.ఇంగ తమ్ముని మర్దలు,షడ్డకుడు తలబట్కొని కూసుండ్రు. పెండ్లి పిలగానోళ్ళు గిదే సందని కయ్యం బెట్టవోతె, మా శెంద్రయ్య మావ కల్గజేస్కొని పరిత్తితి జెప్పి ఇద్దర్ని  ఊకుండ బెట్టిండు."
"గిట్లనే ఆ మావ పెళ్ళాం శెంకరమ్మత్త కల్గజేస్కొని ముత్తైదులందర్ని దెగ్గర్కి పిలిశింది.అవ్వాల్నె ఉన్న ఇంకో మూర్తం సైమం సుత ఉందని తెల్సుకుని గా సైమానికి పందిట్లకు బొయ్యి అమ్మలక్కలు అందరూ దీవెనార్తులు పల్కుతుంటే,పిల్ల, పిలగాని అమ్మ నాయినలు పక్కనుండంగ పెండ్లి పిలగానితో  పిల్ల మెల్లో తాళి కట్టిచ్చుకుంట "అయ్యోరొచ్చేదనుక అమాసాగుతదా?  నిండు నూరేళ్ళు మంచిగ కాపురం జేస్కుంట సల్లంగ బతుకుండ్రి బిడ్డా! " అని దీవెన్లిచ్చింది.
 గదైంతర్వాత ఇంగ అందర్ల మస్తు ఉషారొచ్చిందనుకో. అయ్యోరి ముచ్చటే మర్సిండ్రు.పిల్ల పిలగాడు సుత సంబురంగ తలంబ్రాలు పోసుకునుడు,బిందెల ఉంగరం తీసుడు, ఒడి బియ్యం బోసుడు...గిట్ల నాగవెల్లి, తదాస్తు అన్ని శంకరమ్మత్త పొల్లుబోకుండ ఇవురంగ జేయిచ్చింది.పంచను ఆల్లనుంచి గాల్లిద్దర్ని బైటికి తీస్కొచ్చి అరుంధతి నచ్చత్రం సుత సూపిచ్చిందవ్వా! వొచ్చినోళ్ళు సూసేటోళ్ళు మంత్రాలు లెవ్వని ఒకటే గని పెండ్లి మస్తుగా జర్గిందని ఒకటే అన్కోబట్టిండ్రు."
 "ఇంటుంటే నాకు సుత బలేగా అనిపిత్తుంది శెల్లే!"అని అవ్వ అంటుంటే...
 అక్కన్నే ఉండి గవన్ని విన్న భూలచ్మి "మేం సుత బొమ్మల పెండ్లి గిట్లనే చేత్తం. అయ్యోరుండడు ఏముండడు. బల్లె సార్లూ, పంతులమ్మలు జెప్పిన పజ్జాల్నే పెండ్లి మంత్రాలన్కుంట సద్వుతం అవ్వా!" అంటుంటే గంత ముచ్చెట్లల మునిగి పోయిన అవ్వ, శెల్లె గీతమ్మ నవ్వుకుంట  *"గివన్నీ నీకెందుకే భడవా! రాస్కోడం ఆపి గియ్యన్ని ఇంటున్నావ్! తప్పు గాదె... పెద్దోళ్ళయి గిట్ల ఇనకూడదు.ఆయ్ఁ  హన్నా?"
"సరే శెల్లె! గింతకీ అయ్యోరు వొచ్చిండా? లేదా? ముందుగాల గజ్జెప్పు శెల్లే."
"ఆఁ ఆఁ వొచ్చిండొచ్చిండవ్వా !  అప్పగింతల సైమానికి. ఏంది అయ్యోరు గిప్పుడా వొచ్చేదని అడిగితే ఆయన బండ్లె సమురు ఐపోయిందంట. పేటలో టాపిక్జాముల చిక్కుకుండంట. పెండ్లిల్ల మీద పెండ్లిల్లని తిరిగేతల్కి సెల్లుల మాట్లాడనీకి ఒక్క పుల్ల సుత లేకుండా సిచ్చాపు అయ్యిందట. గాయన జెప్పే కత యిన్నంక ఏమనాలో అర్తం కాలేదవ్వా!"
"యవ్వారం బాగనే ఉంది శెల్లె."అందుకే అయ్యోరొచ్చే దాక అమాససాగుతదా?" అంటరు మన పెద్దోళ్ళు."
"అవ్వా! అవ్వా గిది పెండ్లి గద! అమాసాగుడేంది? సమజైతలే" అని భూలచ్మి , గీతమ్మ ఒక్క పాలె అన్నరు.
దీన్కో కతుంది. ఎన్కట ఒకాయన వాళ్ళ నాయన సచ్చిపోతే అమాస అమాసకి నల్ల నువ్వులు నీళ్ళతో మంత్రాలు సదవి తప్పణాలు వొదుల్తుండు. దీనికి అయ్యోరొచ్చి మంత్రాలు సద్వుతడన్న మాట. గట్ల ఓ త్యేప బోత్త ( భోక్త)లను పిల్శిండు. వొంటలన్ని సిద్దం చేపిచ్చిండు.పన్నెండు గొట్టక ముందే తప్పణాలు వొదలాలి. అయ్యోరేమో రాలేదు. మంత్రాలు సద్వటం గా వొదిలే కొడుక్కేమో రావు. పన్నెండు ఎల్లక ముందే సూశి సూశి  అయ్యోరు రాకున్నా తప్పణాలు వొదిలి భోత్తల్కి భోజనాలు పెట్టి పంపిండు. గిదంత సూత్తున్న ఓ పెద్దాయన" మంచి పని జేషినవ్ రా అబ్బాయీ! "అయ్యోరొచ్చే దాక అమాససాగుతదా?" అన్నడంట గట్ల గీ సామెత బుట్టిందట శెల్లె!"
"ఇంగ సూస్కో  గాన్నించి ఏదైన ముక్యమైన పనికి ఎవల్నన్న  ముక్యమైనోల్లను పిలిత్తే గాళ్ళు సైమానికి రాకపోతే కొద్ది సేపు ఎదురు జూసి పని కానిచ్చే టప్పుడు గీ సామెతని ఉదార్నగ శెప్పుతరు. గిట్ల పతి సామెతెనకాల గిస్మంటి కతొకటి ఉంటది శెల్లె!"అన్న అవ్వ మాటల్కి" అవ్వా గియ్యాల బలే గున్నయి ముచ్చెట్లు అంటున్న మన్వరాల్ని జూసి... 
"హార్నీ! గిస్మంటి పెద్దోళ్ళ ముచ్చెట్లు ఇనొద్దన్న సుత శెవులు రిక్కిచ్చి ఇన్నవ్ తీ!"అనంగనే నేను సుత తమ్ముని కంటే పెద్దదాన్నేగా అవ్వా!" అన్న మాటల్కి  గీతమ్మ  నవ్వుకుంట "దీన్కి మస్తు తెల్వి వుందవ్వా! ఇంగ పోత! పొద్దుగూకింది "అన్కుంట బోయింది గీతమ్మ.
గదండీ సంగతి! "అయ్యోరొచ్చేదాక అమాసాగుతదా?" అంటే గిదే మరి.
కామెంట్‌లు