సర్ చెట్టూర్ శంకరన్ నాయర్: - - యామిజాల జగదీశ్



 అది 1924. ఒక భారతీయ న్యాయవాది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించే ఒక సత్యాన్ని వెల్లడించారు.
ఆ సత్యాన్ని చెప్పినందుకు క్షమాపణ చెప్పడమా లేదా దానిని సమర్థించుకున్నందుకు 20,500 పౌండ్లు చెల్లించడమా అనే రెండు అవకాశాలు ఆయన ముందుంచారు. ఇంతకూ ఆయనెవరో చెప్పలేదు కదూ....ఆయనే చెట్టూర్ శంకరన్ నాయర్.
ఇది అచంచలమైన ధైర్యసాహసాలకు, మాతృభూమి పట్ల ఉన్న విధేయతకు సంబంధించిన కథ.
1857లో కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించిన శంకరన్, భారతదేశంలోని అత్యంత విశిష్ట న్యాయవాదులలో ఒకరిగా ఎదిగారు. 1915 నాటికి, ఆయన వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో విద్యా శాఖను నిర్వహించే సభ్యుల్లో ఒకరు. 
ఆయనకు నైట్‌హుడ్ (సర్) బిరుదు లభించింది. ఆయన గౌరవమన్ననలందుకున్నారు. శక్తిమంతులని ఖ్యాతి గడించారు.
1919 ఏప్రిల్ 13వ తేదీ.
అమృత్‌సర్‌లోని జలియన్‌ వాలాబాగ్‌లో, బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ (Reginald Dyer) వేలాది మంది నిరాయుధ భారతీయులపై కాల్పులు జరపాలని సైనికులను ఆదేశించారు. ఈ దారుణమైన ఘటనలో  అనేకమంది మరణించారు.
ఇందుకు నిరసనగా ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు.
అప్పుడాయన ఇలా రాశారు: "దేశాన్ని పరిపాలించడానికి, జలియన్‌ వాలాబాగ్‌లో అమాయక ప్రజలను వధించడం అవసరమైతే, ఆ దేశంలో జీవించడం వ్యర్థం".
కానీ కోల్పోయిన అమాయక ప్రాణాలకు న్యాయం అందించే విషయానికి వస్తే, కేవలం రాజీనామా చేయడం సరిపోలేదు.
1922లో, ఆయన 'గాంధీ అండ్ అనార్కీ' అనే పుస్తకాన్ని ప్రచురించి, పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్ మైఖేల్ ఓ డ్వయ్యర్ (Sir Michael O'Dwyer, జలియన్ వాలాబాగ్ మారణకాండ చర్యకు బలమైన ప్రతిపాదకులలో ఒకరు) పై తీవ్ర ఆరోపణలు చేసి, ఈ ఊచకోతకు ఆయనే బాధ్యుడని పేర్కొన్నారు. డ్వయ్యర్ ఇంగ్లాండ్‌లో ఆయనపై పరువు నష్టం దావా వేశారు.
ఈ ఊచకోత జరిగిన ఐదేళ్ల తర్వాత, 1924లో లండన్‌లో విచారణ జరిగింది.
శంకరన్ నాయర్‌కు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి.
ఎందుకంటే, అది పూర్తిగా ఆంగ్లేయులతో కూడిన జ్యూరీ.
"డ్వయ్యర్ సరైన పనే చేశాడు" అని బహిరంగంగా ప్రకటించిన ప్రతికూల న్యాయమూర్తి, జస్టిస్ హెన్రీ మెక్‌కార్డీ.
భారతదేశానికి వేలాది మైళ్ల దూరంలో ఉన్న కోర్టు గది.
ఈ విచారణ ఐదున్నర వారాల పాటు కొనసాగింది. ఇది ఆ కాలంలోనే అత్యంత సుదీర్ఘమైన సివిల్ కేసుగా నిలిచింది. 
శంకరన్ భారతదేశం నుండి న్యాయవాదులు, వైద్యులు, విద్యావేత్తలు, జలియన్‌వాలాబాగ్‌లో తన మరణించిన భర్త పక్కన పడుకున్న రతన్ దేవి వంటి బాధితులతో సహా 125 మంది సాక్షులను తీసుకువెళ్ళారు.
తీర్పు వెలువడినప్పుడు, 12 మంది జ్యూరీ సభ్యులలో 11 మంది డ్వయ్యర్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.  బ్రిటిష్ వామపక్ష విద్యావేత్త హెరాల్డ్ లాస్కీ నుండి వచ్చిన ఏకైక భిన్నాభిప్రాయం. శంకరన్ కు 500 పౌండ్ల నష్టపరిహారం, 20,000 పౌండ్ల చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని ఆదేశించారు.
శంకరన్ క్షమాపణలు చెబితే  అన్నింటినీ మాఫీ చేస్తానని డ్వయ్యర్ ప్రతిపాదించాడు. కానీ అందుకు శంకరన్ నిరాకరించారు.
శంకరన్ ఒక్క మాట కూడా ఉపసంహరించుకోవడానికి బదులుగా ప్రతి పైసా చెల్లించాలని ఎంచుకున్నారు. ఆయన కేసులో ఓడిపోయినప్పటికీ, విచారణ అంతర్జాతీయ దృష్టిని మారణహోమం వైపు ఆకర్షించింది. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని తిరిగి రగిలించింది.
భారత స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శంకరన్ నాయర్ 1934లో మరణించారు.
భారత దేశం గణతంత్ర దేశంగా సార్వభౌమ దేశంగా మారడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా పిలుచుకోవడానికి మన న్యాయం, సమగ్రత కోసం పోరాడిన దార్శనికులను మనం గుర్తుచేసుకోవడం కనీస కర్తవ్యం.
ధైర్యం అంటే గెలవడం కాదని ఆయన కథ మనకు గుర్తు చేస్తుంది. సత్యం కోసం నిలబడటం, ప్రపంచం మోకరిల్లమని కోరినప్పుడు కూడా వంగడానికి నిరాకరించిన శంకరన్ లాంటి ప్రముఖులెదరో ఉండటం గమనార్హం.



కామెంట్‌లు