సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -105- అలివిగాని అప్పు జేస్తే చెట్టెక్కి చేయిడిచినట్టే
*****
"అవ్వా ! గిదిన్నవా? మన అప్రావు మావోళ్ల సంగతి? నిన్న మొన్నటి దాకా ఎక్కడైభోగం ఎక్కడైభోగం. సంపన్న సావుకార్లు సుత గంత ఇదిగ బతుకంగ సూడలేదు. పైసల్ని నీళ్ళ లెక్క కర్సు జేత్తుంటే  తరాలు దిన్న తర్గని ఆత్తేమో అనుకున్న.శిన్న సన్న పేరంటాన్కి సుత ఖరీదైన పట్టు బట్టలేస్కొని మెన్నిండ నగలేస్కుని వొచ్చుడు సూశి  ఎంత తితిమంతులో  సూత్తుంటెనే తెలుత్తుందని అన్నకున్న.
 గింతకీ ఏమైంది శెల్లే! గా అప్రావు మావోల్లు తితి మంతులు కాదా?  ఏంటి గిన్నాళ్ళ నించి గాళ్ళు బాగున్నోళ్ళు 'అని ఊళ్లె పతొక్కరు అనుకోంగ నా శెవులార ఇన్న. 
"అవునవ్వా! గట్లనుకొని ఆ బెమలో పడి ఆళ్ళు అప్పడిగితే కాదన్కుండ పదేలు మొదల్కొని పదులు,ఇరవైల లచ్చల్లో సుత గీ వూల్లోళ్ళు ఇచ్చింది. అవుసరం అన్నరు.ఆరోగ్గెం అన్నరు. గట్ల అక్కర్లు ఎల్ల దీస్కొండ్రు."
 " మరి గీ యిసయం బయటికెట్ల పొక్కింది శెల్లె!"
 తీగ లాగితే డొంక కదిలినట్టు.  అప్పిచ్చిన ఓ ఆయన మీ అక్కెరకి నే ఇచ్చిన. గిప్పుడు నాకు అక్కరొచ్చింది. నా పైసలు నాకియ్యమని పొయ్యి అడిగిండంట.గప్పుడు శేతులు ఎల్లెలికల ఏసి మా తాన ముద్ద పైస సుత లేదు అన్నరంట.
"ఇంగ గక్కడొచ్చిందిట పంచాతి.మాట మాట బెర్గిందంట. గా అప్రావు మావ కొడుకు అడగొచ్చిన వాళ్ళని అడ్డమైనోళ్ళు అని ఇంకేదో అన్నట్ట.గట్ల శిలికి శిలికి గాలొతికె అయ్యింది.."
అయ్యో! గంత జరిగిందా శెల్లె! గందుకే కలోగంజో తాగి బత్కాలె గని అప్పుజేసి బత్కడం కన్న పాపం ఇంకొకటి లేదు శెల్లె. " "అలివి గాని అప్పు జేస్తే చెట్టెక్కి చేయిడిచినట్టే'' . అయిన మన ఐషతేందో మనకు దెల్సి ఖర్సు జెయ్యాలే. గంతే గని మందిని అడుగుడేంది. గిప్పుడు సూడు ఏమయ్యిందో?"
 ఒక్కొక్కలు అడుగుతుంటే తల్కాయ ఎక్కడ బెట్కోవాలో తెల్వక తెల్ల మొఖాలు ఏస్తుండ్రు.
 "పుట్టెడప్పులు బులబుల అని, గవి దీర్సేదానికి ఇంట్లె అందరు బత్కంత కట్టపడ్డా సుత అప్పు పూడదట్టుంది గదా  శెల్లె.
"అవునవ్వా!అప్పు నిప్పస్మంటిది.చిన్న రవ్వై మొదలైతే పేద్ద మంటైద్ది.గందుల శిక్కుకునేల శేస్తది. గందుకే దాని జోలికి పోవద్దు. శేతులు ఇడవొద్దు."
 శెట్టెక్కి శేయిడ్సుడు అంటే ఏందవ్వా? భూలచ్మి అడిగింది."శెట్టెక్కినపుడు గట్టిగ పట్కోకుండ చేతులు వొదిలేత్తె ఇంకేమన్న ఉందా! లపక్కున కింద పడుడు కాళ్ళు శేతులు యిరుగుడె.గందుకేె గష్మంటి ఆటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది".
అవును మేం కోతి కొమ్మచ్చి ఆడుకునే తప్పుడు గట్టిగ శేతులత్తో పట్కుంటం. ఓ పాలి మన బుడ్డోడు ఒద్దనంగ నేనాడ్త నేనాడ్త అనుకుంట ఒచ్చి ఎక్కిండు.గట్టిగ పట్కోక లటుక్కున పడబోతుంటే మేమంద్రం గట్టిగ పట్కొన్నం అవ్వా!లేకుంటెనా గయ్యాల గాని పనెయ్యేడిదే తెల్సా!
గంద్కే మరి అప్పైనా ఆటైనా జాగర్తగ ఉండాలె మరి.అవ్వ మాటల్కి అవునని ఇద్దరూ తల్లూపిండ్రు. 
 "గదండీ సంగతి.అలివి గాని అప్పు జేస్తే చెట్టెక్కి చేయిడిచినట్టే'' అని అన్న పెద్దల మాటని యాదికి దెచ్చుకొని ఉన్నంతల మంచిగ ఉండాలె.

కామెంట్‌లు