పుస్తకం - అక్షరామృత కలశం: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పుస్తకం — 
కళ్లకు అందాలు చూపి,
అక్షరాల అద్దంలో ప్రకృతిని ప్రదర్శించాలి,
లోకాన్ని అంతరంగాల్లో ప్రతిబింబించాలి.

పొస్తుకం — 
మనసుకు ఆనందం ఇచ్చి
సంతోషపు పూలు పూయించాలి,
భావాల తోటలో రంగులు వెదజల్లాలి.

గ్రంథం — 
కర్ణాలకు శ్రావ్యత కలిగించి
మౌనానికీ సంగీతం నేర్పాలి,
జీవన రాగం వినిపించాలి.

కితాబు — 
నోర్లకు తేనెచుక్కలు అందించి
పదాల మాధుర్యం పంచాలి,
పఠనమే పానీయమై కడుపులకు తృప్తినివ్వాలి.

బుక్కు — 
గుండెలకు లయ నేర్పి 
వేదనలకు తాళం వెయ్యాలి,
గమ్యాలను తెలియజేసి జీవితాన్ని నడిపించాలి.

పుస్తం — 
హృదయాలను తాకి
ఉత్తమ భావాలకు ప్రాచుర్యం కలిగించాలి,
ఒక శాశ్వత చిరునామా ఇవ్వాలి.

పుస్తి— 
మోములపై వెలుగులు చిమ్మి, నవ్వించి
జీవన పోరాటం చేయించాలి.
విజయానికి మార్గం చూపాలి.

పొస్కం — 
దేహాల్లో ప్రాణం నిలిపి,
అక్షరాలతో ఊపిరి పొయ్యాలి
మనిషిలో మనిషిని మేల్కొలపాలి.

పొస్తకం — 
ఖడ్గం కాదు
హస్తాలకు భూషణం కావాలి,
భాషకు ప్రతీకగా మారాలి.

పొత్తం - 
అక్షరామృత కలశం,
లిఖిత పదాల సంపుటం,
కవుల భావాల సమ్మిళితం.


కామెంట్‌లు