సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత-102: అందరికీ అన్ని రోగాలే - అడ్డెడు సర్వకే ఏ రోగం లేదు
***
"ఒక్కలంటే ఒక్కలికి పెయ్యి మీద పేనుబారినంత శెలనం ఉందా? సీమ కాలంత పన్జెప్తే "అమ్మో నా శాతనేడైతని ఒకలు,తుమ్మని, దగ్గని ,పడిషమని, నీర్సమని... ఒక్కొక్కలు ఒక్కో రోగాన బడ్డట్టు చెబుతుండ్రవ్వా! గాళ్ళందరి మీద్కి నేనొక్కదాన్నే గట్టిగ గన్పిస్తున్నట్టుంది.గీ అరవ శాకిరి జేసి జేసి నేను సుత అడ్డం బడేటట్టున్నవ్వా!''
 మనూల్లె ఆరెంపీ డాటర్ కి సూపిచ్చుకోనీకి ఎల్తూ ఎల్తూ నిన్నో పాలి పల్కరిచ్చి పోదమని వొచ్చిన,ఆలీసమైతే డాటరు ఊల్లెబడ్తె దొరకడు అన్కుంట వచ్చిన శాంతమ్మను చూసి...
"వొచ్చిందానివొచ్చినవ్ గని శెల్లె!  డాటర్ గింతెల్లెం యాడికి బోడుగని, గీ ఏడి ఏడి రాగి జావ గింత దాగిపో!" అన్కుంట టీలు గిలాసల జావ పోశి ఇచ్చింది.ముక్కాలి పీట మీద కూసోని ఉఫ్ ఉఫ్ మని ఊదుకుంట తాగుతున్న శాంతమ్మొంక జూసి..
 "ఏంది శెల్లె! గట్ల నలిగున్నవ్.తిండి సరింగ తింటల్లేదా ఏంది? అనంగనే "మూలిగేది మునిపెటోలె-- తిండి ఎప్పటోలె" అన్నొతికె ముక్కుకుంట మూలుక్కుంట తింటనే ఉన్నవ్వా!" అంది.
" శేతగానప్పుడు, పానం బాగ లేదన్నప్పుడు ఇల్లెడు శాకిరి వొక్కదానివి గంతగనం ఎందుకు జెయ్యాలె సెప్పు?"
 " ఏం జెయ్యనక్క తప్పట్లే.ఆయనేమో  మోకాలి శిప్ప మార్సుకొండు.ఇంగేం శేతనైద్ది.పెద్ధోడు పడిశెం,శిన్నోడు తల్కాయ నొప్పి అంటుండు.ఇంగ కోడండ్ల ముచ్చెట శెప్పనే ఈల్లేదు. ఆళ్ళు మాకంటే మాకు శాత గాట్లేదని పనుల కొప్పెత్తేసి ముద్దుగా ముడ్సుకొని పడుకుంటుండ్రు". గట్లని వొంట పని తగ్గిందా? తినేది ఆగిందా? గవ్వి మాత్తరం నడుత్తనే ఉన్నై" అంటున్న శాంతమ్మతో...
"అయితే"అందర్కీ అన్ని రోగాలే గని అడ్డెడు సర్వకే ఏ రోగం లేదన్న" మాట.అంతేనా శెల్లె !"
"అవ్వ మాటల్కి "సత్తెం బల్కినవ్ అవ్వా! నీ కడ్పు సల్లగుండ! నువ్వన్నొతికెనే అడ్డెడు సర్వకి అన్నం వొండితే మెత్కు మిగులకుండ ఐపోతున్నది.ఇంట్లె పతొక్కరు రోగమంటుండ్రు,రొప్పంటుండ్రు.శాత గాట్లేదంటుండ్రు గని గిదేం ఇచ్ఛింత్రమో! వొండింది వొండినట్టె ఒక్క మెత్కు లేకుండా ఐపోతుంది."
ఆఁ నువ్వు ఏమన్న అన్కొగని గాళ్ళకి చానా అలుసిచ్చినవ్ శెల్లె !పెద్దిర్కంతో అందర్ని కూసబెట్టి రెక్కలిరిగేటట్టు శేత్తుంటే,ఇంగ అందరూ సుఖాన్కి మరగమంటే మరగరా ఏంది?. లేకుంటే అడ్డెడు సర్వెడు బువ్వ గట్ల అడుగు మిగుల కుండ వొదుల్తదా? నువ్వే శెప్పు శెల్లె?"
 "అవునవ్వా! సేశినంత కాలం సేశిన! ఇంగ నా వొల్ల గాట్లె త్యాప త్యాపకు వొల్లు నీర్సమైపోతుంది.గని శెయ్యక తప్పట్లే మరి"
గా నీ బలీనతే మాన్కో! తలొక్క పని జెప్పి శేయించుకో! గిప్పుడే నిన్ను ఎవ్వలు పట్టిచ్చుకోట్లె! నువ్వడ్డం పడ్తె పట్టిచ్చుకుంట్రా!బాగ ఇచారిచ్చుకో శెల్లె! నువ్వు నీ శాంతం పక్కన బెట్టు. సక్కగ ఇంటికి బో! నేన్జెప్పినట్టు ఆళ్ళకి బాద్దెత తెల్సొచ్చేట్టు జెయ్యి" అంటున్న అవ్వొంక జూస్కుంట "గట్లనే జేత్తవ్వా! అన్కుంట ఇంటిమొగం పట్టింది శాంతమ్మ"
గదండీ సంగతి! "అందరికీ అన్ని రోగాలే గని అడ్డెడు సర్వకే ఏ రోగమూ లేదు" అంటే గిదే మరి. "
కామెంట్‌లు