షడ్రుచుల సాహిత్యసింగారం: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తేనెబొట్టు లాంటి పదార్థం,
మధుర పదాల మాధుర్యం,
మనసును మురిపించే మృదుత్వం
కవితకు తొలి ఆభరణం — తియ్యదనం.

చినుకులాంటి జ్ఞానం,
సత్యస్పర్శల సరళం,
జీవితపు నిజరూప దర్శనం
పదాల నిజత్వం — లవణం.

ధైర్యపు తళుకులాంటి
తీక్ష్ణ భావాల ప్రకాశం,
అన్యాయంపై అగ్నిపథం
కలం చేసే గర్జనం — కారం.

విరహపు రుచిలాంటి
వేదన తడిసిన భావం,
ప్రేమ విఫలమైన వేళలో
జాలిగా జారే అక్షరాలసమూహం — ఆమ్లం.

దుర్భర కష్టనష్టాల
అనుభవాల సమ్మిళితం,
పరిణతి పథం చూపిస్తూ
మనిషిని మార్చే కవనాలస్వాదం — తిక్తం.

త్యాగపు రుచిలాంటి
త్యజనగాథల తాత్పర్యం,
ఆత్మనిగ్రహ దీపంగా
వెలిగే భావ విస్తారం — కషాయం.

ఆరురుచుల కలయికే
అద్భుత కవితలకు ప్రాణాధారం,
షడ్రుచుల సమ్మేళనమే
సాహిత్య సామ్రాజ్యానికి సింగారం. 

అచ్చరాల ప్రియులకు 
అన్నిరుచులు అందించటానికే నా అక్షరాల అల్లకం -
పదపంక్తుల పాఠకులకు 
పసందులు పంచుటకొరకే నా పదముల పరిపాకం.


కామెంట్‌లు