సామెతల ఊట -సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -97;-అన్నం ఉడ్కిందో లేదో తెల్వాలంటే ఒక్క మెతుకు సాలు
*****
"నేను శెవుల ఇల్లు గట్కొని శెప్తనే ఉన్న. ఐతేంది "ఒర్లి ఒర్లి వాడే పాయె- వొండక తిని వీడే పాయె" అన్ని తీర్గ "గంజిల ఈగెను తీసిపారేసినట్టు పారేసిండ్రు.గిప్పుడేమో తల్కాయ బట్టుకొని కూసుండ్రు.ఇంట్లె ఆడోళ్ల మాటంటే శెవ్వు మీద పేను బారినట్టు సుత ఉండదు."దండకం లెక్క సదువుతున్న అవ్వ మాటల్కి.."
"ఎందుకే అవ్వా! సచ్చిన పాముని ఇంకా సంపుతవ్!" నీ మాట ఇననందుకు తగిన శాత్తయ్యింది.నా శెప్పుతో నేనే గొట్టుకునే పరిత్తితి వొచ్చింది."
 నిప్పుల శెయ్యి బెడ్తెగని కాలింది దెల్వలే గాడట్ట జేత్తడని కల్ల సుత అన్కోలే.నమ్మిచ్చి నిండా ముంచి పోయిండు.గాడి శెకలు సూత్తున్న గని గింత  మోసం జేత్తడన్కో లేదు.
ఆ కాడికి నువ్వు ఆడి సాటుంగ నెత్తి నోరు గొట్టుకుంట సెప్తనే వున్నవ్? గదేందో గాని మోసం జేసేటోన్నే ఎవ్వలైన నమ్ముతరు''.
ఒక్క తీర్గ రంధి పడ్తున్న ఇంటాయన్ని సూశి జాలి పడ్తూ..."ఇంగ పోనీ లెయ్యిరి.శేతులు గాల్నంక ఆకులు బట్కుంటే కాలినవి ఎంటనే పోతయా ఏంది? గిదో పాటమన్కోవాలె?"
 
 ఐన గని మంచోడో శెడ్డోడో  మొగం, మాట తీరు జూస్తే తెలుత్తనే ఉంటది.
అన్నం ఉడ్కిందో లేదో తెల్వాలంటే ఒక్క మెతుకు పట్కొని సూత్తె సాలదా? గట్లనే మణుసులు సుత గట్లనే గాళ్ల మాటల్ల,సేతల్ల తెలుత్తనే ఉంటది"
గాళ్ళిద్దట్ల  ఎవలెలాంటోళ్ళో తెలుత్తనే వుండె. గాని నక్క యినయాలు జేబట్టి మంచోడేమో నీ దుట్టిలో శెడ్డోడైండు,శెడ్డోడేమో మంచోడయ్యిుండు. ఇంగనైన గిస్మంటి వాటి మధ్యల తేడా కాత్తయిన కనిపెట్టకుంటె ఎట్టయ్యా!"అంటున్న అవ్వతో...
"నిజమేనే అవ్వా!గాని యవ్వారం జూశినపుడు మన్సుల మెర మెర అన్నది గని,ఆడొచ్చి పక్కోడి మీద షికాయతులు జెప్పినప్పుడే  గాన్నో కంట కనిపెట్టుండాల్సుంటే గిన్ని ముచ్చెట్లు అన్కునేటోల్లం కాదు తీ!
గా రామలచ్మిని జూడు ఎంత పొందిగ్గ ఉంటుందో... మల్ల గదే వొరమ్మని జూడు.మడిషిని సూత్తుంటేనే ఎట్టాంటిదో తెలుత్తది." గిట్ల  ఇద్దరాల్మొగలు లోకం తీరు ముచ్చట్లు పెట్కుంట ఉన్నరు.

కామెంట్‌లు