ఓ సంస్కారమా...నీకో నమస్కారం..!;- పోలయ్య కవి కూకట్లపల్లి-అత్తాపూర్, హైదరాబాద్
"మేం మాల్స్‌కి వస్తాం... 
"మా అందాలు ఆరబోస్తాం...!" 
"మేమింతే...అర్ధనగ్నంగా 
"అశ్లీలంగా ఉంటాం
"మా ఒళ్ళు... 
"మా ఇష్టం!" అంటే ఎలా..? 
నారీ స్వేచ్ఛకై గర్జించే గళాలు
అభ్యర్థిస్తున్నాయి ఆ అర్థనగ్న
పాశ్చాత్య సంస్కృతి మనకొద్దని..!

"మా కళ్ళు మా ఇష్టం..అంటాడో పోకిరి... 
"మా లాఠీ మా ఇష్టం...అంటాడో పోలీసు
పోకిరోళ్లకు శిక్ష మురికి కాలువల శుభ్రతే
పోకిరితనానికి...పొగరుబోతుతనానికి...
అహానికి..అజ్ఞానానికి..అందాల ఆరబోతకు..
ఇక చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది..!

ఓ సంస్కారమా..!
నీకో నమస్కారం... 
సిగ్గు, లజ్జా మాకేల...? 
మేం వంటింటి కుందేల్లం కాదు 
పిల్లల్ని కనే యంత్రాలం కాదు... 
మేం పంజరాల్లో పక్షులం కాదు..
గదుల్లో తిరిగే గబ్బిలాలం కాదు..! 

మేం వినువీధుల్లో
విహరించే విహంగాలం...
గాల్లో ఎగిరే గాలిపటాలం... 
స్వేచ్ఛ...మా జన్మహక్కు..! 

లోపం మాలో కాదు సృష్టిలో లేదు
కామాంధుడైన నరుని దృష్టిలోనే..! 
మమ్మల్ని విచ్చలవిడిగా తిరగనివ్వండి..!

ఐతే ఓ అందమా...నీవెక్కడ...? 
చీరకట్టులోనా...? స్త్రీ గుట్టులోనా...? 
ఆమె నుదుటి బొట్టులోనా...? కాదు...

మరి ఓ అందమా...నీవెక్కడ...? 
ఆత్మవిశ్వాసంలో స్వాభిమానంలో
స్త్రీ జాతి స్వేచ్ఛా స్వాతంత్ర్యంలో
కొండంత నిండుదనంలో నేనక్కడ..!

ఓ మహిళామణులారా... 
ఇకనైనా తెలుసుకోండి...
తిండి మీ కోసమని...
వస్త్రాలు పరుల కోసమని... 
కామాంధులు పుట్టరని...
కొందరిచే సృష్టించబడతారని..!
 
ఇది ఒక సభ్య సమాజం.. 
మన సభ్యతే...మన శోభ
మన సంస్కారమే...మన శక్తి 
మన సాంప్రదాయమే...మన గౌరవం..! 

భరతమాత మెడలో
మెరిసే మణిహారాలే మీరు.. 
మీ స్వేచ్ఛే...మీకు అందం... 
మీ ఆత్మగౌరవమే...మీకు శోభ...
మీ అలంకరణే...మీకు ఆభరణం..!

ఆ అర్థనగ్న వస్త్ర ధారణ
ఆ పాశ్చాత్య సంస్కృతి మనకేల..?
దేహాన్ని నిండుగా కప్పుకున్న వారే దేవతామూర్తులు....సందేహమేల..?

కామెంట్‌లు