వన పర్వము పంచమాశ్వాసము123 వ రోజు
దేవేంద్రుడు యుద్ధముకు వచ్చుట
దేవతలు దేవేంద్రుని వద్దకు వెళ్ళి " దేవేంద్రా! అగ్ని కుమారుడు తేజోవంతుడు, గర్వం కలవాడు. అతని వలన నీ పదవికి ముప్పు రాగలదు. నీ పదవి దక్కాలంటే వెంటనే అతనిని సంహరించడం మంచిది " అన్నారు. దేవేంద్రుడు సప్త మాతృకలను పిలిచి " మీరు అగ్ని కుమారుని సంహరించండి " అని ఆజ్ఞాపించాడు. అందుకు అంగీకరించి వెళ్ళిన సప్త మాతృకలు బాలుని తేజస్సు చూసి భయపడి అతనిని శరణు వేడారు. కుమార స్వామి వారిని మన్నించాడు. సప్త మాతృకలు బాలుని సంరక్షణ కొరకు లోహితాస్య అనే దాదిని సృష్టించారు. అగ్నిదేవుడు కుమారుని సంరక్షణా భారం స్వీకరించాడు. ఇది తెలుసుకున్న దేవేంద్రుడు ఆగ్రహించి తన సేనలతో కుమారస్వామి మీదకు దండెత్తి వచ్చాడు. కుమారస్వామి ముఖము నుండి వెలువడిన అగ్ని జ్వాలలకు భయపడిన దేవతలు అతనిని శరణుజొచ్చారు. దేవేంద్రుడు కుమారస్వామి మీదకు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది కుమారస్వామి కుడి భాగాన్ని తాకగా అందు నుండి బంగారు చాయతో, మేషముఖంతో శక్తి ఆయుధంతో ఒక పురుషుడు జన్మించాడు. అతని పేరు విశాఖుడు. అతనితో పాటు అనేక మంది బాల బాలికలు పుట్టారు. ఇది చూసిన దేవేంద్రుడు భయపడి కుమారస్వామిని శరణు వేడాడు.
కుమారస్వామి దేవతల మన్ననలను అందుకొనుట
దేవతలు సింహనాదాలు చేస్తూ కుమారస్వామి చెంత చేరారు. దేదీప్యమానంగా వెలుగుతున్న అగ్ని పుత్రుని చూసి లక్ష్మీ దేవి సాకారమై అతని చెంతన నిలిచింది. ఆరవదినం ఋషులు కుమారస్వామిని భక్తితో నమస్కరించి " దేవా! నీవు పుట్టిన ఆరుదినములకే లోకాలను జయించావు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, సుపరిపాలనా దేవేంద్రుని కర్తవ్యం. షణ్ముఖా నీవు అందుకు తగిన వాడివి కనుక ఇంద్ర పదవిని స్వీకరించుము " అని దేవతలు, ఋషులూ అడిగారు. ఇంద్రుడు " కుమారస్వామీ! నీవు శౌర్యవంతుడవు కనుక ఇంద్రపదవిని అంగీకరించుము " అని అడిగాడు. " దేవేంద్రా! నాకు ఇంద్ర పదవి అక్కర లేదు. నీ తేజస్సు చూసి దేవతలు తిరిగి నీవే ప్రభువు అని మోహంకలుగ చేసిన నీకు నాకు శత్రుత్వం వస్తుంది కనుక ఆ పదవిలో నీవే ఉండు " అని కుమారస్వామి అన్నాడు. దేవేంద్రుడు ఆ మాటలకు ఆనందించాడు. " కుమారా! నీవు మా సేనలకు ఆదిపత్యం వహించు " అని ఇంద్రుడు కుమారస్వామిని అడుగగా అతడు అందుకు అంగీకరించాడు. ఋషులు దేవతలు జయజయధ్వానాలు చేసి కుమారస్వామిని దేవ సేనాధిపతిగా అభిషేకించారు. మహాశివుడు అక్కడకు వచ్చి కుమారస్వామిని చేరదీసి విశ్వకర్మచే కూర్చ బడిన బంగారు పుష్పమాలను బహూకరించాడు " అని చెప్పగా ధర్మరాజు ఇక్కడ ఒక సందేహం వెలిబుచ్చాడు " మహర్షీ! కుమారస్వామి రుద్రాంశ సంభూతుడంటారు కదా అదెలా సంభవించింది " అని అడిగాడు. మార్కండేయుడు ధర్మరాజుతో " ధర్మరాజా! పూర్వం శివుడు తన తేజస్సును అగ్నియందు ప్రవేశపెట్టాడు. ఆ వీర్యము చేత అగ్నిహోత్రుడు కుమారస్వామిని పుట్టించాడు. అగ్నికి రుద్రుడనే నామాంతరం కూడా ఉంది. అందుచే కుమారస్వామిని అగ్ని పుత్రుడు, శివపుత్రుడు అని కూడా అంటారు " అన్నాడు. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి కృత్తికల రూపంలో ఆరుగురు ముని పత్నుల రూపంధరించి భర్తను చేరి కుమారస్వామికి జన్మ ఇచ్చినందున కార్తికేయుడనే నామం కలిగింది. ఈ సమయమున దేవేంద్రుడు తన వద్ద పెంచుకుంటున్న దేవసేనను అక్కడకు రప్పించి " కుమారా! ఈ కన్యను బ్రహ్మదేవుడు నీ కొరకే సృష్టించాడు ఈమెను స్వీకరించు " కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి