ఆకలి విప్లవం…?: - కవిరత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్, హైదరాబాద్
ఆకలి…

కనిపించని ఓ భూతం
అనాధ బిడ్డ కంటిలో
ఓ కన్నీటి జలపాతం
అణచివేతతో అవమానంతో
బుసలు కొట్టే విషసర్పం...

రాక్షస రాజకీయ
ఊసరవెల్లి రంగులుమార్చేవేళ
దోపిడీలకు దౌర్జన్యాలకు
అన్యాయాలకు అక్రమాలకు
అవినీతికి వ్యతిరేకంగా
అభ్యుదయకవి గుండెల్లో రగిలే
అక్షరాగ్నిజ్వాలే ఆరని ఆకలి…

ఔను ఆకలి భిక్ష కాదు
ఆవేశం రక్ష కాదు
శిరస్సు వంచడమే శిక్ష
అది ఆత్మ గౌరవ పోరాటం
హక్కులు సాధించాలనే ఆరాటం
ఆ హక్కుల్ని కాలరాచిన రోజే
మండేగుండెల్లో
విప్లవ గంగ ఉప్పొంగుతుంది...

ధనదాహంతో
కామదాహంతో మత్తెక్కి
విచక్షణకోల్పోయి
ఆకలి అరుపులు
వినిపించని సమాజంలో
మనిషి బతికినా
మానవత్వం మృతమే...

కరుణ ప్రేమ జాలి దయ
నిండిన హృదయమే దేవాలయం
అన్నం మెతుకులు పంచే హస్తమే
ఆదరించే అభయామృత హస్తం...

ఇంద్రధనుస్సు
ఏడు రంగులు ఏకమైతే
అదే ఆకలి రంగు…
దాని వెనుక ఒకే తపన
ఆత్మగౌరవంతో బ్రతకాలన్న ఆర్తనాదం…

ఓ మనిషీ గుర్తుంచుకో...
ఆకలిని ఆర్పేస్తే అది శాంతికిదారియని..
ఆవేశాన్ని రగిలిస్తే అది విప్లవ‌భేరియని...

నీ కడుపు నిండితే
పంచే చేయి అవ్వు
పంచని ఆ అన్నం ముద్దే..
తీరని ఆ ఆకలే మారని ఆ బ్రతుకే.. 
చరిత్ర పుటల్ని తిరగరాసింది...
విప్లవ శంఖారావాన్ని పూరించింది...
ఆధిపత్యంపై తిరుగుబాటు చేసింది.


కామెంట్‌లు