గాలిపటాలు:- - యామిజాల జగదీశ్

 గాలిపటాలను ఎక్కువగా సరదా కోసం ఎగురవేస్తారు. అయితే కొన్ని ప్రాంతాలలో ఈ గాలిపటం కళారూపం సంతరించుకున్నాది. దీని వలన కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. కొన్ని గాలిపటాలను పోటీల కోసం వివిధ డిజైన్లు ఆకర్షణీయంగా తయారుచేస్తారు. కొన్ని పెద్ద గాలిపటాలు అధిక శక్తివంతమైనవిగా సర్ఫింగ్, బోర్డింగ్ లేదా బుగ్గీయింగ్ వంటి క్రీడలలో ఉపయోగిస్తున్నారు. కొన్ని గాలిపటాలను మిలటరీలో కూడా ఉపయోగించిన సందర్భాలు ఉండటం విశేషం.
గాలిపటం  ఓ ఆట. గాలిపటం తయారీకి ఒక చతురస్రాకారపు కాగితం, రెండు వెదురుబద్దలు,  తగినంత దారం అవసరం. వినోదం కోసం గాలిలోకి ఎగరేయడం మనం చూస్తూనే ఉంటాం.  
గాలిపటాన్నే "పతంగి" అని కూడా అంటారు. దీనినే ఇంగ్లీషులో కైట్ అంటారు.  
ఆంధ్రులు ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఈ పతంగులను ఎగురవేస్తారు. గాలిపటం ఎగరడానికి ముఖ్యంగా దారంలోని బలం ప్రధానమైన కారణం.  గాలి పటం పైభాగంలో తక్కువ ఒత్తిడి కింది భాగంలో ఎక్కువ ఒత్తిడి కలిగి ఎగురగలుగుతుంది. ఇదే మూలసూత్రం. గాలి వీచే దిశలో ముందుకు పోవడానికి తోడ్పడుతుంది. ఈ రెండు బలాలకు దారం లేదా దారాలలోని బలం వ్యతిరేకదిశలో పని చేసి గాలిపటాన్ని నియంత్రిస్తుంది. 
గాలిపటాన్ని నిలకడగా ఎగురవేయొచ్చు. లేదా కొన్ని సార్లు పరిగెడుతూ ఎగురవేయవచ్చును. గాలిపటాలు సామాన్యంగా గాలి కంటే బరువైనవి. అయితే కొన్ని రకాలు గాలి కంటే తేలికైనవి కూడా. వీటిని హెలికైట్ అంటారు, ఇవి వీచేగాలి లేకుండా కూడా ఎగురుతాయి. గాలిపటాలను గాలిలో తేలికగా ఎగరటానికి అనువైన కాగితం లేదా పట్టు వస్త్రంలాటివాటితో చేస్తారు. ఒకటి లేదా రెండు వెదురు లేదా కొబ్బరి ఈనెలలాటి పుల్లలను తెరచాప ఆధారాల మాదిరిగా అమర్చి కాగితాన్ని అతికించి పుల్ల మధ్యలో దారం కడితే గాలిపటం తయారవుతుంది, గాలిలో నియంత్రణ కలిగి ఉంటానికి తోకని కూడా అమర్చటం కద్దు. నవీన పద్ధతులలో గాలిపటాలను ఉలిపిరి పొరలవంటి తెరలను ఉపయోగించి ఏ విధమైన ఆధారాలూ లేకుండానే తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు తెరలకి ఆకర్షణీయమైన ఫైబర్ గ్లాస్, కార్బన్ నారలాంటి వాటిని తెరలుగా, డెక్రాన్ లేదా డైనీమాలాంటి కృత్రిమ పదార్థాలను ఆధారాలుగా వాడుతుంటారు. గాలిపటాలను మామూలు దారం లేదా ట్వయిన్ దారంతో ఎగరవేయటం మామూలే. కొన్నిసార్లు వేరే గాలిపటాల దారాన్ని తెంచటానికి గాజుపిండిని దారానికి పూస్తారు. 
గాలిపటాలను అనేక ఆకారాలలో తయారుచేస్తారు. మాములుగా పిల్లలు ఆడుకునే గాలిపటాలు చతురస్ర లేదా డైమండ్ తదితర నమూనాలను పోలి వుంటాయి.  మంచి నాణ్యత కలిగిన చైనా గాలిపటాలను చీల్చిన వెదురు బద్దల ఆధారాలతో పట్టువస్త్రం ఉపయోగించి తయారు చేసి హస్తకళాచిత్రాలతో అలంకరిస్తారు. తక్కువ ఖర్చుతో పెద్దయెత్తున ఉత్పత్తి చేసే గాలిపటాలను ప్రింటెడ్-పాలిస్టర్ తో తయారు చేస్తారు. పెద్దపెద్ద గాలిపటాలను మడతపెట్టటానికి వీలుగా మడతకీళ్ళతో తయారుచేస్తారు. ఆధునిక గాలిపటాలు అనేక వంపులతో గాలిలో కచ్చితమయిన నియంత్రణ కలిగి వుంటాయి. కొన్నిగాలిపటాలలో అత్యవసరంగా గాలిపటాన్ని ఎగరవేసే వారి నుంచీ విడదీయటానికి ఏర్పాటు వుంటుంది. గాలిపటాలతో సాధారణంగా చిన్న చిన్న ప్రమాదాలు మాత్రమే జరుగుతాయి. ఎక్కువ ప్రమాదాలు మంగా లేదా దారం తయారీలో వాడే గాజుపొడి మూలంగా జరుగుతున్నాయి. దీని వల్ల ఎగరేస్తున్న వ్యక్తి వేళ్ళు కోసుకుపోవచ్చు. అందువలన ఎగరేస్తున్న వేలుకు రక్షణగా తొడుగును ఉపయోగించడం మంచిది. వర్షాకాలంలో గాలిపటం ఎగరేస్తున్నప్పుడు తడిగానున్న దారం విద్యుత్ తీగలకు తగులుకొని ఎగరేస్తున్న వ్యక్తి విద్యుద్ఘాతానికి గురికావచ్చును.  
ఏదేమైనా దేశవ్యాప్తంగా ఎగరేసే గాలిపటాల గురించి కొన్ని విషయాలు...
దాదాపు 3,000 సంవత్సరాల క్రితం చైనాలో గాలిపటాలు నింగినెగిరాయి. మొదటగా చైనా నుండి గాలిపటాలు ఎగరేయడం అనేది వ్రాతపూర్వకంగా నమోదైన రికార్డు. గాలిపటాలు అనేక ప్రయోజనాల కోసం ఉపయోగిం చారు.  శత్రువులపై నిఘా కోసం కెమెరాలు, సైనికులను తీసుకెళ్లడం వంటి సైనిక వ్యూహాలకు గాలిపటాలు దోహదపడ్డాయి. గాలిపటాలు వాతావరణ పరిస్థితులను గణించడానికీ వాతావరణాన్ని అధ్యయనం చేయడానికీ తోడ్పడ్డాయి. ఉదాహరణకు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ మెరుపు విద్యుత్ అని నిరూపించడానికి ఉరుములతో కూడిన కీని జోడించి గాలిపటం ఎగురవేసాడు. గాలిపటాలు మతపరమైన, వేడుక ప్రయోజనాల కోసం ఉపయోగపడ్డాయి. పతంగులు కళాత్మక వ్యక్తీకరణ జానపద రూపం. మలేషియా, ఇండోనేషియా, దక్షిణ పసిఫిక్‌లో గాలిపటాలను చేపలు పట్టే సాధనంగా ఉపయోగించారు. ప్రతికూలమైన వాతావరణంలో గాలిపటాలు ఎగరేయడం సరికాదు.



కామెంట్‌లు