సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత-95: అత్త కాలం కొన్నాళ్ళు - కోడలి కాలం కొన్నాళ్ళు
***
 "అవ్వా! గీ బగమంతుని మాయ ఎంత ఇచ్ఛింత్రమో కదా! గీ మడుసుల బతుకులు ఎప్పుడు తార్మార్ చేత్తడో కలలో సుత ఊయించం. మిడ్సిపడేటోళ్ళని ముడుసుకు పడుండేటట్లు అమాంతం అగాధంల యిసిరేత్తడు.ముడుసుకొన్నోళ్ళను గుంజుకొచ్చి అప్పటికప్పుడే  అందలం ఎక్కిత్తడు.*
*ఇంకో మాట అవ్వా?  ఆంకారంతో ఉన్నోళ్ళని కానీ ఎవల్నైతే తక్వగ సూశి అవమానించిండ్రో గాళ్ళ ముందే దీనంగా పడి ఉండేటట్లు చేస్తడు. ఎంతైనా దేవుని లీలలు దేవుని లీలలే అవ్వా!
 ఏంది శెల్లె? ఎన్నల్లేంది? గియ్యాలేందో వేదాంతం వొల్లిత్తన్నవ్ .గింతకి ఏం జరిగిందేటీ?
 ఏం లేదవ్వా!గియ్యాలెందుకో గా రోగాలు,నొప్పులతో బాదపడ్తున్న  రాజవ్వ యాదికి వచ్చింది.ఎట్టున్న మనిషి ఎట్టైందనుకున్నవ్! ఏనుగంత మడిషి పీన్గొతికే  అయినట్టు సావ లేక బత్కలేక ఎముని పిలుపు కోసం ఎయ్యి కండ్లతో ఏడ్సుకుంట ఎదురు సూత్తుంది.నోట మాట సుత సరింగ రాట్లే.
అయ్యో!గట్లనా శెల్లె. నాకు దెల్వకనే పాయె. నేను సుత సూశిరావాలె. గింతకీ కోడలెట్లుంది?
 "గిప్పుడు మంచిగనే వుంది.ఇప్పుడు దానిదే పెత్తనం. అత్త శేతి తాళాలు దాని శేతికి వొచ్చినయ్. గిప్పుడు గా సాయిత్రిని సూత్తుంటే అచ్చం రాజవ్వ లెక్కనే అగపడ్తా వుంది.
రాజవ్వ కోడల్ని అట్టా ఇట్టా బాద పెట్టిందా? రాశి రంపాన బెట్టె. ఇప్పుడు సూడు.గట్ల తిట్టి సాపిచ్చిన కోడలితోనే చేయించుకోవల్సి వచ్చే...
 "అవునా శెల్లె!"అత్త కాలం కొన్నేళ్ళు--కోడలి కాలం కొన్నేళ్ళు అంటే ఇదే మరి. మన పెద్దోళ్ళు గిస్మంటి సామెతను ఊకెనే బుట్టించలే.
 "అవ్వ మాటల్ని నెమరేసుకుంట అవునవ్వా! నువ్వన్నది సత్తెం. ఎవలికైనా ఎప్పటికో అప్పుడు గిస్మంటి రోజు వత్తది కదా అన్పించింది. అన్కుంట..
ఇంగ బోతవ్వా! ఇంక పని గాలేదు..ఎందుకో మన్సు బాగ లేక నీతానకొచ్చిన.ఇంగ బోత అని బయటికొచ్చింది శాంతవ్వ.
గిదండీ!  సంగతి!"అత్త కాలం కొన్నాళ్ళు- కోడలి కాలం కొన్నాళ్ళు "అంటే...తనప్పుడు కోడల్ని మంచిగ సూస్కుంటే కోడలు కూడా అత్తని మంచిగ సూస్కుంటది.
కామెంట్‌లు