భారతదేశ ప్రజలకు చిరస్మరణీయులు, స్పూర్తి ప్రదాత, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, జయంతే కాని వర్ధంతి లేని సుభాష్ చంద్రబోస్ 130 వ జయంతిని ఈనెల 23 న జరుపుకుంటున్న తరుణం లో నేతాజీ స్మారక స్థూపం, చితా భస్మం భద్రపరచారని భావిస్తున్న పవిత్ర స్థలం ఎక్కడుంది? అక్కడెందుకుంది ? వంటి అంశాలపై ఈ కథనం...
సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని అజాద్ హింద్ ఫౌజ్ జపాన్ దేశపు పూర్తి సైనిక, నైతిక మద్దతుతో బర్మా, కోహిమాలు దాటి ఇంఫాల్ చేరుకుంది. అయితే, రెండవ ప్రపంచ యుద్దం చివరి దశలో అమెరికా హీరోషిమా, నాగసాకి పట్టణాలపై అణుబాంబులతో జరిపిన దాడి ప్రత్యర్థి జపాన్ ను ఆత్మరక్షణ లో పడేయటంతో... తమ దేశం మరింత నష్టపోవడం ఇష్టం లేక జపాన్ యుద్ధం నుండి తప్పుకుంది.
మిత్ర రాజ్యాలు విజయం, అక్ష రాజ్యాలు ఓటమితో సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయంగా రష్యా వంటి కొత్త మిత్రుల సహాయం కోసం ముందడుగు వేసారు . ఈ లక్ష్య సాధనలో భాగంగా అజాద్ హింద్ ప్రభుత్వ ప్రధాన కేంద్రం సింగపూర్ నుండి సహచరులను, సైన్యాన్ని వెళ్ళిపోమని సూచించిన నేతాజీ 1945 ఆగష్టు 17 న వియత్నాం లోని సెగాన్ లో విమానం లో బయలుదేరారు. అయితే, ఆ విమానం ప్రమాదానికి గురైందని , ఈ ప్రమాదంలో ఆగష్టు 18 న సుభాష్ చంద్రబోస్ తైవాన్ లో మరణించారని టోక్యో రేడియో ఆగష్టు 22న ప్రకటించటంతో భారతావనితో పాటు ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందింది. నేతాజీ ఈ ప్రమాదంలో మరణించలేదని, అజ్ఞాత జీవితం గడిపారనే వాదన కూడా ఉంది.
విమాన ప్రయాదంలో మరణించారని భావిస్తున్న సుభాష్ చంద్రబోస్ చితాభస్మాన్ని సేకరించిన జపాన్ ప్రభుత్వం వీటిని టోక్యో నగర శివార్లలో గల రెన్ కో - జి బౌద్ధ మందిరం లో చిన్న బంగారు పగోడా లో భద్రపరిచారని భావిస్తున్నారు.
ఈ ఆలయ ప్రాంగణంలో 1975 లో నేతాజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేసారు.
భారతదేశ రాష్ట్రపతి డా.బాబు రాజేంద్ర ప్రసాద్, ప్రధాన మంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ, ఏ బి వాజపేయి తో పాటు మన దేశానికి చెందిన ప్రముఖులెందరో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించారు.
ప్రతిఏటా నేతాజీ వర్ధంతిగా భావిస్తున్న ఆగష్టు 18 న రెన్ కో - జి బౌద్ధ మందిరాన్ని భారతీయులు మరియు జపనీయులు సందర్శించి పండ్లు, పుష్పాలతో తమ ప్రియతమ నేతకు ఘన నివాళి ఘటిస్తారు. ఈ ప్రాంతం ఇప్పుడు ఓ పవిత్ర, చారిత్రక, యాత్రాస్థలమైనది.
సుభాష్ చంద్రబోస్ కి చెందినదిగా భావిస్తున్న ఈ చితాభస్మాన్ని డి ఎన్ ఏ పరీక్ష ద్వారా నిర్ధారించి భారతదేశానికి తేవాలని వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
నేతాజీ మరణం పై స్పష్టత లేనందున, 1992 లో భారత
ప్రభుత్వం నేతాజీకి ప్రకటించిన భారతరత్న పురస్కారాన్ని కుటుంబ సభ్యులు తిరస్కరించారు.
============================================
చౌధరి రాధాకృష్ణ,
గాంధేయవాది,
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి