గాంధీజీ భారతావనిలో నివసించిన ప్రదేశాలు.:- చౌధరి రాధాకృష్ణ -జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం.
 భిన్నత్వంలో ఏకత్వం సాధించి భారతీయులందరినీ ఏకతాటిపైకి తెచ్చి తాను దృఢంగా విశ్వసించిన అహింస, సత్యాగ్రహం, త్యాగం, ఐక్యత, ధైర్యసాహసాలు వంటి ఆయుధాలతో భారత స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించిన మహాత్మాగాంధీ భారతీయులకు చిరస్మరణీయులు, నిత్య స్పూర్తిప్రదాత.
ఉద్యోగరీత్యా దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీజీ ఉద్యోగానికి స్వస్తి పలికి బ్రిటన్ లో కొద్దికాలం నివసించిన గాంధీజీ, భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించడానికి ముంబాయిలో 1915 జనవరి 9న అడుగిడిననాటి నుండి 1948 జనవరి 30న తుది శ్వాస విడుచు వరకు...
భారతదేశ స్వాతంత్ర్యం, అనంతరం మతసామరస్యం, దేశాభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసి భారతీయుల స్మృతిపథంలో మహోన్నతస్థానం పొంది మహాత్ముడయ్యారు.
ఉద్యోగం వదిలి, భారతదేశంలో అడుగిడిననాటి నుండి తుదిశ్వాస విడిచిన వరకు ఆయన ఏయే ప్రాంతాల్లో నివసించి స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించారో క్లుప్తంగా సింహావలోకనం చేసుకుందాం. 
గుజరాత్ లోని పోరుబందర్ లో 1869 అక్టోబర్ 2న జన్మించిన గాంధీజీ, కీర్తి మందిర్ గా నేడు పిలువబడుతున్న తాను పుట్టిన ఇంటిని తన కార్యస్థానానికి ఎంపిక చేసుకోకపోవడం విశేషం.
1883లో కస్తూరిబా మాఖంజీని వివాహం చేసుకున్న ఆయన 1888 నుండి 1891 వరకు మూడేండ్లపాటు లండన్ లో 'లా' పూర్తిచేసి స్వదేశానికి తిరిగి వచ్చారు. 1891నుండి 1893వరకు ఆయన ముంబాయిలో న్యాయవాది వృత్తిని చేపట్టినా, ఆ వృత్తిలో కొనసాగలేదు.
1893నుండి 1914వరకు దక్షిణాఫ్రికాలో న్యాయ సలహాదారునిగా ఉద్యోగం చేసారు. ఉద్యోగం వదిలిన ఆయన 1914లో బ్రిటన్ వెళ్లి 1915 జనవరి 9న ముంబాయి చేరి భారతావని అంతా కలియతిరిగి భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించారు.
జీవన్ లాల్ దేశాయ్ అహ్మదాబాద్ లో నిర్మించిన కొచ్రాబ్ ఆశ్రమంలో కొంతకాలం పాటు నివసించిన గాంధీజీ సబర్మతినది ఒడ్డున నిర్మించిన సబర్మతి ఆశ్రమంలో 17 జూన్ 1917నుండి 1930వరకు నివసించారు. 1930, 1932లలో జైలుజీవితం గడిపారు.
1934లో వార్ధాకు మారారు. 1936లో అక్కడికి సమీపంలోని సేవాగ్రామ్ లో 1942వరకు నివసించారు.
1942నుండి 1944వరకు భార్య కస్తురిబా గాంధీతో పూణేలో ఆగాఖాన్ పేలస్ లో జైలుజీవితం గడిపారు. ఈ సమయంలోనే భార్య కస్తురిబా గాంధీ 1944 ఫిబ్రవరి 22న మరణించారు.
1945-47 ల మధ్యకాలంలో ఆయన బెంగాల్ లోని నొఖాలి, కోల్కతా, ఢీల్లీలలో పర్యటిస్తూ మతసామరస్యం, స్వాతంత్ర్యపోరాటంలో భాగంగా బ్రిటిష్ వారితో చర్చలు, రాజ్యాంగసభ, భారత ప్రభుత్వం ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించారు.
1948లో న్యూఢిల్లీ లో బిర్లా హౌస్ లో ఉంటూ ఆ ఏడాది జనవరి 30న హత్యకు గురయ్యారు.
1922, 30, 32 లలో పూణేలోని యార్పాడ జైలులో, 1942నుండి 1944వరకు ఆగాఖాన్ పేలస్ జైలులో జైలుజీవితం గడిపారు. 




కామెంట్‌లు