పాడిపంటల...
పల్లకిలో పల్లె నవ్వుతుంది
పసిడి ధాన్యపు పూలతో
భూమి అలంకారమౌతుంది
రైతు చెమట చినుకులే
ఇక్కడి మట్టిలో మణిపూసలు
విత్తనాలే వేదాలు, కోతలే కీర్తి గాధలు..!
భోగిమంటల...
వెచ్చదనంలో బలమైన
బంధాలు చలి కాచుకుంటాయి
పాత బాధల్ని కాల్చి
కొత్త ఆశల్ని వెలిగిస్తాయి
చిమ్మిన పొగలో చిగురించే
ఆత్మీయతలు
గుండెల్లో వెలిగే కొత్త వెలుగులు..!
కొత్త జంటల...
నవ్వుల్లో కొత్త
కలల ప్రతిధ్వని
కలిసి నడిచే అడుగుల్లో
ప్రేమగీతాల విన్యాసం
వారిద్దరి కలయికే సంక్రాంతికి శోభ
వారిద్దరి కలలే పల్లెకు కొంగ్రొత్త శ్వాస..!
పిండివంటల...
పరిమళమే పల్లెవీధుల గీతం
అవే మరచిపోలేని మధుర జ్ఞాపకాలు
అమ్మ చేతి అరిసెలు, నాన్న చేతి హరివిల్లు
ఒకే వంటిల్లు…అది అనుబంధాల ఆలయం..!
కొత్త అల్లుళ్ళకు...
పలికే ఆత్మీయ ఆహ్వానంలో
ఇచ్చే ఆతిథ్యంలో అనురాగం పరిమళిస్తుంది
వారు తెచ్చే నవ్వులే ఇంటికి కొత్త వెలుగులు,
వారి పలుకులే మనసుకు మధుర రాగాలు..!
కోడిపందాల...
కేకలే పల్లెకు ప్రాణవాయువు
వాటిలోని ఉత్సాహమే యువతకు ప్రేరణ
పందెంలో గెలుపు కాదు గమ్యం
ఆనందంలో కలిసిపోవడమే అసలైన విజయగీతం.
ఇదే సంక్రాంతి...
ఇది పంటల పండుగ...
ఇది బంధాల బంధనం...
ఇది పల్లె పరిమళాల పల్లకి...
ఇది మన సంస్కృతికి
సాంప్రదాయానికి సజీవ సాక్ష్యం..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి