మోయగల భారం!: - - యామిజాల జగదీశ్

 శ్రీకృష్ణుడిని ఎంతగానో ప్రేమించే ఒక స్త్రీ ఒకరోజు ద్వారకలో ఆయన దగ్గరికి వెళ్లి, “నీ ఇష్టప్రకారం చేయడం తప్ప నాకు వేరే ఆనందం లేదు, కృష్ణా. నేను నీకు ఏం చేయాలో చెప్పు?” అని అడిగింది.
నిజానికి ఆమె కడు పేదరాలు. ఆమెకు తల్లిదండ్రులు లేరు.
కృష్ణుడు తనను ఏదైనా అడిగితే తప్పకుండా చేస్తాడని భావించి ఆమె అడగనే అడిగింది. 
తీరా ఆమె నిర్ఘాంతపోయేలా, కృష్ణుడు ఆమెకు ఒక పెద్ద సంచీ ఇచ్చి, “నేను ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా దీన్ని  తీసుకురా... అది చాలు. మన కళ్ళకు తప్ప మరెవరి కళ్ళకూ ఈ సంచీ కనపడదు!” అని అన్నాడు.
కానీ ఇంకేదో ఆశించిన ఆ స్త్రీ విస్తుపోయింది. 
ఎందుకంటే కృష్ణుడు తనకు ఓ మురికి సంచీ ఇస్తాడని ఆమె ఊహించలేదు.
ఆమె సంచీ లోపల ఏముందో చూడాలనుకుంది. కానీ అది గట్టిగా కట్టేసి ఉంది. ఆమె దానిని విప్పలేకపోయింది. అంటే అందులో ఏముందో చూడకూడదని తనది కృష్ణుడి మనసు అనుకుంది ఆమె. కనుక సంచీని తెరవాలనే ఆలోచనను మానుకుంది. మనసు మార్చుకుని, కృష్ణుడి చెప్పినట్లే దాన్ని మోసుకుని అతని వెంటే నడిచింది. 
కాలం గడిచేకొద్దీ, ఆమె ఒక్క క్షణం కంటే ఎక్కువసేపు ఆ సెంచరీని పట్టుకోలేక పోతోంది. 
“కృష్ణా, నేను నిన్ను సేవించడానికి వచ్చాను, నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను. నేను మోయలేని మురికి సంచీని నువ్వు నాకు ఇవ్వడం తగునా... ఇది కరుణామూర్తికి సముచితమేనా?” అని ఆమె ఒకింత నీరసంగా అంది. 
“నా బలం నీ బలహీనతలో ఉంది. చింతించకు, నేను నీ పక్షాన ఉన్నాను. నేను చెప్పినంత కాలం దానిని మోయాలి” అని కృష్ణుడన్నాడు.
కొంత కాలం గడిచింది.
కొన్ని సమయాల్లో, ఆమె దానిని ఎత్తలేనప్పుడు, కృష్ణుడు చేయందించాడు. భారాన్ని పంచుకున్నాడు.
ఒక రోజు, వారు వెళ్ళవలసిన ప్రదేశానికి చేరుకున్నారు.
“నువ్వు మోసింది చాలు. దానిని కింద పెట్టు!” అన్నాడు కృష్ణుడు. అలాగేనని ఆమె దానిని కింద పెట్టింది.
“సంచీ లోపల లోపల ఏముందో చూద్దాం?” అని కృష్ణుడు చిన్న నవ్వు నవ్వాడు. చాలా సేపటి నుంచి దాని కోసమే ఎదురుచూస్తున్న ఆమె "త్వరగా కృష్ణా..." అని అంది. 
కృష్ణుడు తన వేణువుతో బెంచీమీద ఇటూ అటూ తిప్పుతుంటే ముళ్ళు ఒక్కొక్కటే విడివడ్డాయి. సంచీలో మొదట, కంటికి కనిపించింది గడ్డి మాత్రమే. కానీ గడ్డి మధ్య, అరుదైన రత్నాలు, వజ్రాలు, బంగారు నాణాలు, బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇది స్వర్గంలోని కల్పతరువు మాత్రమే ఇవ్వగల నిధి!!
“ఇంతసేపు ఓపికగా నిరీక్షించిన నీకు ఇది నా బహుమతి. తీసుకో!!” అన్నాడు కృష్ణుడు.
ఆమెకు క్షణంపాటు ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యపోయింది. సంతోషంతో కళ్ళు చెమ్మగిల్లాయి. 
“కృష్ణా……. నన్ను క్షమించు,” అంటూ ఆమె కృష్ణుడి పాదాలపై పడింది.
“నువ్వు నాకు గొప్ప నిధి ఇచ్చినప్పటికీ, నేను ఇంతకాలమూ అది తెలియకుండా నీ గురించి తప్పుగా అనుకున్నాను. మనస్సులో నిన్ను కోపగించుకున్నాను.
నేను నీ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, నిన్ను అనుమానించకపోతే, ఈ నిధి భారాన్ని మోయడం నాకు ఆనందంగా ఉండేది. కానీ నిన్ను నేను తిట్టుకున్నాను. మోయలేక పోతున్నానని నీతో చెప్పేదాన్ని కాదు. నన్ను క్షమించు.…” అని ఆమె అంది. అప్పుడు కృష్ణుడు తనదైన శైలిలో నవ్వాడు.
మనం మోయగల భారాన్ని భగవంతుడిస్తాడు. మనం వాటిని భారమనుకుంటే భారం. వాటిని సంపదలుగా భావిస్తే, అవి సంపదలే. ఏదైనా అది మన చేతుల్లోనే ఉంది. మనం చూసే తీరులోనే తేడా అంతా. మనం ఏం మోయగలమో ప్రభువుకు తెలుసు. దేవుడు మనం మోయగల భారాన్ని మాత్రమే ఇస్తాడు. కాబట్టి, భగవంతుడిని పూర్తిగా నమ్మాలి.

కామెంట్‌లు