సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -121: అర్థబలం కంటే అంగబలం ఎక్కువ
*****
"అవ్వా! గా  పెద్దాయన కొడుకు సంగతి తెల్సిందా! అయ్య అయాంలో అణిగిమణిగి అతి యినయంగ నాయిన జెప్పినట్టు ఇన్నడు. గాయనెప్పుడైతె మూలన బడ్డడో గీనె అయామొచ్చింది. గప్పన్నించి మిడిసిపాటుతో ఎగిరెగిరి పడ్తున్నడు. డాబు దప్పం సూపిచ్చుకుంట ఊల్లె ఎవల్ని బడితే ఆళ్ళని తక్వ జేసి మాట్లాడుతుండట.
 మొన్నటికి మొన్న మల్లమ్మొదిన కోడల్ని దొర్సాని రమ్మని పిలిశిందట .ఇంట్లె సుట్టాలు పక్కాలున్నరు.ఇల్లెడు పని దినాం జేసే పనామ వల్ల కావట్లే.కాత్త శేతికింద అర్సుకోడానికి రమ్మని. గా యమ్మ మంచితనం జూసి కాదన్లేక ఎల్లిందంట.
అవునా శెల్లె! గాయన్కి కాత్త దిమాకి ఎక్కువే! మడిషికి నిలువెల్ల గరువం,అంకారముంది. గాయన్ని సూత్తుంటే నాకైతే  సైన్మాల ఇలను లెక్కనే అగుపిత్తడు శెల్లె!
"అవునవ్వా! గా ముచ్చటే నీకు శెప్పనీకి వొచ్చిన.నువ్వన్న గా దొరసాని మొగుడు  త్యాప త్యాపకి పెళ్ళాం కాడికొచ్చి"అందర్ని కలగంపులగం చేత్తున్నవు. 'గాళ్ళెక్కడ- మనమెక్కడ 'ఎవల్నెక్కడుంచాలో అక్కన్నే ఉంచాలె " అని ఏదేదో మాట్లాడ్డం మల్లమ్మొదిన కోడలు యిన్నదట. గాయ్న మాటల్కి మన్సు శివుక్కుమందట. ఏదో దొరసాని  మొకం, మంచితనం జూసి ఎల్లిన గని లేకపోతే నేనెందుకు పోత " అని బందు వెట్టిందట.
లేకపోతే ఏంది మంచిపని చేసింది శెల్లె!
"గదేంది గట్ల బందు వెట్టుడేందని ఇంటికాడికొచ్చి.ఏదో తొర్రికూత కూసిండంట.ఇంగ జూస్కో అవ్వా! మల్లమ్మొదినకి అరికాలి మంట నెత్తికెక్కిందట. పెద్దోడా గిద్దోడా అని చూడకుండా "బాంచెత్ నా యింటికొచ్చి నా నావోళ్ళనే అంటవా? నీ సంగతి జెప్త! ఎన్కటి రోజులనుకుంటున్నవా? నోటికేదొత్తె అదిని తలొంచుకుని బరాయించడాన్కి" నా నా కోడల్ని బట్కొని అంత లావు మాటన్తవా?అని శడామడా తిట్టిందట.

ఇంగ తోక ముడ్సుకొని పోయిండు గని గీ మాటలు దెల్సిన మల్లవ్వ కొడుకు అస్సలూకోట్లేదటవ్వా? గియ్యాల రచ్చబండ కాడ అందరి ముందల గీ యిష్యం తశ్వా జేయాల్సిందేనని పట్టుబట్టిండంటవ్వా!"
"అవునా శెల్లె గిప్పుడు తెలుత్తది తీ! అర్త బెలమెక్కువా? అంగ బలమెక్కువా? అనేది?
"అవ్వా! అవ్వా! రచ్చబండ కాడ పేద్ద లొల్లి అయితాంది. పోలీసోల్లు సుత వొచ్చిండ్రు.ఊల్లె అందరూ గక్కన్నే పోగయిన్రు. నువ్వు సుత రా అవ్వా! సూశొద్దాం రా!"
 "సరే! పా శెల్లె పోదాం. నడ్వే భూలచ్మీ!"
"వామ్మో? వామ్మో! అంగబలమంటే ఏందో అన్కున్న అవ్వా? శిత ముండ్రు. ఇంగ గాయ్న పని అయినట్టే.
 అవ్వా! అవ్వా! గా తెల్ల సొక్కాయన ఎందుకు శేతులు జోడిచ్చి శనార్తులు జెప్తుండు?"
ఎవ్వలైన సుత కన్ను మిన్ను గానక అతి జేత్తె గిట్లనే వుంటది గాయనకున్న డబ్బు బలంతో ఏదైన శేయొచ్చు.ఏమైన అనొచ్చు అన్కుండు గని, తలంత బల్గము ఊల్లె మంచితనం బలమున్న మల్లమ్మోల్లని ఏం జెయ్యలేక పోయిండు.తప్పొప్పుకుని గట్ల శెనార్తులు శెబుతుండు!
అవునవ్వా! మడిషికి గరువం అస్సలుండొద్దని బల్లె మా సార్లు శెప్పిండ్రు. గాయన శిన్నప్పుడు ఇండ్లేదట్టుంది.గందుకే గింత దనుక దెచ్చుకుండు"
గీ మాటలు ఇన్న అవ్వ సుట్టుపక్కలోల్లు "బాల వాక్కు బెమ్మ వాక్కంటే గిదే".నిజం జెప్పినవ్ బిడ్డా " అన్నరు.
గదండీ సంగతి" అర్థ బలం కంటే అంగబలం ఎక్కువ " అంటే గిదే మరి. గిస్మంటప్పుడు గా బలం యిలువ బయటపడ్తది.

కామెంట్‌లు