వివేకానంద కవితలతో ఘనంగా కొరవే పదో సభ

 స్వామి వివేకానంద సేవలు దేశాభ్యుదయానికి ఎంతగానో దోహదపడ్డాయని కొత్తూరు రచయితల వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన కొత్తూరు రచయితల వేదిక పదో నెల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి పారాపురం పంచాయతీ సర్పంచ్ కుంచాల రత్నాలమ్మ మాట్లాడుతూ వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవంగా 
పరిగణించుకోవడం మిక్కిలి సంతోషకరమని అన్నారు. యువతకు స్పూర్తి ప్రదాతయై, దేశ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేసిన ఘనులు స్వామి వివేకానంద అని ఆమె అన్నారు. గౌరవ అతిథి పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ లోతుగడ్డ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ నవయువతకు దేశభక్తి, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, చదువుతో పాటు సంస్కారం, సామాజిక స్పృహ ఆవశ్యకమని వివేకానంద ఆదర్శాలు చాటిచెప్పాయని అన్నారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి కొరవే సభ్యులు కలమట శ్రీరాములు పూలమాలాలంకరణ గావించగా, పాఠశాల కరస్పాండెంట్ సాసుపల్లి కాశీబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన గావించారు. కొరవే ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగ పాఠాన్ని, సహ కార్యదర్శి గడసాపు ఉషారాణి వివేకానంద సూక్తులను పఠించి సభాసదుల ప్రశంసలు పొందారు. కొరవే కోశాధికారి వైశ్యరాజు హరనాథరాజు సమన్వయంతో కవిసమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో కొరవే అధ్యక్షులు కలమట శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి, సహ కార్యదర్శి గడసాపు ఉషారాణి, కోశాధికారి వైశ్యరాజు హరనాథరాజు, కార్యవర్గ సభ్యులు  గేదెల మన్మధరావు, గుత్తావిల్లి శ్రీనివాసరావు, పెరిశెట్టి రామచంద్రరావు, బాణాన రమణమూర్తి, గజివిల్లి మోహనరావులు స్వామి వివేకానంద, యువజనోత్సవ సంబంధిత కవితలు వినిపించారు. గత వారం గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై కవితలు వినిపించి సన్మానం పొందిన గేదెల మన్మధరావు, గుత్తావిల్లి శ్రీనివాసరావు లను వేదిక ప్రత్యేక అభినందనలు తెల్పింది. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు