వన పర్వము చతుర్థాశ్వాసము
పూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో...!
*109 వ రోజు
కల్కి అవతారము
ఇలా కలియుగం ఆఖరి దశకు చేరగానే శంబళ గ్రామంలో కల్కి అవతరిస్తాడు. అతని పేరు విష్ణుయశుడు. అతనికి సంస్మరణ చేతనే సకల వేదాలు, శాస్త్రాలు అవగతమౌతాయి. అతను సార్వభౌముడౌతాడు. అతడు అధర్మవర్తనులను సంహరించి ధర్మం నిలబెడతాడు. ఆ పై అశ్వమేధయాగం చేస్తాడు. అతను నిలిపిన ధర్మం అనుసరించి బ్రాహ్మణులు తమ ధర్మం నిర్వర్తిస్తారు. కృతయుగం ఆరంభమౌతుంది. ధర్మం నాలుగు పాదాల విలసిల్లుతుంది. దేవాలయాలు ఆశ్రమాలు పూర్వవైభవం సంతరించుకుంటాయి. సకాలంలో వానలు కురుస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రజల ఆయుష్షు వృద్ధి చెందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తిరిగి కాలచక్రం మొదలౌతుంది. " కనుక ధర్మనందనా ! నీవు బ్రాహ్మణులను అవమానించకు వారికి ఇష్టం వచ్చినవి చేయుము. సమస్త భూతముల యందు దయకలిగి ఉండు. ప్రజలను కన్నబిడ్డలవలె పాలించు. పాపాత్ములను శిక్షించు. అజ్ఞానం ప్రబలకుండా చూడు. అహంకారం వదిలి పెట్టు. ఎల్లప్పుడూ సత్యమే చెప్పు. నీవు భరతవంశ సంజాతుడవు నీకు అన్నీ తెలుసు. ప్రాజ్ఞుడవు నీకు చెప్పవలసిన పని లేదు " అన్నాడు. ధర్మరాజు " మహాత్మా! మీరు ఆనతిచ్చిన ప్రకారం నేను లోభం, మత్సరం లేకుండా ప్రవర్తిస్తాను. ధర్మం ఆచరిస్తాను " అన్నాడు.
పరీక్షిత్తు వృత్తాంతము
ధర్మరాజు " మహర్షీ ! బ్రాహ్మణ ప్రభావం గురించి వివరించండి " అని అడిగాడు. మార్కండేయుడు " పూర్వకాలంలో పరీక్షిత్తు అనే రాజు అయోధ్యను పాలిస్తుండేవాడు. ఆ రాజు అడవిలో వేటాడుతూ ఒక సుందరిని చూసి మోహించి " ఓ సుందరీ ! నీ వెవరు? ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? " అని అడిగాడు. అందుకు ఆ యువతి " నేను అవివాహితను. తగిన వరుని కోసం వెతుకుతున్నాను " అన్నది. అందుకు ఆ రాజు తనను వివాహమాడమని కోరాడు. అందుకు ఆమె అంగీకరించింది. కాని తనను జలవిహారానికి ఎప్పుడూ తీసుకు వెళ్ళకూడదని కోరింది. అందుకు అంగీకరించి ఆమెను వివాహమాడి రాజధానికి తీసుకు వెళ్ళాడు. ఒకరోజు వారు ఉద్యానవనంలో విహరిస్తున్న సమయంలో రాజు కొలనులో స్నానం చేస్తూ ఆమెను కూడా పిలిచాడు. ఆమె అలాగే కొలనులో దిగి అదృశ్యం అయింది. వెంటనే రాజు భటులను పిలిచి ఆ కొలనులోని నీటిని బయటకు పోయించాడు. కొలను అడుగున అసంఖ్యాకంగా కప్పలు ఉన్నాయి. ఆ కప్పలే తన భార్యను మాయం చేసి ఉంటాయని భావించాడు. వెంటనే లోకంలోని కప్పలన్నిటినీ నాశనం చెయ్యమని ఆజ్ఞాపించాడు. సేవకులు రాజు చెప్పినట్లే కప్పలను వెతి వెతికి చంపడం మొదలు పెట్టారు. కప్పల నాయకుడు ఒక మహర్షి రూపంలో రాజు వద్దకు వచ్చి కప్పలను చంపవద్దని అర్ధించాడు. అందుకు రాజు " అవి నా ప్రేయసిని మింగేసాయి అందుకే చంపుతున్నాను " అన్నాడు. కప్పల నాయకుడు " మహారాజా! నేను కప్పల దొరను. ఆమె నా కూతురు. ఆమె నీ లాగే చాలా మందిని మోసం చేసింది " అన్నాడు. పరీక్షిత్తు " ఐతే ఆమెను తెచ్చి నాకు అప్పగించు " అని రాజు చెప్పాడు. ఆ కప్పలదొర తన కూతురును అక్కడకు పిలిపించి ఆమెతో కప్పల నాయకుకుడు " ఎంతో మంది రాజులను మోసగించావు కనుక నీకు పుట్టే బిడ్డలు దుర్మార్గులు, మోసగాళ్ళు ఔతారు " అని శపించాడు. తరువాత వారికి శలుడు, నలుడు, వలుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు. తరువాత ఆ రాజు శలునికి రాజ్యం అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి