సంపూర్ణ మహాభారతము*సరళ వ్యావహారిక భాషలో...!

 వన పర్వము తృతీయాశ్వాసము-96 వ రోజు
యువక్రీతుడు వధింపబడుట*
ఒకరోజు యువక్రీతుడు తన తండ్రి మిత్రుడైన రైభ్యుని చూడటానికి వెళ్ళాడు. అక్కడ రైభ్యుని పెద్ద కుమారుడైన పరావసు భార్య అయిన కృష్ణ అనే సుందరిని చూసాడు. ఆమెను మోహించి తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ఆముని శాపానికి భయపడి ఏదో సాకు చెప్పి తప్పించుకుని పోయింది. ఆమె ఆ విషయం తన మామగారికి చెప్పి కన్నీరు పెట్టింది. రైభ్యుడు ఆగ్రహించి తన జటాజూటం తీసి అగ్నిలో వేసి ఒక రాక్షసుని సృష్టించాడు. మరొక జటను లాగి అగ్నిలో వేసి కృష్ణ లాంటి కన్యను సృష్టించాడు. వారిరువురిని చూసి " మీరు యువక్రీతుని వధించండి " అని పంపాడు. ముందు ఆయువతి అందంతో యువక్రీతుని మైమరపించి కమండలం సంగ్రహించింది. కమండలం పోగానే యువక్రీతుడు అపవిత్రుడు అయ్యాడు. వెంటనే రాక్షసుడు యువక్రీతుని వధించాడు. ఆ తరువాత రైభ్యుడు ఆ యువతిని రాక్షసునికి ఇచ్చి వివాహం చేసాడు. ఆశ్రమానికి వచ్చిన భరద్వాజుడు కుమారుని మరణ వార్త విని పుత్ర శోకం భరించ లేకగ్ని ప్రవేశం చేసి మరణించాడు.
పరావసు తండ్రిని చంపుట
తరువాత కొన్నాళ్ళకు బృహద్యుముడు అనే రాజు సత్రయాగం చేస్తున్నాడు. ఆ యాగానికి పరావసు, అర్ధావసులను ఋత్విక్కులుగా నియమించాడు. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఒక రాత్రి పరావసు ఆశ్రమానికి వచ్చేసమయంలో ఏదో అలికిడి వినిపించింది. పరావసు ఎదో క్రూరమృగం వస్తుంది అనుకుని పొరపాటు ఎదురుగా వస్తున్న రైభ్యుని ఆత్మరక్షణార్ధం చంపాడు. దగ్గరికి వచ్చి చూసి తన తండ్రిని గుర్తించి కుమిలి పోయాడు. అతనికి దహన సంస్కారాలు ముగించాడు. తన అన్న వద్దకు పోయి జరిగినది చెప్పి పరావసు తన అన్నఅర్ధవసుతో " అన్నయ్యా ! నీవు ఒక్కడివి ఆ యాగాన్ని నిర్వహించ లేవు కాని నేను ఒక్కణ్ణి చేయగలను. కనుక నేను ఆయాగాన్ని పూర్తి చేస్తాను. నీవు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్యాపాతకానికి పరిహారం చెయ్యి " అన్నాడు. అలాగే అని అర్ధావసు తమ్ముని బదులు అన్ని ప్రాయశ్చితములు పూర్తి చేసి యాగశాలకు తిరిగి వచ్చాడు. అతనిని చూసి పరావసు బృహద్యుమ్నినితో ఇలా అన్నాడు " మహారాజా! ఇతడు యాగశాలలో ప్రవేశించడానికి అర్హుడు కాదు. పవిత్రమైన యాగక్రతువును విడిచి బ్రహ్మహత్యా ప్రాయశ్చిత కార్యం చేస్తున్నాడు " అన్నాడు. రాజు అనుచరులు అర్ధావసుని యాగశాలలోకి రాకుండా అడ్డుకున్నారు.
అర్ధావసు కోరిక మీద రైభ్యాదులు బ్రతుకుట
అర్ధావసు రాజును చూసి " రాజా బ్రహ్మహత్యా పాతకం చేసినది నేను కాదు. ఈ పరావసు చేసిన బ్రహ్మ హత్యకు నేను ప్రాయశ్చిత కర్మలు చేసి అతడిని బ్రహ్మహత్యా పాతకము నుండి విముక్తుడిని చేసాను " అని సత్యం చెప్పాడు. అందుకు దేవతలు సంతోషించి " అర్ధవసూ! నీ సత్యవ్రతం గొప్పది. నీ తమ్ముడు చేసిన బ్రహ్మహత్యకు నీవు ప్రాయశ్చితం చేసావు. ఏమి వరం కావాలో కోరుకో " అని అడిగారు. అర్ధవసుడు " అయ్యా! నా తండ్రిని, భరద్వాజుని, యువక్రీతున బ్రతికించండి అలాగే నా తమ్మునికి దోషం కూడా పరిహరించండి " అని కోరుకున్నాడు. దేవతలు అందరిని బ్రతికించారు. యువక్రీతుడు దేవతలను చూసి " దేవతలారా! నేను ఎన్నో విద్యలు చదివాను, వ్రతాలు చేసాను కాని రైభ్యునిచే చంపబడ్డాను. కారణం ఏమిటి? " అని అడిగాడు. దేవతలు " యువక్రీతా! గురు ముఖతః నేర్చుకున్న విద్య ఫలిస్తుంది, తపస్సు వలన నేర్చుకున్నవి ఫలించవు కనుక నీ విద్యలు నిర్వీర్యం అయ్యాయి. రైభ్యుని విద్య గురువు నేర్పినది కనుక అతడు నీ కంటే శక్తిమంతుడు అయ్యాడు. అని పలికి స్వర్గానికి వెళ్ళారు.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు