“తాతయ్య చూడు..నేను శ్రీరాముడి లాగా బాణం వేస్తున్నాను” అంటూ గోపాల్ బాణం చెట్టుకి గురి పెట్టాడు.
“తాతయ్య..నేను పరమ శివుడి పినాకాన్ని సంధిస్తున్నాను..చూడు” అంటూ పవన్ ధనుస్సు చేత్తో పట్టుకుని ఉత్సాహంగా ఎటు కొట్టాలా అని నాలుగు వైపులా చూస్తున్నాడు.
“ఈ ధనుర్బాణాలు ఎక్కడివి ” అన్నాడు తాతయ్య కంగారుగా పిల్లలవంక చూస్తూ!
“నిన్న ఆదివారం యాదగిరిగుట్ట వెళ్ళాం తాతయ్యా. అమ్మా..నాన్నలని ధనుర్బాణాలు కొని పెట్టమని ఎప్పటి నించో అడుగుతున్నాం. నిన్న గుడి దగ్గర మా అందరి కోసం 5-6 సెట్లు కొన్నారు” అన్నాడు వాసు ఉత్సాహంగా.
“మిమ్మల్ని కళ్ళల్లో పొడుచుకోకుండా జాగ్రత్తగా ఆడుకోమని కొన్నారు. సరే మీ సరదాను ఎందుకు కాదనాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని, పక్కన వారిని గమనించుకుంటూ ఆడుకోండి. అజాగ్రత్తగా ఉంటే కంట్లో గుచ్చుకుంటాయి” అని “ఓహో..మీలో శ్రీరామ చంద్రుడు, పరశురాముడు, అర్జునుడు కూడా ఉన్నారన్నమాట” అన్నాడు తాతయ్య.
“ఇక ఆట ఆపి వస్తే శ్లోకాలు చెప్పుకుందాం” అని తాతయ్య ఈజీ చెయిర్ లో తయారుగా కూర్చుని కాఫీ తాగటం మొదలు పెట్టారు.
పిల్లలు, ఆటలు ఆపి..కాళ్ళు, చేతులు కడుక్కుని వచ్చి మంచి నీళ్ళు తాగి, చాప పరుచుకుని సిద్ధంగా కూర్చున్నారు.
“మహేష్వాసో మహీ భర్తా శ్రీనివాస స్శతాంగతి:
అనిరుద్ధ స్సురానందో గోవిందో గోవిదాం పతి:”
“ ‘మహా ఇశ్వ’ అంటే..గొప్ప ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు. శ్రీమన్నారాయణుడు తన గొప్ప ‘ఉచ్ఛ్వాసం’ అంటే పదునైన బాణం సంధించటం.. ‘నిశ్వాసం’ అంటే విడిచిపెట్టటం ద్వారా లోకాన్ని కాపాడతాడు. మహా గొప్పదైన ధనుస్సుని ధరించే ఓ శ్రీమన్నారాయణా..నువ్వు ఈ భూమినంతటినీ భరించేవాడా అని పొగుడుతున్నారు” అని తాతయ్య “గొప్ప ధనుస్సుని ఎవరు ధరించారు” అని అడిగారు.
“శ్రీరామచంద్రుడు ‘కోదండం’ అనే గొప్ప ధనుస్సుని ధరిస్తాడు. ఇంకా పరమ శివుడు మేరు పర్వతాన్ని ధనువుగా మార్చి, శ్రీ మహా విష్ణువుని బాణంగా ధరించి త్రిపురాసుర సంహారం చేశాడు. ఆ ధనువునే సీత స్వయంవరం సందర్భంలో శ్రీరామ చంద్రుడు ఎక్కు పెట్టాడు. అంతే కాదు..ధనుస్సు ధరించి లోకాల్లోని క్షత్రియులందరినీ సంహరించిన పరశురాముడి గొప్ప ‘వైష్ణవ’ ధనుస్సుని ఆ శ్రీమచంద్రుడు భంగం చేసి అతని గర్వాన్ని అణిచేశాడు అని నిన్న బామ్మ చెప్పింది..కాబట్టి మహా ధనుస్సుని ధరించి తిరుగులేని రామ బాణంతో అనేక మంది లోక కంటకులైన రాక్షసులని సంహరించాడు” అని మానస చెప్పింది.
“భలే..భలే మీకు శ్లోకాలు బాగా అర్థమవుతున్నాయి. చాలా సంతోషం! ‘మహేష్వాసో’ కి సరైన అర్థం చెప్పావు మానసా!” అని ‘మహీ భర్తా అంటే ఎవరు చెబుతారు” అని అడిగారు తాతయ్య.
“‘మహి’ అంటే భూమి అని బామ్మ చెప్పింది కదూ” అని తన మిత్రుల వైపు చూసి అడిగింది చిన్ని.
“అవును” అని చెబుతూ..ఆ మహి, సముద్రంలో మునిగిపోయినప్పుడు శ్రీమహావిష్ణువు ‘వరాహ’ రూపంతో పైకి లేపి రక్షించాడు. అందుకే ఆయన భూమికి భర్త” అంతేనా తాతయ్య అంది పావని.
“కరెక్ట్! మరి ‘ శ్రీనివాస’ అంటే ఎవరు చెబుతారు” అన్నారు తాతయ్య.
“ ‘శ్రీ’ అంటే లక్ష్మీ దేవి. ఆవిడ శ్రీమన్నారాయణుడి వక్ష స్థలం మీద ఉంటుంది, కాబట్టి ‘శ్రీ’ నివసించే వాడు అని అర్థం. అంతేకాదు ‘శ్రీ’ అన్ని సంపదలు ఆయనలోనే ఉంటాయి, విశ్వం అంతా ఆయనే వ్యాపించి ఉంటాడు అని ఇంతకు ముందు నువ్వు, బామ్మ కూడా చెప్పారు కదా!” అన్నాడు విష్ణు.
“ సతాం గతి:” అంటే..సర్వదా అందరికీ ఆయనే గతి..అంటే చివరికి పొందదగిన వాడు ఆయన మాత్రమే అని అర్థం. “అనిరుద్ధ” అంటే.. ఆయన చేసే విశ్వ నిర్వహణలో ఏ విధమైన ఆటంకాలు లేనివాడు. ఎవరు ఆయనని అడ్డుకోలేరు. ఆ విధంగా ఆయన వేదాలని నమ్ముకుని, ధర్మ బద్దంగా బతుకుతూ, ఆయననే ధ్యానించే సత్పురుషులకి, సాధువులకు “సురానందో”..ఆనందం కలిగిస్తూ వారికి ఆశ్రయమైనవాడు.
“సాధువులు, సత్పురుషులు, ధర్మపరులు, యోగులకే కాకుండా..గోవులు, గోపాలురని కూడా కాపాడి వారికి ఆనందం కలిగించిన “గోవిందుడు”. గోకులంలో ఇంద్రుడు ఏడు రోజులు కుంభ వృష్టి కురిపించినప్పుడు పర్వతాన్ని తన చేతితో ఎత్తిపట్టుకుని గోవులని, గోపాలకులని, మొత్తం రేపల్లె వారసులని కాపాడాడు. అప్పుడు ఇంద్రుడు కృష్ణుడితో ‘నేను స్వర్గంలో దేవతలకి అధిపతిని అయితే, నువ్వు భూలోకంలో గోవులకి, గోపాలురకి అధిపతివి. నిన్ను ఇక నించి అందరు గోవిందా అని సంబోధిస్తారు’ అని చెప్పాడు. అలా శ్రీమన్నారాయణుడు గోవిందుడు అయ్యాడు.”
“అంతే కాదు..సంస్కృతంలో ‘గో’ అంటే వాక్కు, మాట అనే అర్థం కూడా ఉంది. మనం మాట్లాడగలగడానికి, మాటకి ఆధారం ఆయనే! అందుకే ఆయనని ‘గోపతి’ అంటారు. ఈ పూటకి చాలా” అన్నారు తాతయ్య.
“చాలు తాతయ్య..కాసేపు బాణాలతో ఆడుకుని వెళ్లి హోమ్ వర్క్ చేసుకుంటాం” అని పిల్లలు చాప చుట్టి పక్కన పెట్టి వెళ్లిపోయారు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి