“మరీచిర్దమనో హంస: సుపర్ణో భుజగోత్తమ:
హిరణ్య నాభ: సుతపా: పద్మనాభ: ప్రజాపతి:
“బామ్మా..విష్ణు ఎలా ఎగురుతున్నాడో చూడు” అని గట్టిగా కేకేసింది పావని.
“ఏమిట్రా మీ అల్లరి? పడితే మూతి పళ్లు రాలతాయి. కాసేపు ఆడుకోమంటే ఇలానా” అంటూ పెరట్లోకి వచ్చింది బామ్మ.
విష్ణు..ఒక తువ్వాలు రెండు భుజాల మీద నించి వెనుకకి వేలాడేలాగా వేసుకుని, చేతులు రెండుచాపి “నేను గరుత్మంతుడిని, చూడండి ఇవి నా రెక్కలు” అంటూ గాలిలో చేతులు రెక్కల్లాగా ఆడిస్తూ ఎగురుతున్నాడు.
“మిమ్మల్ని శ్లోకాలు నేర్చుకోమంటే ప్రత్యక్ష రామాయణం నాకే చూపిస్తున్నారా” అంది బామ్మ నవ్వుతూ!
“ఊ:( సరే రండి. విష్ణూ ఆ తువ్వాలు పక్కన పడేసి వచ్చి కూర్చో” అంది.
“ఈ రోజు శ్లోకం..’మరీచిర్దమనో హంస: సుపర్ణో భుజగోత్తమ:’ అంటే..
“ ‘మరీచి’ అనే ఆయన సప్తర్షులలో ఒక మహర్షి. ఆయన బ్రహ్మ గారి మనసులో నించి వచ్చిన ఒక కాంతి కిరణం. అంతే కాదు..సూర్య, చంద్ర కిరణాలని కూడా ‘మరీచి’ అంటారు. లోకంలో ఉండే చెడుని నశింప చేసే ఆ పరమాత్మ తేజస్సే ‘మరీచి’.”
“అంటే.. ధర్మం తప్పి ప్రవర్తించే అసుర ప్రవృత్తి కల మనుషులని ఒక కట్టుబాటులో ఉంచేది, దండించేది ఆ పరమాత్మ తేజస్సు! సూర్య చంద్రులు మరియు ఇతర గ్రహాలు, అష్ట దిక్పాలకులైన యముడు ఇంద్రుడు తమ తమ కర్తవ్య నిర్వహణ లో తప్పులు చెయ్యకుండా దండించేది కూడా ఆ దేవ దేవుడే! అదే “మరీచిర్దమన:” అంటే”
“హంస:” అంటే..అన్ని జీవుల శరీరాల్లోను తేజో రూపంగా ఉండే ఆ పరమాత్మ చైతన్యం. అంతేకాదు..అలా తమలోని చైతన్యం పరమాత్మ స్వరూపమే అని భావించేవారిని తనకి దగ్గర చేసుకుని వారికి జీవితంలో భయం లేకుండా చేస్తాడు. ఆ చైతన్యం ఉన్నంత సేపే జీవి చలనం కలిగి ఉంటుంది. అందుకే ఒక జీవిలో ప్రాణం పోయిన వెంటనే ‘హంస’ లేచిపోయింది అంటారు.”
“సుపర్ణో”..అంటే మంచి రెక్కలు కలవాడు అని అర్థం. పక్షికి పైకి వేగంగా ఎగరటానికి బలమైన రెక్కలు కావాలి. అలా బలమైన రెక్కలు ఉండి..బాగా ఎగిరే పక్షి ఏది” అనడిగింది బామ్మ.
“గరుత్మంతుడు” అన్నాడు విష్ణు.
“అందుకేనా ఇందాక అలా ఎగురుతున్నావ్? ఇంకా నయం పడి కాళ్ళు-చేతులు విరక్కొట్టుకోలేదు. మనం మనుషులం..పక్షులం కాదు. అన్ని జీవుల్లో ఉండే చైతన్యం ఆ భగవానుడిదే అయినా..మనుషులు, పక్షులు, జంతువులు వేరు వేరు. కదలటానికి, నడవటానికి ఒక్కోదానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. మనం మనుషులం..రెండు కాళ్లతో నడుస్తాం. జంతువులు నాలుగు కాళ్లతో నడుస్తాయి. పక్షి నేల మీద కాళ్లతో నడిచి, గాలిలో తన బలమైన రెక్కలతో ఎగురుతుంది. అవునా” అంది బామ్మ.
“శ్రీకృష్ణుడు భగవద్గీతలో పక్షుల్లో గొప్పది, శ్రేష్ఠమైనది అయిన గరుత్మంతుడిని నేనే అని చెప్పాడు. అంత శ్రేష్ఠమైనది కనుకనే ఆ పక్షి, విష్ణు మూర్తికి వాహనం అయింది.”
“ఎవరికైనా కష్టం వస్తే ఆయన వెంటనే వెళ్లి వారిని కాపాడాలంటే ఆయన వెళ్లే వాహనం వేగంగా వెళ్లాలి కదా బామ్మా..అందుకే ఆయన గరుత్మంతుడి మీద ప్రయాణిస్తాడు” అంది చిన్ని.
“అవును చిన్నీ..నువ్వు నేర్చుకున్నది సందర్భం వచ్చినప్పుడు సరిగ్గా కలుపుకుని చెప్పటం తెలిసింది” అని ప్రశంసించింది బామ్మ.
“అందుకే కదా బామ్మా..అన్ని విష్ణుమూర్తి ఆలయాల్లో గరుత్మంతుడి విగ్రహం ఆయన్ని తీసుకు వెళ్ళటానికి సిద్ధంగా ఆ స్వామి ఎదురుగా ఉంటుంది” అన్నాడు గోపాల్..బామ్మ ప్రశంస కోసం ఎదురు చూస్తూ!
“అవునురా..మీరు శ్లోకాలు నేర్చుకోవడంతో పాటు, అవి ఎక్కడ కలుపుకుని అర్థం చేసుకోవాలో ఉదాహరణలతో కూడా బాగా తెలుస్తున్నది. సరే ఇప్పుడు “భుజగోత్తమ:” అంటే..పాములలో ఉత్తమమైనవి అని అర్థం. మళ్లీ భగవద్గీతలోని శ్లోకం ప్రకారం పాములలో శ్రేష్ఠమైన, ఉత్తమమైన
ఆదిశేషుడు, వాసుకి కూడా ఆయనే! అంటే..విశ్వం అంతా పరమాత్మ స్వరూపమే అయినప్పటికీ..అందులో కూడా అన్నిటికంటే ఉత్తమమైన జీవులు స్వయంగా ఆయనే అయి ఉంటాడు.”
“అందుకే కదా బామ్మా..నాగుల చవితి, నాగ పంచమి రోజుల్లో పాము పుట్ట దగ్గర పూజ చేసి మా అమ్మ పుట్టలో పాలు పోస్తుంది” అన్నది పావని.
“అవును..ఇప్పుడు “హిరణ్యనాభ:” అంటే తెలుసుకుందాం.’నాభి’ అంటే బొడ్డు. ‘హిరణ్య’ అంటే బంగారం లాంటి శ్రేష్ఠమైన బొడ్డు కలవాడు.
“సుతపా:” అంటే..ఆయన ఏకాగ్రతతో తపస్సు చేసేవారికి దర్శనం ఇస్తాడు..ఉదాహరణకి ధృవుడు..అని చెప్పుకున్నాం కదా! అలా తపస్సు చేసేవారికి దర్శనం ఇవ్వటమే కాదు, ఆయన స్వయంగా తపస్సు చేస్తాడు కూడా! ఉదాహరణకి బదరికాశ్రమంలో ఆయన నర, నారాయణులుగా ఇద్దరి రూపాలతో తపస్సు చేశాడు. ఆ తరువాత ఆ ఇద్దరే కృష్ణ, అర్జునులుగా జన్మించారు.”
“మీకు ఇంతకు ముందు ‘పద్మ నాభ’ అంటేచెప్పాను..గుర్తుందా? సరే మళ్లీ గుర్తు చేస్తాను..పద్మాన్ని తన బొడ్డులో కలిగి ఉన్నవాడు. పద్మం మధ్య భాగంలో అనేక విత్తనాలు ఉంటాయి. విత్తనాలు అంటే మొక్కలు మొలవటానికి ఆధారం కదా! ఆ మధ్య భాగాన్ని ‘బొడ్డు’ అంటారు. అందుకే పరమాత్మ గురించి చెప్పేటప్పుడు..పద్మం, దాని మధ్య భాగమైన బొడ్డు గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. “ఇక్కడ ‘బొడ్డు’ అనే పదానికి ప్రాధాన్యత ఏమిటంటే..ఒక జీవి నించి పుట్టే ఇంకొక జీవికి..గర్భంలో నించి భూమి మీదికి వచ్చే వరకు ఆహారం ఆ ‘బొడ్డు’ ద్వారానే వెళ్లి, ఆ జీవి పూర్తిగా ఎదిగి, సరైన సమయం వచ్చినప్పుడు పుట్టి భూమి మీదికి వస్తుంది. అలా ఒక జీవికి మరొక జీవికి మధ్యలో ఉండే లంకె ‘బొడ్డు’ అన్నమాట.”
“మరి మనందరికీ ఆధారం ఆ పరమాత్మే అయినప్పుడు..ఆయన నాభి అంత ముఖ్యమైనది అన్నమాట. అలా పరమాత్మ నాభిలో జన్మించిన బ్రహ్మ దేవుడు, ఆ పరమాత్మ ఆదేశం ప్రకారం ప్రజాపతులని, మరుత్తులను, వసువులని పుట్టించాడు. కాబట్టి ఆయన ‘ప్రజాపతి:’ మనందరం ఆ బ్రహ్మ గారు సృష్టించటం వల్లనే ఈ భూమి మీద పుట్టాం. అర్థమయిందా? సరే వెళ్లి రేపు రండి. ఆటల్లో జాగ్రత్త. శ్లోకాలలో చెప్పినవన్నీ ప్రయోగాలు చేసి చూడద్దు.” అని బామ్మ పిల్లలని పంపించేసింది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి