“గురుర్గురు తమో ధామ సత్యస్సత్య పరాక్రమ:
నిమిషో ఽ నిమిష: స్రగ్వీ వాచస్పతి రుదారథీ:”
“బామ్మా ఆ శ్రీమహావిష్ణువు నీకు, మాకు మనకందరికీ గురువు కదా!”అన్నాడు పవన్.
“అబ్బో..అలా ఎందుకనిపించింది” అన్నది బామ్మ ప్రశంసాపూర్వకంగా పవన్ వైపు చూస్తూ!
“గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: అని ప్రతి రోజూ ప్రార్థన చేస్తాం కదా! అందుకే అలా అన్నాను.
“అవును బాగా చెప్పావు. కానీ ఆ మాటలకి అర్థం అది కాదు. మనకి జ్ఞానం నేర్పే గురువు ఎవరో ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే త్రిమూర్తి రూపం అని అర్థం. గురువులు ఏడు రకాలు. సూచక గురువు.. అంటే మనకి మామూలు ‘విద్య’ నేర్పే వారు. వాచక గురువు..అంటే మనకి ‘ధర్మాధర్మాలని’ నేర్పేవారు. బోధక గురువు..అంటే ‘మంత్రం’ నేర్పేవారు. నిషిద్ధ గురువు..అంటే ‘తంత్ర, వశీకరణ విద్య’ నేర్పేవారు. విహిత గురువు..అంటే ‘వైరాగ్యం’ బోధించేవారు. ఇంకా కారణ గురువు మరియు పరమ గురువు. చివరి ఇద్దరు గురువులు మనిషికి మోక్ష మార్గాన్ని నేర్పేవారు. వారు అందరికంటే పై స్థాయిలో ఉంటారు” అంటూ..
”మీరు కష్ట తరం, కష్ట తమం అనే మాటలు విన్నారా?” అంది బామ్మ.
“విన్నాం. కానీ ఆ రెండింటికి తేడా తెలియదు” అన్నారు పిల్లలు.
“మాములుగా ఏ పని అయినా చెయ్యటం సులువు, తేలిక కాకపోతే ‘అబ్బో చాలా కష్టం’ అంటారు. కొంత కృషితో ఆ పని చెయ్యగలిగితే ‘కష్టతరం’ అంటారు. అసలు చెయ్యటం అసాధ్యం అయితే ‘కష్ట తమం’ అంటారు. ‘తమం’ అనే పదం..అన్నిటి కంటే పై స్థాయి అని చెప్పాలంటే వాడతాం. అలా మనం ఇప్పటివరకు నేర్చుకున్న శ్లోకాల సారాంశం ప్రకారం..’గురుతమో’అంటే అందరికంటే ఉత్తమోత్తమమైన గురువు ఆ శ్రీమహావిష్ణువే! అందుకే ఆయన పరమ గురువు.”
“మీరూ రోజు చూసే వారిలో పరమ గురువు ఎవరు అంటే ఏం చెబుతారు?” అని అడిగింది బామ్మ. “అమ్మ” అన్నారు అందరూ ముక్త కంఠంతో! “సరిగ్గా చెప్పారు. మీరు బయట ఎక్కడ కొత్త విషయం విన్నా, చూసినా వెంటనే ఇంటికి వచ్చి..అమ్మా ఇది నిజమేనా, ఇది కరెక్టేనా అని అడుగుతారు. ఆమె ‘అవును’ చెప్పాకనే మీ మనసు కుదుటపడుతుంది అవునా? అందుకే కొందరు పెద్దలు ‘అమ్మ’ ని దేవతా స్వరూపమని, ఆ దేవుడు అన్ని చోట్ల మానవ రూపంగా ఉండలేక ‘అమ్మ’ ని పంపించాడు అని అంటారు” అంది బామ్మ.
“సరే మళ్లీ మన శ్లోకాల్లోకి వెళదాం. మనం మాములుగా చదువుకున్న కథల్లో విషయాలని బట్టి మనకి వేదాలు ఇచ్చినది బ్రహ్మ దేవుడు కాబట్టి, బ్రహ్మ తొలి గురువు అనుకుంటాము. కానీ ఆయనకి వేదాలు ఇచ్చి, తరువాత ఏం చెయ్యాలి అనే జ్ఞానం నేర్పింది శ్రీమహావిష్ణువు.”
“ఎలాగంటే..శ్రీమన్నారాయణుడి నాభి కమలంలో కూర్చున్న బ్రహ్మ, తన చుట్టూ ఉన్న నీటిని చూసి నేను ఎవరు? ఎక్కడ ఉన్నాను అని నాలుగు దిక్కులా చూశాడుట. అప్పుడు ఒక శబ్దం వినిపిస్తే..దాన్ని వెతుక్కుంటూ ఆ కమలం తొడిమ ద్వారా శ్రీమన్నారాయణుడి లోపలికి వెళితే..అక్కడ ముందు చీకటి, తరువాత గొప్ప వెలుగు కనిపించాయిట. “నువ్వు ఎవరు” అని బ్రహ్మ అడిగితే..”నేను నీకు మూలమైన నీ తండ్రిని. ఇక నించి నువ్వు జీవరాశులని ఉత్పత్తి చెయ్యి” అని వేదాలు బ్రహ్మ దేవుడి చేతికి ఇచ్చాడు. అందుకే శ్రీమహావిష్ణువు “గుర్గురు తమ”! అందరి కంటే పైస్థాయి వాడు అన్నమాట.”
“అంతేకాదు..సృష్టి ప్రారంభానికి ముందు వచ్చిన జలప్రళయానికి ముందు ‘సత్యవంతుడు’ అనే రాజుకి నదిలో అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆయన చేతిలోకి ఒక చేప వస్తుంది. ఆయన దాన్ని నదిలో వదిలేస్తే..మళ్లీ ఆ చేప రాజు చేతిలోకి వచ్చి నన్ను నీ దగ్గర ఉంచుకో అని చెబుతుంది. రాజు దాన్ని కమండలంలో వేసి ఇంటికి తీసుకు వెళితే ఆ చేప కమండలం పట్టనంత ప్రమాణంలోకి పెరగటమే కాక, ఆ తరువాత ఇంకా ఇంకా పెరిగితే రాజు దాన్ని సముద్రంలోకి వదిలేస్తాడు. అప్పుడు శ్రీమహా విష్ణువు ఆరాజుతో “సృష్టి జరగటానికి కావలసిన బీజాలు నీకు ఇస్తున్నాను. వీటిని రక్షించు. జలప్రళయం వస్తుంది. అప్పుడు ఒక పడవలో సప్త ఋషులు వస్తారు. వారితో పాటు నువ్వు కూడా ఆ పడవ ఎక్కి నిన్ను నువ్వు రక్షించుకో” అని చెబుతాడు. అప్పుడు ఆ జలప్రళయంలో చుట్టూ చీకటి! పడవ అటూ ఇటు ఊగిపోతుంటే శ్రీమహావిష్ణువు మత్స్య రూపంలో వచ్చి ఆ పడవని కాపాడతాడు. ఆ సమయంలో పడవలో ఉన్న ఆ సప్త ఋషులకి, రాజు సత్యవంతుడికి ఆ శ్రీమహావిష్ణువు జ్ఞానాన్ని బోధించాడు. అదే మత్స్య పురాణం. అలా జ్ఞానబోధ చేసిన ఆ శ్రీమన్నారాయణుడు ఉత్తమ గురువు.”
“అలా జలప్రళయంలో కూడా నశించిపోకుండా ఉండే ఆయన శాశ్వతుడు అనేది సత్యం. ఆస్థానంలోకి మరొకరు రారు..రాలేరు” అని బామ్మ చెప్పగానే..
“జీవులు పుడుతూ, చస్తూ ఉన్నా కూడా ఆయన పుట్టే వారిలో మళ్లీ మళ్లీ చైతన్య రూపంగా ఉంటాడు అని చెప్పావు కదా బామ్మా” అన్నాడు విష్ణు.
“అవును..అంటే కాదు ఆయన ‘సత్య పరాక్రముడు’. ఆయనని ఎదిరించి ఓడించే వారు లేరు. ఆ శ్రీమన్నారాయణుడు రామావతారంలో అనేక మంది రాక్షసులతో పాటు అవక్రమ పరాక్రముడైన రావణాసురుడిని, కృష్ణావతారంలో కంసుడిని, నరకాసురుడిని..ఇంకా అనేక మంది రాక్షసులను అవలీలగా సంహరించిన గొప్ప పరాక్రమవంతుడు.”
“ నిమిషో ఽ నిమిష:” అంటే శ్రీమహావిష్ణువు తన కంటి రెప్పలు మూయడం (నిమిషో) తెరవటం (అనిమిష) అనే చర్య ద్వారా లోకాన్ని సృష్టించి, లయం చేస్తున్నాడు. ఇందాక చెప్పుకున్న మత్స్యావతార కథ ద్వారా మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవచ్చు. ‘చేప’ అనే జీవి అసలు రెప్ప వేయదు..కళ్లు మూయదు. అంతే కాదు చేప తన చూపు ద్వారానే తన పిల్లలకి ఆహారం అందించి పోషిస్తుంది. అందుకే లోకాన్ని సృష్టించి, పోషించి, లయం చేసే ఆ శ్రీమన్నారాయణుడిని ‘మత్స్య అవతార’ రూపంలో “నిమిషో ఽ నిమిష:” అనే విశేష గుణంతో పొగుడుతారు.
“స్రగ్వీ” అంటే..మాల, దండ ధరించిన వాడు అని అర్థం. కళ్ళు మూయడం, తెరవటం అనేది కాలాన్ని చెబుతుంది. అలా కాలం గురించి చెబితే..మళ్లీ క్షణం, నిముషం, గంట, పగలు, రాత్రి, సంధ్యా కాలం..ఇలా ఒక మాలగా అనుకుంటే ఆ కాలం అనే మాల ధరించినవాడు శ్రీమహావిష్ణువు. ఇంకా అనేక రకాల జీవరాశులనే పువ్వులని సృష్టించి మాలగా చేసి ఆ మాలకి ఆధారమైన దారంగా వారిలో చైతన్య రూపంలో ఉన్నవాడు ఆ శ్రీమహావిష్ణువు. అందుకే ఆయనని ‘స్రగ్వీ’ అంటారు.
“వాచస్పతి రుదారథీ:” అంటే మన వాక్కులకి ప్రభువైనవాడు. ఇందాక మత్స్య రూపంలో జ్ఞాన బోధ చేశాడు అని చెప్పాను కదా..అలా వాక్కులకి అధిపతి అయి ఉండి కూడా ఉదారంగా అందరికీ వేదాలని అందించి జ్ఞాన బోధ చేసేవాడు. అది ఆయన ఉదార బుద్ధి.. ఆయన దయ, కరుణ అన్నమాట. సరే ఈ పూటకి చాలు. మిగిలినవి రేపు చెప్పుకుందాం” అని బామ్మ ముగించింది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి