“అహ: సంవర్తకో వహ్ని రనిలో ధరణీ ధర:
సుప్రసాద: ప్రసన్నాత్మా విశ్వదృగ్విశ్వభుగ్విభు:”
“ఇంతకు ముందు ‘అహసంవత్సరో వ్యాళ:” అనే శ్లోకం చెప్పుకున్నప్పుడు “అహ:” అంటే పగలు. పగలు, రాత్రి అనే కాలాన్ని కలిగించేవాడు, పాము లాగా జారిపోతూ చేతికి చిక్కనివాడు అని చెప్పాను గుర్తుందా? పగటి కాలం అంటే ఏమిటి” అంది బామ్మ.
“పగలు అంటే ‘వెలుతురు’” అన్నాడు హరి.
“అంటే..అజ్ఞానం ‘చీకటి’. పగలు, వెలుతురు అంటే‘జ్ఞానం’. దీపం వెలిగించగానే చీకటి దూరం అవుతుంది. అలాగే ‘జ్ఞానం’ అనే వెలుతురు రాగానే ‘అజ్ఞానం’ అనే చీకటి పోతుంది. అలాంటి పగటిని కలిగించే దైవం ఆ శ్రీమహావిష్ణువు. పగటిని కలిగించటమే కాక, ఆ పగటి నిడివి ఏ ఋతువులో ఎంత ఉండాలో, ఎప్పుడు సాయంత్రం అవ్వాలో, ఎప్పడు రాత్రి అవ్వాలో ఆయనే నిర్ణయిస్తాడు” అని బామ్మ చెప్పగానే..
“అవును బామ్మా..చలి కాలం పగలు తక్కువ టైమ్ ఉండి, రాత్రి ఎక్కువ సేపు ఉంటుంది. అందుకే చలికాలం ఎక్కువ సేపు నిద్రపోతాం” అన్నాడు విష్ణు.
“ఆ:( ఇప్పుడు నేను చెబుతా” అంటూ “వేసవి కాలం పగలు ఎక్కువ టైమ్, రాత్రి తక్కువ టైమ్ ఉంటుంది. ఉదయం 5 గం.లకే తెల్లారిపోతుంది. అమ్మ తొందరగా నిద్ర లేపేస్తుంది” అన్నాడు గోపాల్ ఏడుపు మొహం పెట్టి.
“అలా పగటి కాలాన్ని నిర్ణయించేవాడు కాబట్టి “అహసంవర్తక:” అంటారు.
“‘అహ్ని”: అంటే..అగ్ని. ‘వహ్ని’ అంటే‘మోసుకెళ్లే ‘అగ్ని’ అని అర్థం. పంచ భూతాల్లో అగ్ని కూడా ఒకటి. అవునా? ఆ శ్రీమన్నారాయణుడు యజ్ఞ స్వరూపుడు అని కూడా చెప్పుకున్నాం కదా! యజ్ఞం లో ఏం చేస్తారు? అగ్నిని రగిల్చి, అందులో దేవతలకి ఆహారంగా హవిస్సులు వేస్తారు. ఏ దేవతలని ఉద్దేశించి యజ్ఞం చేస్తున్నారో.. అగ్ని దేవుడు ఆ హవిస్సులని తీసుకెళ్లి ఆయా దేవతలకి అందిస్తాడు. అలా హవిస్సులని మోసుకెళ్లే అగ్ని స్వరూపం కాబట్టి ఆయనని “వహ్ని” అంటారు. ‘అనిలో’ అంటే మొదలు లేనివాడు, నివాస స్థానము లేనివాడు, నిలకడ లేనివాడు..అన్ని చోట్లా వ్యాపించి ఉండి మన కంటికి కనిపించని వాడు. పంచభూతాల్లోని వాయువు విశ్వం అంతా వ్యాపించి, జీవుల ప్రాణాలకి ఆధారమైన వాడు. ఆయన మనకి కనిపించడు, చేతికి దొరకడు.”
“అలా వాయువుగా, సూర్య రశ్మిగా విశ్వం అంతటా వ్యాపించి జీవాధారం అవుతున్నాడు. యజ్ఞంలో “వహ్ని” రూపంగా హవిస్సులు మోసుకెళుతూ, లయకారకమగు “సంవర్తక” అగ్నిగా కూడా ఉంటాడు. “ధరణీధర:” అంటే భూమిని ధరించేవాడు, వహించేవాడు.”
“బామ్మా..భూమి, వాయువు, అగ్ని అనేవి పంచభూతాల్లో భాగం కదా!” అన్నది పావని.
“అవును. “సుప్రసాద:” అంటే..ఆ దేవ దేవుడు తరతమ భేదాలు లేక అందరికీ తన కరుణ, పోషణ అనే ప్రసాదాలని అందించేవాడు. ఉదాహరణకి శిశుపాలుడు, కంసుడు లాంటి అపకారం చేసే రాక్షసులకి కూడా మోక్షాన్ని ప్రసాదించిన దయామయుడు.”
“ఆయన దుష్టులని శిక్షించడం, మంచివారిని రక్షించడం అనే కర్తవ్యం అనుక్షణం చేస్తూనే ఉన్నా..ఆ మాలిన్యం ఆయనకి అంటదు అని చెప్పుకున్నాం కదా! ఆయనని అందుకే ఏ దోషాలు అంటని ‘ప్రసన్నాత్మా’ అనచ్చు.
“విశ్వ దృక్” అంటే విశ్వాన్ని ధరిస్తాడు, దర్శిస్తాడు. “విశ్వ భుక్” అంటే..లయ కారకుడిగా విశ్వం మొత్తాన్ని భుజిస్తాడు..అంటే తనలో లీనం చేసుకుంటాడు! జీవులూ ఆయనే! వారు తినే ఆహారమూ ఆయనే! జీవులలో ఉండే ఆత్మగా జఠరాగ్ని రూపంలో వారిచే ఆహారము స్వీకరించేవాడు, తిన్న ఆహారాన్ని అరిగించేవాడూ కూడా ఆయనే!”
“యజ్ఞ భోక్తగా యజ్ఞంలో ఇచ్చే హవిస్సులని అగ్నిగా మోసుకెళతాడు, దేవత స్వరూపంగా తానే భుజిస్తాడు. హిరణ్య గర్భుడిగా బ్రహ్మ దేవుడిని సృష్టించి, ఆయన ద్వారా అన్ని జీవరాశులని సృష్టించే విభుడు, ప్రభువు ఆయనే!” అని బామ్మ చెప్పగానే..
“ఇన్ని మాటలెందుకు? అన్నీ ఆయనే కదా బామ్మా” అన్నాడు విష్ణు..ఆ రోజు పాఠం ముగిస్తున్నట్లు!
“అవును..కుండా ఆయనే..కుండ తయారు చేసే మట్టీ ఆయనే..అందులో పొసే నీరూ ఆయనే..మనకి వేసే దాహమూ ఆయనే..ఆ నీరు తాగేదీ ఆయనే” అర్థం అయిందా. అలా అని ఆయనే వచ్చి మీ పరీక్షలు రాయడు. అవి మాత్రం బాగా చదివి మీరే రాయాలి. తెలిసిందా” అని నవ్వుతూ పిల్లలని సాగనంపింది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి