“వినరో భాగ్యము విష్ణు కథలు”:(35): - ఎం బిందుమాధవి

 “వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదర:
వర్ధనో వర్ధమానశ్చ వివిక్త: శృతి సాగర:”
“బామ్మా నిన్న నువ్వు మా నాన్న క్రికెట్ బ్యాట్ కొనివ్వటం గురించి చెప్పావు కదా! నిజంగానే మా నాన్న సాయంత్రం ఆఫీసు నించి వస్తూ క్రికెట్ కిట్ తెచ్చారు” అని ఉత్సాహంగా చెప్పాడు రవి.
“మనం ఇవ్వాళ చెప్పుకుంటున్న శ్లోకం దానికి సంబంధించినదే! శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని పూర్తిగా నమ్ముతూ, దాన్ని ఆచరిస్తూ ఆయనని ఉపాసించేవారికి వరాలను వర్షం లాగా కురిపిస్తాడు..రవి వాళ్ల నాన్న లాగా. రవి చక్కగా చదువుకుంటూ క్రమశిక్షణతో నడుచుకుంటున్నాడు కనుకనే , ఆయన వీడి ఇష్టాన్ని కనిపెట్టి, వీడు అడగకుండానే బహుమతిగా క్రికెట్ కిట్ కొనిచ్చారు. అంటే మన ధర్మం మనం చక్కగా నిర్వర్తిస్తే.. భక్తుల విషయంలో ధర్మం అంటే యజ్ఞ యాగాదిక్రతువులు చెయ్యటం, సాటివారిపట్ల, ప్రకృతి పట్ల, నోరు లేని జీవుల పట్ల దయతో ప్రవర్తించటం..ఆ భగవానుడు మనకి ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది మరచిపోకుండా ఇస్తాడు..వరాలుగా వర్షిస్తాడన్నమాట.”
“సరే..మనమెవరమైనా రోజులో పనిని ఏ సమయంలో ప్రారంభిస్తాం?” అన్నది బామ్మ.
“రోజు ప్రారంభమయ్యేది ఉదయంతో కాబట్టి పని ప్రారంభం ఉదయమే చేస్తాం. అంతేకాదు బామ్మా..నిన్న నువ్వు చెప్పావు కదా..పగలు అంటే వెలుతురు, జ్ఞానం అని..కాబట్టి పని ప్రారంభించేది వెలుతురు వచ్చాక”అన్నాడు విష్ణు.
“భేష్, బాగా చెప్పావురా..’వృషాహీ’ అంటే ధర్మకార్యాలు ప్రారంభించే పగటి కాలం ఆ భగవానుడు అయి ఉంటాడు. ఇంకా జీవులకి ధర్మ కార్యాలు చెయ్యాలి అనే బుద్ధిని, జ్ఞానాన్ని ప్రేరేపించే పగటి కాలమే ఆయన. అలా ధర్మ కార్యాలు చేసే తన భక్తులకి వరాలు వర్షం లాగా కురిపిస్తాడు కాబట్టి ఆయన ‘వృషభో’ అన్నమాట. వృషభం అంటే ఎద్దు. ఇంకా యజ్ఞం, రూపం దాల్చిన ధర్మం కూడా. వృషభానికి నాలుగు కాళ్ళు ఉంటాయి. తెలుపు రంగులో ఉంటుంది. అంటే సాత్విక రూపం అన్నమాట. ఎద్దుకి ఉండే నాలుగు కాళ్ళు ఏమిటంటే..సత్యం, శౌచం, దయ, న్యాయం. ఈ నాలుగు లక్షణాలు ఉంటేనే లోకంలో జీవుల మనుగడ ప్రశాంతంగా సాగుతుంది. యజ్ఞ రూపం, ధర్మ రూపం అయిన ఆ శ్రీమన్నారాయణుడు సృష్టి నిర్వహణ సక్రమంగా జరగటం కోసం..మంచివారిని తన వరాలతో కాపాడుతూ, దుష్టులను శిక్షిస్తాడు.”
“ఇంకా..సనాతన ధర్మం ప్రకారం.. వర్షాలు కురవటానికి, దేవతలని సంతోషింప చెయ్యటానికి యజ్ఞం అనేది ఒక సాధనం. పంటలు పండటానికి వర్షాలు కావాలి. వ్యవసాయం చెయ్యటానికి ఎద్దు కావాలి. ఇలా ఒక దానికి ఒకటి ఆధారమైన ఈ మొత్తం నిర్వహణా చక్ర రూపంలో ఉండే ఆ శ్రీమన్నారాయణుడిని ‘వృషభో’ అనే నామంతో పిలుస్తాము”.
“వృషపర్వా” అంటే..కాలంలో వచ్చే మార్పుల సరిహద్దులకి పర్వం అని పేరు. మనం పర్వ దినాలు, పర్వ కాలం అనే మాట ఉంటాం..మీరెప్పుడైనా విన్నారా” అన్నది బామ్మ. “ఆ:( విన్నాం బామ్మా..మా అమ్మ దసరా పండుగ రోజులని పర్వ దినాలు అంటుది.” అన్నది పావని.
“సరే..పర్వ దినాలకు ఉదాహరణ పౌర్ణమి, అమావాస్య. అవి కాలంలో భాగంగా ఉంటూనే, ఒక కణుపు లాగా ఉంటాయి. నెలలో పదిహేను రోజులు పౌర్ణమి వైపు, పదిహేను రోజులు అమావాస్య వైపు కాలం ప్రయాణిస్తూ ఉంటుంది. కానీ ఆ కాలంలో కూడా, పగలు, రాత్రి, సంధ్యాకాలం అనే భాగాలు.. కణుపులుగా ఉంటాయి. కాలం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఉదాహరణకి పౌర్ణమి నించి చంద్రుడి కాంతి తగ్గి, చివరికి పూర్తిగా చీకటి ఏర్పడి అమావాస్యగా మారుతుంది. కణుపు అనేది ఒక హద్దుని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాంటి పర్వ కాలాలకి చేసే యజ్ఞాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ సమయంలో చేసే యజ్ఞాల ఫలితాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ ఫలితాల వివరం తెలియజేసే నామమే ‘వృషపర్వా’ అన్నమాట.
“వృషోదర:” అంటే..ఇలా ఆ దేవ దేవుడు ఇచ్చే వరాల వర్షాలు, వారి వారి కర్మలననుసరించి చేసే జీవ సృష్టి కాబట్టి ఆ జీవుల సృష్టికి అవసరమైన బీజాలు ఆయన ఉదరభాగంలో కనిపిస్తాయి.
“ఆ శ్రీమన్నారాయణుడు జగత్తు, జీవులు పెరగటం ద్వారా తనని తాను వృద్ధి చేసుకుంటాడు. జీవులు చేసే ధర్మాల వల్ల కూడా ఆయన ఉనికి పెరుగుతుంది. అలా జీవుల రూపంలో, ధర్మ రూపంలో వివిధ రూపాలలో పెరుగుతూ ఉన్నప్పటికీ ఆయన ఏ ఒక్క దానితోనూ కలిసి ఉండడు. అంటే తామరాకు మీద నీటి బొట్టు లాగా దేన్నీ తాను అంటించుకోడు..దేనికీ తాను అంటడు కాబట్టి ఆయనని ‘వివిక్త’ అనచ్చు.
“ఆ దేవ దేవుడు వేదాలకి, శాస్త్రాలకి, ధర్మాలకి, జ్ఞానానికి.. అన్ని రత్న రాశులకి ఆయువుపట్టు అయిన సముద్రంలాగా..అవధుల్లేని సాగరం లాంటి వాడు” అని ముగించింది బామ్మ.
“ఇప్పటి వరకు నేర్చుకున్నవి రేపు ఒకసారి మేము నీకు అప్పచెబుతాము. తరువాతి శ్లోకాలు అప్పుడు చెప్పు” అని పిల్లలు ఇళ్ళకి వెళ్లిపోయారు.

కామెంట్‌లు