“ఇష్టో ఽవిశిష్ట శిష్ఠేష్ట: శిఖండీ నహుషో వృష:
క్రోధ: క్రోధ కృత్కర్తా విశ్వబాహు:మహీధర:”
“బామ్మా అమ్మకి తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టం. వాడిని ఎప్పుడు ఎత్తుకుంటుంది. ఆడిస్తుంది. నేను హోమ్ వర్క్ చేయించాలని పిలిచినా రాదు” ఉక్రోషంగా అంటూ తల్లి మీద నేరం చెప్పాడు శైలేష్.
“అమ్మకి అలాంటి తేడాలు ఎప్పుడు ఉండవు. వాడికి ఇంకా నడక, మాటలు రాలేదు కదా! అందుకే వాడు ఏడవగానే, కింద పడ్డాడేమో, చీమ కుట్టిందేమో అని పరుగెట్టుకెళుతుంది. చిన్నప్పుడు నిన్ను కూడా అలాగే ఎత్తుకుంది. కానీ అప్పుడు నీకు తెలియదు కదా! నీకు అక్క ఉండి ఉంటే అది కూడా నీలాగే అమ్మ మీద చాడీలు చెప్పేది. కొంచెం పెద్దయి, అన్ని విషయాలు తెలియటం మొదలయ్యాక అమ్మ మీకిద్దరికీ ఇష్టమే అవుతుంది.”
“అవును బామ్మా..నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. చీకటిలో భయమేస్తే దగ్గరకి తీసుకుని బుజ్జగించి భయం పోగొడుతుంది. నాకు ఇష్టమైన ఆలూ ఫ్రై చేసి పెడుతుంది. పాయసం చేస్తుంది. సాయంత్రం పక్కన కూర్చుని చదివిస్తూ నాకున్న సందేహాలన్నీ తీరుస్తుంది. ఆదివారం పార్కుకి తీసుకెళుతుంది. మాతో ఆడుకుంటుంది. నాకు ఇష్టమైన బ్లూ కలర్ షర్ట్ కొనిపెడుతుంది” అని తల్లి తనకి ఎందుకు ఇష్టమో పెద్ద లిస్ట్ చదివాడు మనోహర్.
“అలాగే ఆ శ్రీమన్నారాయణుడు..మనందరికీ ఇష్టమైన వాడు. ఎందుకో చెప్పండి” అంది బామ్మ.
“మనలో ఉన్న అన్ని ప్రతిభలు ఆయన ఇచ్చినవే! వాడు డ్రాయింగ్ బాగా వేస్తాడు. వీడు ఆటలు బాగా ఆడతాడు. ఇక మానస అక్క అయితే వీణ వాయిస్తుంది. పావని వంట బాగా చేస్తుంది. అవన్నీ ఆ దేవ దేవుడు మన పట్ల చూపించిన కరుణే అని చెప్పావు కదా! జ్వరం వచ్చినప్పుడు మనం వేసుకునే మందులు, మనం తినే ఆహారం ఆయన సూర్య చంద్రులుగా ఉండి పగలు, రాత్రి తమ కిరణాలతో చేస్తున్న సహాయమే కదా”అన్నాడు విష్ణు ఆరిందాలాగా!
“ఆయన తత్వాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు. అంతేకాదు..ఆయన చైతన్యం అన్ని వస్తువుల్లోనూ, జీవరాశుల్లోను సమానంగా వ్యాపించి..అవి ఎందుకు సృష్టించబడ్డాయో, వాటి చేత ఆ పనులను నియమబద్ధంగా చేయిస్తూ ఉంటాడు. దీనికి ఉదాహరణ ఎవరైనా చెప్పగలరా” అన్నది బామ్మ.
“చెట్లు..పువ్వులు, కాయలు, పండ్లు ఇవ్వటం, నీరు.. దాహం తీర్చటం, చలి కాలంలో.. అగ్ని మనకి కావలసిన వెచ్చదనాన్ని ఇవ్వటం, గాలి.. మనకి ప్రాణ శక్తిని ఇవ్వటం..అంతే కదూ బామ్మా” అన్నాడు మహేష్.
“ఆ శ్రీమన్నారాయణుడికి ధర్మంగా బతికేవాళ్లన్నా, జ్ఞానులన్నా, యోగులన్నా చాలా ఇష్టం. వాళ్లకి కూడా ఆయనంటే చాలా ఇష్టం. కనుకనే ఎప్పుడు ఆయన నామ స్మరణ చేస్తూ అందరికీ ఆయన గురించిన కథలనే చెబుతూ ఉంటారు”.
“ఆ దేవ దేవుడు శ్రీకృష్ణుడిగా ‘శిఖండి’ అంటే నెమలి పింఛాన్ని ధరించాడు. గోకులంలో అందరికీ ప్రీతి పాత్రుడయ్యాడు. ఏ విధమైన భేద భావం లేకుండా సుదామునికి, పాండవులకు, అక్రూరుడికి, కుంతీ దేవికి, భీష్ముడికి, విదురుడికి..ఇలా అందరికీ ఆప్తమిత్రుడయ్యాడు. అలాగే తన మాయతో అధర్మపరులైన పూతన, తృణావర్తుడు, బకాసురుడు, శకటాసురుడు, కంసుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు మొదలైన రాక్షసులందరినీ హతమార్చాడు. అంటే మంచివాడిని తన కరుణతో అక్కున చేర్చుకోగలడు, తప్పు చేస్తే తన మాయతో సంహరించగలడు అని అర్థం.”
“ఇంకా ఆయన ఎప్పుడు తన కరుణని వర్షం లాగా కురిపించగలడు. నీతి నియమాలు లేకుండా అధర్మంగా బతికేవారి మీద క్రోధంగా ఉండి, వారు తప్పు చేస్తుంటే దండిస్తాడు. వారిలో మార్పు తీసుకువచ్చి మంచి వారిగా మారితే అనుగ్రహిస్తాడు. అలా ఈ మొత్తం విశ్వాన్ని తన భుజాల మీద మోసే శేషుడే ఆ దేవ దేవుడు.”
“బామ్మా..అప్పుడేమో ఆ శ్రీ మహా విష్ణువు శేష నాగు మీద పడుకుంటాడు అని చెప్పావు. మరి ఇప్పుడేమో విశ్వాన్ని తన సహస్ర బాహువులతో మోసే శేషుడు ఆ శ్రీమన్నారాయణుడు అంటున్నావేంటి” అని తన ధర్మ సందేహాన్ని వెలిబుచ్చాడు గోపాల్.
“మనం మొదటి నించి చెప్పుకున్నది ఒక సారి గుర్తుకు తెచ్చుకుంటే నీ సందేహం తీరుతుంది. విశ్వం అంతటిలో పాము కూడా భాగమే కదా. అంటే శేషుడి మీద పడుకున్నవాడు “విశ్వం అంత ఆవరించి ఉండే శ్రీమహావిష్ణు:” అవునా. అలాంటప్పుడు ఆ శేషుడు కూడా ఈ విశ్వంలో భాగమే కదా! కాబట్టి మోసేవాడు ఆ శ్రీ మహా విష్ణువే! మోయబడేవాడు ఆ శ్రీమహావిష్ణువే! అంతేకాదు పాము అంటే కాల స్వరూపం. కాలం అనేది జర జరా పాకుతూ ముందుకి వెళుతుంది, చేతికి చిక్కదు. అంతే కాదు కాలం ముందుకు వెళుతుందే కానీ, గడిచిన కాలం వెనక్కి రాదు. అంతేకాదు..ఆ శ్రీమన్నారాయణుడు కాల స్వరూపంగా ఉంటాడు అని కూడా చెప్పుకున్నాము కదా! ఇప్పుడు నీ సందేహం తీరిందా” అన్నది బామ్మ గోపాల్ తల మీద చిన్నగా మొత్తి.
“వెళ్ళండి కాసేపు పెరట్లో ఆడుకుని ఇళ్ళకి వెళ్ళండి” అన్నది బామ్మ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి